Amaravati Launches Major Financial Revolution: అమరావతిలో ఆర్థిక విప్లవం!
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:44 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రాన్ని దేశ ఆర్థిక పటంలో ముందంజలో నిలబెట్టే చారిత్రాత్మక ఘట్టానికి పునాది వేసాయి....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రాన్ని దేశ ఆర్థిక పటంలో ముందంజలో నిలబెట్టే చారిత్రాత్మక ఘట్టానికి పునాది వేసాయి. ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలకు, రెండు బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చెయ్యడంతో అమరావతిలో ఆర్థిక విప్లవం ఆరంభమయింది. వీటి ఏర్పాటు ద్వారా రూ.1,334 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,576 ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) వెల్లడించింది. అమరావతిలో బ్యాంకుల విస్తరణ వల్ల పెట్టుబడులు, వాణిజ్యం, నిర్మాణ రంగం మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల విస్తరణకు, కొత్త కంపెనీల ఏర్పాటుకు, స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలకు రుణాల లభ్యత పెరగనుండటం నగర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనుంది. అమరావతి పరిధిలోని ప్రజలందరికీ ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరనున్నాయి. అమరావతిపై బ్యాంకింగ్ రంగం చూపుతున్న విశ్వాసం, నగర భవిష్యత్తుపై పెట్టుబడిదారులకు కలిగిన నమ్మకానికి ప్రతీక.
అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. భారతదేశంలోని ముంబై, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, హైదరాబాద్ గచ్చిబౌలి తరహాలో, ప్రపంచ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, స్టాక్ ట్రేడింగ్ సర్వీసులు వంటి ప్రతిష్ఠాత్మక ఆర్థిక సంస్థల కేంద్రంగా నిలిచే ప్రణాళిక ఇది. అంతర్జాతీయ పెట్టుబడులకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ముఖద్వారం కానున్నది. అమరావతిలో ప్రపంచస్థాయి వాణిజ్య భవనాలు, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్, డేటా సెంటర్లు, హై–ఎండ్ ఐటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ జోన్లు, స్టార్టప్, ఇన్నోవేషన్ వేదికల ఏర్పాటు వంటివన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో గేర్ మార్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక శక్తిగా నిర్మించే నూతన యుగంలో సీఎం చంద్రబాబు చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయం.
– నీరుకొండ ప్రసాద్