Ambedkar Vision: దళితులను దళితులే ఎన్నుకోవాలి
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:52 AM
భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతి పెద్దదిగా ప్రశంసలు అందుకుంటోంది. కానీ ఈ దేశపు అత్యంత పీడితులు అయిన దళితులకు ఇది నిజమైన రాజకీయ అధికారాన్ని ఇప్పటిదాకా నిరాకరించింది.
భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతి పెద్దదిగా ప్రశంసలు అందుకుంటోంది. కానీ ఈ దేశపు అత్యంత పీడితులు అయిన దళితులకు ఇది నిజమైన రాజకీయ అధికారాన్ని ఇప్పటిదాకా నిరాకరించింది. ఈ నిరాకరణ మూలాల్లో ప్రధానమైనది డా. బి.ఆర్. అంబేడ్కర్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలు’. ఈ ప్రతిపాదన గతంలో దళితులకు స్వీయ ప్రాతినిధ్యం, స్వయం నిర్ణయాధికారాన్ని హామీ ఇచ్చింది. 1930ల ప్రారంభంలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ‘డిప్రెస్డ్ క్లాసెస్’ (ఇప్పటి షెడ్యూల్డ్ కులాలు లేదా దళితులు)కి రిజర్వుడు స్థానాలు కాకుండా ప్రత్యేక ఎన్నికల అవసరముందని అంబేడ్కర్ వాదించారు. ఈ విధానంలో దళిత ప్రతినిధులను కేవలం దళిత ఓటర్లే ఎన్నుకుంటారు. తద్వారా వారు తమ దళిత సమాజం పట్ల బాధ్యత, జవాబుదారీతనం కలిగిన నేతలవుతారు. ఇది విభజన కోసం కాదు– విముక్తి కోసం, శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల ఆధిపత్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన మార్గంగా అంబేడ్కర్ వాదించారు. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ‘కమ్యూనల్ అవార్డ్’లో ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దాంతో ముస్లింలు, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో–ఇండియన్లు, యూరోపియన్లు, ముఖ్యంగా దళితులకు ప్రత్యేక ఎన్నికల హక్కు ఇచ్చింది. కానీ కొన్ని వారాల లోపే గాంధీజీ దీన్ని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించడంతో అంబేడ్కర్ ఒత్తిడికి లోనై పూనా పాక్ట్ అనే ఒప్పందానికి అంగీకరించారు. దళితులకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యాన్ని, నిర్ణయాధికారాన్ని పొందటానికి అవకాశం ఉన్న ప్రత్యేక ఎన్నికల పద్ధతిని ఈ ఒప్పందం అంతమొందించింది. ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాల పద్ధతిలో, నిర్దిష్ట సముదాయానికి చెందిన ఓటర్లు మాత్రమే తమ సముదాయానికి చెందిన ప్రతినిధులను ఎన్నుకుంటారు. దళిత సమాజం నుంచి వారే తమ నాయకులను ఎన్నుకునే అవకాశం కలిగేది. ఇలా ఎన్నికైన దళిత ప్రతినిధులు ఆ ఓటర్లకు మాత్రమే జవాబుదారీగా ఉండేలా చేస్తుంది, ఇది వారిలో నుంచి నిజమైన దళిత నాయకత్వాన్ని వెలికి తీయగలుగుతుంది. దీనికి విరుద్ధంగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఉమ్మడి ఓటర్ల వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇది ఆధిపత్య కులాలతో సహా నియోజకవర్గంలోని ఓటర్లందరూ రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేయడానికి అనుమతిస్తుంది. ఫలితంగా, దళిత ప్రతినిధులు తరచుగా తమ రాజకీయ మనుగడ కోసం దళితేతర ఓటర్లపై ఆధారపడుతూ, తమ సమాజానికి బదులుగా పార్టీల నాయకులకు విధేయులైపోతున్నారు. ఇది వారి స్వయంప్రతిపత్తిని గణనీయంగా తగ్గిస్తోంది. శతాబ్దాల పాటు కులవ్యవస్థ ఆధిపత్యానికి, అణిచివేతకు లోనైన దళితుల విముక్తికి రాజకీయ అధికారమే మార్గమని డా. అంబేడ్కర్ విశ్వసించారు. ఈ దిశగా ఆయన ఐదు ప్రధాన సూత్రాల ఆధారంగా ప్రత్యేక ఎన్నికల పద్ధతిని ప్రతిపాదించారు.
రాజకీయ స్వాతంత్ర్యం– దళిత నాయకులు తమ ఓటర్లకు బాధ్యత కలిగి, జవాబుదారిగా ఉండాలి కాని చారిత్రకంగా రాజకీయ అధికారాన్ని నియంత్రించిన ఆధిపత్య కులాల పట్ల కాదు. లేనిపక్షంలో వారు కేవలం ఆధిపత్యాన్ని, అణిచివేతని కొనసాగించేవారే అవుతారు; నిజమైన ప్రాతినిధ్యం– అగ్ర కులాల అంచనాలను తీర్చడానికి ఎంపిక చేయబడిన నామమాత్ర (టోకెన్) దళిత అభ్యర్థులు కుల అన్యాయాన్ని సవాలు చేస్తారని ఆశించలేం. దళిత ప్రాతినిధ్యం అంటే దళిత ప్రజల జీవిత అనుభవాలను, పోరాటాలను దృఢంగా ప్రతిబింబిస్తూ, ప్రాతినిధ్యం వహించాలి; నాయకత్వ వికాసం– దళిత సమాజంలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రత్యేక ఎన్నికల వ్యవస్థ ద్వారా నిజమైన దళిత గొంతులకు స్థానం కల్పించడం ద్వారా, సమాజ మార్పు పట్ల నిబద్ధత కలిగిన, ఆత్మవిశ్వాసంతో కూడిన, సమర్థవంతమైన నాయకులను అభివృద్ధి చేయడం దీనితో సాధ్యమవుతుంది; చట్టబద్ధ సాధికారత– కుల వివక్షను నిషేధించే బలమైన, అమలులో పెట్టగలిగే చట్టాలను రూపొందించేందుకు, పరిపాలన వ్యవస్థలో స్వతంత్ర దళిత నాయకత్వమే తోడ్పడగలదు; సాంస్కృతిక గౌరవం– అంబేడ్కర్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాజకీయ అధికార సాధన ద్వారా దళిత సమాజాలు, తీవ్ర కుల వివక్షతో కూడిన సమాజం ద్వారా తమలో తాము పెంపొందించుకొని, జీర్ణించుకున్న ఆత్మన్యూనత భావాలను ఎదుర్కొని అధిగమించగలవు. అంబేడ్కర్ ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదన ఏ రకమైన విభజన కాదు. వాస్తవానికి అది శక్తివంతమైన విధానంగా అన్ని వర్గాలను కలుపుకునే లక్ష్యంతో కూడినది. దళిత ఓటర్లు ద్వంద్వ ఓటును వినియోగించుకుంటారు. ఒకటి– వారి స్వంత సమాజ ప్రతినిధిని ఎంచుకోవడానికి, మరొకటి– విస్తృత జాతీయ ప్రభుత్వానికి సార్వత్రక ఎన్నికలలో అందరితో పాటు పాల్గొంటారు.
ఈ ప్రతిపాదన దళితులకు చాలా కాలంగా నిరాకరించబడిన అధికారం, గౌరవంతో దళితులను సమగ్ర ప్రజాస్వామ్యంలో చేర్చే ఒక సమన్వయ మార్గం. 1909 నుంచి 1947 వరకు ముస్లింలు, సిక్కులు, ఆంగ్లో– ఇండియన్లు ప్రత్యేక ఎన్నికల ప్రయోజనాన్ని అనుభవించారు. 2020 వరకు కూడా ఆంగ్లో–ఇండియన్లకు నామినేటెడ్ సీట్లు ఉండేవి. దళితులకు మాత్రమే ఇచ్చిన హక్కును తొలగించి ఒక మంచి అవకాశాన్ని అందకుండా చేశారు. ఆధిపత్య కులాలు సంయుక్త ఎన్నికల ద్వారా తమ ఆధిపత్యాన్ని, రాజకీయ నియంత్రణ శక్తిని నిలుపుకున్నాయి. 1950 తర్వాత ప్రత్యేక ఎన్నికలు పూర్తిగా రద్దయ్యాయి. రాజ్యాంగం ప్రకారం, ఆర్టికల్ 330 ద్వారా షెడ్యూల్డ్ కులాలకు, వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించారు. కానీ, సంయుక్త ఎన్నికల విధానం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన పార్టీలన్నీ తమకు విధేయత చూపే దళిత అభ్యర్థులను ఎంపిక చేయడం ప్రారంభించాయి. ఆ విధంగా దళిత ప్రాతినిధ్యం నిజానికి దూరంగా, కేవలం ప్రతీకాత్మకంగా మారింది. అసలైన స్వయంప్రతిపత్తి కోల్పోయి, ఇప్పుడు కేవలం టోకెనిజం మాత్రమే మిగిలింది. అప్పట్లో ప్రతిపాదించిన రెండు దశల ఎన్నికల విధానాన్ని అమలు చేయకుండా వదిలేసిన భారత రాజ్యాంగ వ్యవస్థ, దళిత రాజకీయ స్వయం ప్రాతినిధ్యాన్ని ఎప్పటికీ కోల్పోయేలా చేసింది. నిజానికి, ముందుగా ప్రతిపాదించబడిన రెండు దశల ఎన్నికల ప్రక్రియ జాతీయ ఐక్యతను కాపాడుతూ దళిత రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడగలిగే ఒక రాజీ. అయినప్పటికీ, స్వతంత్ర భారతదేశంలో దీనిని ఎప్పుడూ ఆమోదించలేదు, దీనికి కారణం ఖర్చు, పరిపాలనా సంక్లిష్టత, రాజకీయ ప్రతిఘటనలను సాకుగా చూపెట్టారు. రాజకీయ పార్టీలు దళిత అభ్యర్థులను తామే ఎంపిక చేయడం ద్వారా రాజకీయ నియంత్రణను నిలుపుకున్నాయి. దశాబ్దాలుగా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, దళితుల గొంతులు అణగదొక్కబడ్డాయి. చాలా మంది దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా పార్టీ శ్రేణులు, పద్ధతులతో నిర్బంధించబడ్డారు. వీరు దళిత ప్రయోజనాల కోసం స్వతంత్రంగా ఆలోచించలేరు, పనిచేయలేరు. పార్టీలచే దళిత నాయకత్వాలు కబ్జా చేయబడ్డాయి. అసలైన దళిత గొంతులు మూగబోయేలా చేశారు. 2030లో రాజకీయ రిజర్వేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, అంబేడ్కర్ మౌలిక ప్రతిపాదనను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాలు లేదా కనీసం దళితుల నేతృత్వంలోని అభ్యర్థుల ముందస్తు ఎంపిక, దళితులకు రాజకీయ గౌరవం, దళిత నాయకులకు జవాబుదారీతనాన్ని పునరుద్ధరించగలదు.
-లెల్లే సురేష్ దళిత కవి,
సాంస్కృతిక కార్యకర్త