Share News

Strengthening Ties: అఫ్ఘాన్‌ మైత్రి

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:52 AM

అఫ్ఘానిస్థాన్‌ విదేశాంగమంత్రి మనదేశం‍లో తొలిసారిగా కాలూనడమే కాక, ఢిల్లీలో కూచొని పాకిస్థాన్‌ను చెడామడా ఏకేయడం పాలకులకు సహజంగానే సంతోషం కలిగిస్తుంది....

Strengthening Ties: అఫ్ఘాన్‌ మైత్రి

అఫ్ఘానిస్థాన్‌ విదేశాంగమంత్రి మనదేశం‍లో తొలిసారిగా కాలూనడమే కాక, ఢిల్లీలో కూచొని పాకిస్థాన్‌ను చెడామడా ఏకేయడం పాలకులకు సహజంగానే సంతోషం కలిగిస్తుంది. మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియకపోతే, నాటో, సోవియట్‌ యూనియన్‌, అమెరికాలని అడిగితెలుసుకో అంటూ మన పొరుగుదేశాన్ని ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు విన్నవారికీ, చూసినవారికి తెగనచ్చేసి ఉంటాయి. వారం రోజుల భారత పర్యటనకు తాను ఉపక్రమించగానే, ‘తెహ్రీక్‌–ఎ– తాలిబాన్‌ పాకిస్థాన్‌’ (టీటీపీ) స్థావరాలమీద పాకిస్థాన్‌ దాడులకు దిగడం, ఆ సంస్థ అధినేత నిర్మూలనే లక్ష్యంగా భీకరంగా విరుచుపడుతున్నట్టు పాక్‌ మీడియా చెప్పుకోవడం ముతాఖీకి కోపం తెప్పించింది. అఫ్ఘాన్ల ధైర్యసాహసాలను పరీక్షించి, ప్రమాదంలో పడవద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించడంతోపాటు, తమ గడ్డమీదనుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలను ఏ మాత్రం అనుమతించబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఒక్క మహిళా పాత్రికేయురాలు కూడా లేని విలేఖరుల సమావేశంలో ఉభయదేశాల సంబంధాల గురించి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీ ఎంతో చక్కని వ్యాఖ్యలు చేశారు, భారత్‌ తమకు ఎంతో ముఖ్యమైన, మిత్రదేశమని ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ళ తరువాత భారత్‌–అఫ్ఘాన్‌ మధ్య అత్యున్నతస్థాయి భేటీ జరిగింది. విదేశాంగమంత్రులు ఇద్దరూ కరచాలనాలు చేసుకున్నారు, చేయీచేయీ కలిపి ముందుకు సాగాలన్న లక్ష్యాన్ని ప్రకటించుకున్నారు. తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకుండానే, కొద్దికాలంలోనే భారత్‌ చాలా దగ్గరైంది.


ఇప్పుడు ఓ ఇరవై అంబులెన్స్‌లు, వైద్యపరికరాలు ఇవ్వడం వంటి సుహృద్భావ చర్యలను అటుంచితే, ప్రకృతివైపరీత్యాల్లో దానిని ఆదుకుంటూ, ఆహారధాన్యాలు, మందులు వంటివి అందిస్తూ, మూడు బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టులను కూడా అక్కడ చేపడుతోంది. తాలిబాన్‌ పునరాగమనానికి ముందు, అష్రాఫ్‌ ఘనీ పాలనాకాలంలో అయితే వేలకోట్లు కుమ్మరించింది. ఇప్పుడు మరో ఆరు కొత్త ప్రాజెక్టులకు భారత్‌ సిద్ధపడటంతో పాటు, కాబూల్‌లో నామమాత్రంగా ఉన్న సాంకేతిక కార్యాలయాన్ని పూర్తిస్థాయి దౌత్యకార్యాలయంగా మార్చాలన్న నిర్ణయం బంధం మళ్ళీ బలపడుతోందనడానికి నిదర్శనం. అఫ్ఘానిస్థాన్‌ తన గనుల రంగాన్ని భారత కంపెనీలకు తెరవడం మరో మంచి పరిణామం. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గాం దాడిని ఖండించడంతో పాటు, ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో సైతం అఫ్ఘానిస్థాన్‌ మనపక్షానే నిలిచింది. అఫ్ఘాన్‌లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తనకు అప్పగించని పక్షంలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని అమెరికా అధ్యక్షుడు తాలిబాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ససేమిరా ఇచ్చేది లేదంటున్న తాలిబాన్‌ను రష్యా, చైనా, పాకిస్థాన్‌లతోపాటు భారత్‌ కూడా మొన్న మంగళవారం వెనకేసుకొచ్చింది. తాలిబాన్‌ ప్రభుత్వాన్ని రష్యా మాత్రమే గుర్తించింది. గుర్తించిందీ లేనిదీ ప్రపంచానికి చెప్పకుండా, రాయబారిగా ఒకరిని అనుమతించి, చైనా అతివేగంగా తాలిబాన్‌ ప్రభుత్వానికి ఇప్పటికే దగ్గరై, ఆర్థికంగా ప్రయోజనం పొందుతోంది. చైనా–పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను ఇక్కడివరకూ విస్తరించే ఆలోచనలోనూ ఉంది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో తాలిబాన్‌ను దగ్గరచేసుకోవడం భద్రత రీత్యా ఎంతో ముఖ్యమని భారత్‌ గ్రహించింది. అఫ్ఘానిస్థాన్‌ను అమెరికా సైన్యం విడిచిపోగానే అతికొద్దిగంటల్లోనే తాలిబాన్‌ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, అంతా అల్లాదయ అంటూ అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆనందాశ్రువులు కురిపించడం తెలిసినవే. అయితే, గతంలో మాదిరిగా పాకిస్థాన్‌ చెప్పినట్లు తాలిబాన్ ఆడకపోవడంతో అనతికాలంలోనే అఫ్ఘాన్‌–పాకిస్థాన్‌ మధ్య వ్యవహారం చెడింది. తాలిబాన్‌ ప్రోత్సాహంతోనే టీటీపీ విధ్వంసానికి పాల్పడుతోందని పాకిస్థాన్‌ ఆరోపణ. గత ఏడాది డిసెంబరులో ఉగ్రవాదులన్న ఆరోపణతో యాభైమంది అఫ్ఘాన్లను పాకిస్థాన్‌ హతమార్చిన ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించి తాలిబాన్‌కు దగ్గరైంది. భద్రతామండలి ముత్తాఖీని ఉగ్రవాదిగా ప్రకటించి, ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఈ పర్యటనకోసం మన పాలకులు భద్రతామండలిమీదే ఒత్తిడితెచ్చి తాత్కాలిక మినహాయింపు సాధించారట. ఇక, తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించడమన్న ఆనవాయితీ కూడా త్వరలోనే తీరిపోవచ్చు.

Updated Date - Oct 11 , 2025 | 01:52 AM