India Economic Rise: స్నేహం మాటున అమెరికా కుట్రలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 02:36 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి మోదీకి మంచి మిత్రుడు అని భారతీయుల్లో చాలామంది నమ్ముతారు. ‘మోదీ నాకు మంచి మిత్రుడు. భారతీయులంటే నాకు చాలా ఇష్టం’ అని ట్రంప్ కూడా పలుమార్లు బహిరంగంగా చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి మోదీకి మంచి మిత్రుడు అని భారతీయుల్లో చాలామంది నమ్ముతారు. ‘మోదీ నాకు మంచి మిత్రుడు. భారతీయులంటే నాకు చాలా ఇష్టం’ అని ట్రంప్ కూడా పలుమార్లు బహిరంగంగా చెప్పారు. కానీ అదే ట్రంప్ ఇటీవల భారత్‌లో ఆపిల్ కంపెనీ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ లాంటి కార్యక్రమాలను ఇప్పుడు ట్రంప్, ఒకప్పుడు మాజీ అధ్యక్షుడు బైడెన్ కూడా వ్యతిరేకించారు. అలాగే బైడెన్ హయాంలో భారత ఎన్నికల వ్యవస్థలో అమెరికా జోక్యం చేసుకోవాలని చూసిందని, ఇందుకోసం నిధులు కూడా కేటాయించిందని స్వయంగా ట్రంప్ ఇటీవల కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇది నిజమే అనిపించే ఉదంతాలు కొన్ని మన దేశంలో జరిగాయి కూడా. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలలో జరిగిన రైతు ఉద్యమం; ఢిల్లీలో జరిగిన షాహీన్ బాగ్ ఉద్యమం లాంటివి. ఇవి అచ్చం శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఆ దేశ ప్రభుత్వాలను తల్లకిందులు చేసిన ఉద్యమాలను పోలి ఉండడం గమనార్హం. అంటే రైతు ఉద్యమకారులు దేశ రాజధాని ఢిల్లీకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది భారత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకేనా? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం కేవలం దశాబ్ద కాలంలోనే 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరింది. అందుకే భారత్‌లో కూడా అలాంటి అలజడులు సృష్టించాలనుకుందా అనే సందేహాలు నిజమనిపిస్తున్నాయి. గత చరిత్రను చూస్తే 1972 ప్రాంతంలో అమెరికాలో జనాభా చాలా తక్కువ. ఆ కాలంలో అమెరికాలో పరిశ్రమలు స్థాపిస్తే చవకగా ఉద్యోగులు, కార్మికులు లభించే పరిస్థితి లేదు. అందువల్ల ఆ దేశ పారిశ్రామికవేత్తలు చైనాలో పరిశ్రమలను పెట్టడం ప్రారంభించారు. దీంతో చైనా అనతికాలంలోనే ఎంతో అభివృద్ధిని సాధించింది. అయితే ప్రస్తుతం అమెరికాలో జనాభా పెరిగింది. తద్వారా నిరుద్యోగం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే చైనా పాలకుల వైఖరి కారణంగా చాలామంది పారిశ్రామికవేత్తలు ఆ దేశాన్ని వీడి మరో అనుకూలమైన దేశం కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో వారందరికీ భారత్ అందివచ్చిన ఆశాకిరణంలా కనిపిస్తోంది. అందుకే ఎన్నో పరిశ్రమలు భారత్‌కు తరలి వస్తున్నాయి. అందులో భాగంగానే ఆపిల్ సంస్థ కూడా భారత్‌కు రావాలనుకున్నది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకుంటున్నారు.
ఆ పరిశ్రమ అమెరికా లోనే పెట్టాలని, భారత్‌లో పెడితే అధిక సుంకాలు విధిస్తామని ఇటీవల ఆ కంపెనీని బహిరంగంగా హెచ్చరించారు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండటంతో భారత్ మరింత శక్తివంతంగా మారకుండా చూసేందుకే అప్పుడు బైడెన్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ట్రంప్ సర్కార్ కానీ అడ్డుపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందకూడదంటే ఆ దేశ ఆర్థిక, పారిశ్రామిక, సైనిక శక్తులు పటిష్ఠం కాకూడదు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ లాంటివి విజయవంతం కాకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వివిధ దేశాలలో పర్యటిస్తూ అక్కడి పారిశ్రామికవేత్తలను తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తూ గ్రీన్ కార్పెట్ పరుస్తున్నారు. దీంతో చైనా తదితర దేశాల్లోని పరిశ్రమలు భారత్ బాట పట్టాయి. అందుకే ఇప్పటిదాకా అమెరికా పలుమార్లు భారత్‌లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా పలు రకాల ప్రయత్నాలు చేసింది. అవన్నీ విఫలం కావడంతోనే ఆపిల్ కంపెనీ విషయంలో ఇక ప్రత్యక్ష పోరాటానికి రంగంలోకి దిగింది. భారత్ ఇదే విధంగా అభివృద్ధి సాధిస్తూపోతే తమ అగ్రరాజ్య హోదా వీగిపోయే అవకాశముందని, గతంలో చైనా విషయంలో జరిగిన చారిత్రక తప్పిదం భారత్ విషయంలో జరుగకూడదని అమెరికా భావిస్తున్నది. ఇందుకోసం మన దేశంలోని ప్రతిపక్ష నాయకులను కూడా వాడుకుంటున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత ఆర్థిక రంగాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అడ్రెస్ లేని అమెరికా సంస్థలు ఇచ్చిన రిపోర్టుల పేరుతో షేర్ మార్కెట్లో అక్రమాలు అంటూ దుష్ప్రచారం లేవదీస్తున్నారనీ, ఆ విధంగా అదానీ కంపెనీ లక్షల కోట్లు పోగొట్టుకునేలా చేసి తద్వారా షేర్ మార్కెట్ పతనం చెందేలా చేశారనీ ఒక వాదన. అలాగే కెన్యా ప్రభుత్వం అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్‌కు ఆఫ్రికాలోకి ప్రవేశం ఆగిపోయింది. హిండెన్‌బర్గ్ పేరుతో ఆడిన నాటకం కూడా తెలిసిందే.
ఇజ్రాయెల్‌లో కూడా అదానీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. భారత్ కరోనా వ్యాక్సిన్‌ను స్వయంగా తయారు చేయడం కూడా అమెరికా మెడికల్ మాఫియాకు నచ్చలేదు. అదే సమయంలో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ భారత కరోనా వ్యాక్సిన్ విషయంలో పలు సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే ఆయన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలునూ అక్రమాల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాల్సి వచ్చింది. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ అమెరికా వ్యతిరేకించిన అన్ని అంశాలనూ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటుంది. మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీ కంపెనీలకు దోచిపెడుతుందన్న ప్రచారంతో ఆర్థిక రంగంతోపాటు పారిశ్రామిక రంగం స్వల్ప కుదుపులకు గురైనా మళ్ళీ నిలదొక్కుకున్నాయి. అలాగే స్వావలంబన దిశగా దూసుకెళ్తున్న భారత్ రక్షణ రంగంలోనూ పటిష్టంగా తయారవుతోంది. భారత్‌లో తయారైన మిస్సైల్స్ ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితులను చేశాయి. ప్రతి విషయంలోనూ విదేశాలపై ఆధారపడిన దశ నుంచి అగ్రశ్రేణి యుద్ధ విమానాలు కూడా స్వదేశంలోనే తయారు చేసుకునే స్థాయికి చేరడమే కాకుండా, భారత్ యుద్ధ విమానాల సరఫరాకు విదేశాల నుంచి డిమాండ్ పెరగడం కూడా అమెరికాకు చిరాకును కలిగించి ఉండవచ్చు. భారత్ ఎదుగుదలను అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. కానీ భారత్ సర్వసత్తాక సార్వభౌమాధికార దేశమన్న విషయాన్ని అమెరికా మరచిపోకూడదు. భారత్ లాంటి సువిశాలమైన, అత్యధిక జనాభా గల దేశంలో శక్తిమంతమైన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండడం ఎంతో అవసరం. అంతేగాక పరిపాలన కూడా పారదర్శకంగా ఉన్నప్పుడే అమెరికా లాంటి దేశాల కుట్రలు విఫలమవుతాయి.
-శ్యామ్‌సుందర్ వరయోగి