Amaravati Martyrs Memorial: అమరవీరుల స్మారకవనం స్వప్నమేనా
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:14 AM
చరిత్రలో కొన్ని సంఘటనలను మరువలేం. ఇంకొన్ని జ్ఞాపకాలను సదా గుండె లోతుల్లో దాచకుండా ఉండలేం. అలాంటి సంఘటనలు, జ్ఞాపకాలు సమాజానికి సత్తువ ..
చరిత్రలో కొన్ని సంఘటనలను మరువలేం. ఇంకొన్ని జ్ఞాపకాలను సదా గుండె లోతుల్లో దాచకుండా ఉండలేం. అలాంటి సంఘటనలు, జ్ఞాపకాలు సమాజానికి సత్తువ ఇస్తాయి. భావి తరాల భవిష్యత్తుకు దిశా, దశా నిర్దేశం చేస్తాయి. అలాంటి చారిత్రక జ్ఞాపకాల పొరల్లో శాశ్వతంగా గుర్తుకొచ్చేది, మదిని తాకేది ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం. ప్రజా రాజధాని అమరావతిలో ‘అమరావతి రాజధాని రక్షణ’ కోసం ఉద్యమించి, అస్తమించిన అమరవీరుల పేరిట అమర వీరుల పార్కు లేదా స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వాగ్దానం చేశారు. ఇటీవల అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల్లో చికాగోకు చెందిన యలమంచి ప్రసాద్, కాలిఫోర్నియాకు చెందిన శ్యామ్ అరబింది, టెక్సాస్‌కు చెందిన వేనుగుంట రాజేశ్, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడిగా నేనూ అమరావతిలో అమరవీరుల పార్క్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, అందుకు కావలసిన స్థలాన్ని కేటాయించాలని తీర్మానం కూడా చేశాం. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా, ఆ వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చడం లేదు.
నాడు అధికార వైకాపా తప్ప, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు అమరావతి ఉద్యమంతో కరచాలనం చేశాయి. రైతులు చేపట్టిన ఈ చరిత్రాత్మక ఉద్యమంలో ఆయా పార్టీలూ ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. రైతులు రాజధాని కోసం భూములను ఎలా త్యాగం చేశారో, అమరావతి కోసం కూడా అలాగే పోరాటం చేశారు. ఉద్యమ సమయంలో రైతులు ఎన్నో ఆవేదనలను, అవమానాలను భరించారు. అయినా మొక్కవోని దీక్షతో 1631 రోజులు ఉద్యమించారు. ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 274 మంది రైతులు, మహిళలు, ఉద్యమ నాయకులు అసువులు బాసారు. మందడం గ్రామానికి చెందిన గద్దె ప్రభావతి రాజధాని ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. ‘అమరావతి–అరసవిల్లి పాదయాత్ర’ను రామచంద్రపురంలో నిలిపేయటంతో ఆవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గడ్డం మార్టిన్ దళిత జేఏసీ అధ్యక్షుడు. ఉద్యమంలో ఎంతగానో పోరాడారు. ఆయనపై కేసులు పెట్టి, ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోయారు. నారా కోడూరుకు చెందిన నన్నపనేని కోటేశ్వరావు కూడా ఉద్యమంలో అమరులయ్యారు. చిలకలూరిపేటకు చెందిన కుండబద్దలు సుబ్బారావు ఆరు పదులు నిండిన వయసులో, డయాబెటిస్ ఉన్నా, అమరావతి కోసం ‘కుండబద్దలు’ కొడుతూనే ఉండేవారు. జగన్మోహన్‌రెడ్డిపై ఒంటి కాలితో యుద్ధం చేశారు. హైదరాబాద్‌కు చెందిన గోసాల ప్రసాద్ రాజకీయ విశ్లేషకులు. రాజధాని కోసం తపించేవారు. తాడేపల్లికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయ్ కుమార్, ఆయన సతీమణి బొప్పన విజయకుమారి అమరావతి ఉద్యమంలో ఒక సాంస్కృతిక దళాన్ని ఏర్పాటు చేశారు. సొంత డబ్బులను ఖర్చుపెట్టి మరీ పాటలు రాస్తూ, పాడిస్తూ ఉద్యమ సహకారం అందించారు. వారిద్దరూ ఇప్పుడు లేరు. అనంతవరంకు చెందిన 80 ఏళ్ల యెడ్లూరి పార్వతమ్మ ఒక్క రోజు కూడా విడువకుండా దీక్షా శిబిరంలో కూర్చునేవారు. ఒక చేత్తో అమరావతి జెండా, మెడలో ఆకుపచ్చని కండువా దాల్చి స్ఫూర్తిదాయకంగా ఉండేవారు. పెదపరిమి బాలయ్య దీక్షా శిబిరాన్ని ఛిద్రం చేయడానికి వచ్చిన పోలీసుల ప్రయత్నాలను ‘రామరాజు’లా విఫలం చేశారు. శిబిరానికి రక్షకుడిగా నిలిచారు. ఇలా రాజధాని ఉద్యమంలో అసువులు బాసినవారు ఎందరో. అమరావతిలో వారందరి పేరిట ‘అమరావతి స్మృతి వనం’ నిర్మించాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఉద్యమ సంకల్ప బలాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరమూ ఉంది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే’ అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకుంటుందని ఆశిద్దాం.
-పోతుల బాలకోటయ్య అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు