Share News

Modern Skills for Graduates: రేపటి తరానికి మూడు నవీన విద్యానైపుణ్యాలు

ABN , Publish Date - May 20 , 2025 | 02:50 AM

భవిష్యత్తు ఉద్యోగాలలో విజయం సాధించేందుకు, కంప్యూటేషనల్ థింకింగ్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజైన్ థింకింగ్‌ వంటి ఆధునిక నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాలను అండర్ గ్రాడ్యుయేట్‌ విద్యలో భాగంగా కల్పించడం ద్వారా విద్యార్థులను సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించగల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.

Modern Skills for Graduates: రేపటి తరానికి మూడు నవీన విద్యానైపుణ్యాలు

సాంకేతిక పురోగతితోపాటు పలు వృత్తులలో పనిచేసే పద్ధతులు కూడా వేగంగా మారుతున్నాయి. పరిశ్రమలు విస్తృతంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వినియోగిస్తున్నాయి. పని తీరును డిజిటలైజ్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా పరిశ్రమల యాజమాన్యాలు ఆ రంగాల్లో నిపుణులైనవారినే గాక, విమర్శనాత్మకంగా ఆలోచించగల, సృజనాత్మకంగా పనిచేయగల గ్రాడ్యుయేట్లను కోరుకుంటున్నాయి. దశాబ్దాలుగా భారతీయ ఉన్నత విద్య లోతైన అంశాలవారీ విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించింది. ఈ సాంప్రదాయ విద్య విద్యార్థులకు పునాది లాంటి విజ్ఞానాన్ని అందజేసినా, ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళకు వారిని సంసిద్ధం చేసేందుకు చాలాసార్లు అది సరిపోవటం లేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్య స్వరూపంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మూడు ముఖ్యమైన ఆధునిక నైపుణ్యాలు నేడు కీలకంగా మారాయి. అవి– కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ), కృత్రిమ మేధస్సుపై అవగాహన (ఏఐ), డిజైన్ థింకింగ్ (డీటీ). సాంప్రదాయ విద్య ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానం ఇక భవిష్యత్తు తరాలకు సరిపోదు. అంశాలవారీ విజ్ఞానంతో పాటు సమస్య పరిష్కారం, సాంకేతిక అవగాహన, విభిన్న ఆలోచనలను ఏకీకృతం చేయగల మూడు ముఖ్యమైన ఆధునిక సామర్థ్యాలు (సీటీ–ఏఐ–డీటీ)తో సన్నద్ధం చేయాలి. కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ) అనేది సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి, పరిష్కారాలను రూపొందించడంలో కంప్యూటర్ సైన్స్ పద్ధతులను ఉపయోగించే విధానం. ఇందులో క్లిష్టమైన సమస్యలను సులభంగా చేయగల భాగాలుగా విభజించడం, నమూనాలను గుర్తించడం, అల్గారిథమ్‌లను తయారు చేయడం, ముఖ్యమైన సమాచారంపై దృష్టిసారించి ప్రాధాన్యం లేని వివరాలను వడపోసి సమస్యా పరిష్కార పద్ధతులను రూపొందించడం... వంటివి ఇమిడి ఉంటాయి. దీనిని అన్ని రంగాలలోనూ ఉపయోగించవచ్చు. ఏఐ అక్షరాస్యత (ఏఐ లిటరసీ) నేటి కాలంలో ఎంతో కీలకంగా మారింది. ఏఐ అభివృద్ధి అటు పరిశ్రమల పనితీరును, ఇటు నిత్య జీవితాన్ని వేగంగా మారుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏఐకి సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ కీలకం. ఏఐ అక్షరాస్యత అంటే– మనుషులు విషయాలను నేర్చుకునే విధానాన్ని, సమస్యలను పరిష్కరించే పద్ధతిని, నిర్ణయాలు తీసుకునే తీరును, కొత్త ఆలోచనలను విడమరచి చెప్పే సామర్థ్యాన్ని యంత్రాలు ఎలా అర్థం చేసుకుంటాయో తెలుసుకోవడం.


పెరుగుతున్న కృత్రిమ మేధ సమ్మిళిత (ఏఐ ఇంటిగ్రేటెడ్) ప్రపంచాన్ని ముందుకు నడపడానికి గాను ఏఐ పనితీరు, పరిమితులు, నైతిక బాధ్యతలను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. వినియోగదారుల అవసరాలు, సాంకేతికపరమైన అవకాశాలు, వ్యాపార సాధ్యాసాధ్యాలను సమన్వయపరిచే మానవ కేంద్రీకృతమైన ఆవిష్కరణ విధానమే డిజైన్ థింకింగ్ (డీటీ). ఇది ఐదు దశల ప్రక్రియ. ఇతరుల అవసరాలను సానుభూతితో అర్థం చేసుకోవడం, నిర్వచించడం, కొత్త రూపకల్పనలను సూచించడం, ఆమోదించిన నమూనాను రూపకల్పన చేయడం, ఆ నమూనా పరీక్ష చేయడం. వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా సమస్యలను అర్థం చేసుకోవడంలో, కొత్త పరిష్కారాలను రూపొందించడంలో ఇది ఎంతో సహాయ పడుతుంది. పలు వృత్తుల వారికి అవసరమైన ప్రాథమిక అంశాలుగా ఈ మూడు నైపుణ్యాలు రూపొందాయి. కళలు, వాణిజ్యం, సైన్స్‌, న్యాయవిద్య తదితర రంగాలలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలను అండర్ గ్రాడ్యుయేట్ విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. దీనికోసం ఒక సమగ్ర విధానం రూపొందించి, దేనిని, ఎలా బోధించాలో పునరాలోచించాలి. సిద్ధాంత పరంగా వివరించే కంటే, ఆచరణాత్మకంగా నైపుణ్యాలను పెంపొందించేలా కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ, డిజైన్ థింకింగ్ కోర్సులను ప్రధాన పాఠ్యాంశాలలో చేర్చాలి. ఈ మార్పులను అమలు చేయడానికి ముందు పాఠ్యాంశాలను జాగ్రత్తగా తీర్చిదిద్దాలి. తగిన వనరులను సమకూర్చాలి. ఈ ఆధునిక సమ్మిళిత విద్య ద్వారా గ్రాడ్యుయేట్లు తమ అంశాలవారీ జ్ఞానాన్ని వినూత్న నైపుణ్యాలతో అన్వయించగలుగుతారు. విమర్శనాత్మక ఆలోచన చేయగలుగుతారు. సమస్యకు తగ్గ పరిష్కారం కనుగొనడానికి అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులను వినియోగించగలుగుతారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 వివిధ రకాల సబ్జెక్టులు నేర్చుకోవడం, లోతుగా ఆలోచించడం, డిజిటల్ అక్షరాస్యతకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ ప్రతిపాదించిన పాఠ్యాంశాలు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటికే సమతూకంగా ఉన్న పాఠ్య ప్రణాళికలకు మరిన్ని అంశాలను జోడించే బదులు, ఈ అత్యాధునిక కోర్సులు విద్యార్థులను మరింత రాటుదేలేలా, ఉపాధికి పనికొచ్చేలా చేస్తాయి. ఇవి కేవలం సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే కాదు, అన్నిరకాల గ్రాడ్యుయేట్లకు అవసరమైన ప్రాథమిక అక్షరాస్యతలు. విశ్వవిద్యాలయాలన్నీ కంప్యుటేషనల్‌ థింకింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజైన్‌ థింకింగ్‌లను తమ అండర్ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రధాన భాగాలుగా వేగంగా అమలు చేయాలి. భవిష్యత్తు సమాధానాలు గుర్తుంచుకునే వారిది కాదు, సరైన ప్రశ్నలు అడిగి, మెరుగైన పరిష్కారాలను సూచించే వారిది!

ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్వి

శ్రాంత ఆచార్యుడు, ఐఐటీ మద్రాసు

Updated Date - May 20 , 2025 | 02:52 AM