Share News

Operation Kagar: ఎవరికీ పట్టని మరో యుద్ధం

ABN , Publish Date - May 17 , 2025 | 03:38 AM

ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండ, మిలిటరీ ఆపరేషన్లను 'ఆపరేషన్ కగార్' పేరుతో న్యాయపరచే ప్రయత్నం జరుగుతోంది. మావోయిస్టులు కోరుతున్న శాంతిచర్చలకే పరిష్కారం దిశగా మార్గం ఉన్నదని ఈ వ్యాసం పిలుపు ఇస్తుంది.

Operation Kagar: ఎవరికీ పట్టని మరో యుద్ధం

కోర్టులు, చట్టాలు తమనేమీ చేయవన్న నమ్మకంతో ఆదివాసీలపైన, వారికి అండగా నిలుస్తున్న మావోయిస్టులపైన భారత సైనిక బలగాలు జరిపిన హంతక చర్యకి వేదికగా నిలిచింది కర్రెగుట్ట. ఆదివాసీలకు తిండి అందకుండా చేశారు, షాపులను సంతలను బంద్ చేయించారు, పారామిలటరీ బలగాలు గ్రామాలకు గ్రామాలు దిగ్బంధించి కాల్పులు జరిపాయి. దండకారణ్య అదివాసీలకు, మధ్య భారతదేశానికి అసలు రాజ్యాంగం వర్తిస్తుందా? అటవీ ప్రాంతంలో ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టుతుంటే వ్యతిరేకించిన ప్రజలు దేశద్రోహులవుతున్నారు. ప్రభుత్వ పెద్దలే దేశ ద్రోహం తలపెడుతుంటే, అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న నిజమైన దేశభక్తుల్ని సైన్యం చేత చంపించడాన్ని ‘ఆపరేషన్ కగార్’ అంటున్నారు. మనం యుద్ధం మధ్యలో ఉన్నాం. ఇది భారత్ పాకిస్థాన్ యుద్ధం కాదు. ఆదివాసీ ప్రాంతాల్లో సాగుతున్న ఈ యుద్ధాన్ని నివారించాలంటే మధ్యభారత ఆదివాసీలకు అండగా నిలుస్తున్న మావోయిస్టులు కోరుతున్న శాంతి చర్చలకు పూనుకొని ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి. అదివాసీలు ఎందుకు పోరాడుతున్నారో, వారు కోరుతున్నదేమిటో ప్రపంచానికి చెప్పగలిగే అవకాశం వారికి కలిగినప్పుడే పరిష్కారం సాధ్యమవుతుంది.


భారత సైనిక బలగాలు ఆదివాసీలను, మావోయిస్టులను ఎలా ఊచకోత కోశారో, హెలీకాప్టర్ల నుంచి అత్యాధునిక ఆయుధాలతో, బాంబు దాడులతో ఎలా ఏకపక్ష కాల్పులకు ఒడిగట్టారో చూశాం. 50 డిగ్రీల ఎండలో తీవ్రమైన వేసవి కాలంలో ఆకు ఎండిపోయి తుపాకీ తూటాలకు అడవి తగలబడి, ఆదివాసీల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ఈ మారణ హోమాన్ని ప్రశ్నించే, ఎదిరించే పరిస్థితే లేకుండా పోయింది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు ఏజెన్సీ ప్రాంతమంతా ఆదివాసీ ప్రజలను అస్థిరపర్చి, వారి పాదాల కింద ఖనిజ సంపదను దోచుకెళ్లడమే లక్ష్యంగా ఈ భీకర కాల్పులకు, దాడులకు పాలకులు పూనుకుంటున్నారు. 63 మంది అపర కుబేరుల్ని తయారు చేసిన ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి ఆదివాసులను ఇలా నిరాశ్రయులుగా చేస్తూ దాన్ని ‘కొలాటరల్ డేమేజ్‌’ అంటున్నారు. ఎన్నికల్లో గెలవాలని ఆశించే పార్టీ ఏదీ కూడా ఈ ఎన్‌కౌంటర్ల పట్ల ఒక నైతిక వైఖరిని తీసుకోదు. ఇప్పుడు మనకు కావాల్సింది నిజాన్ని నిజం అని చెప్పడానికి సంసిద్ధమైనవాళ్లు, సాహసికులైన పాత్రికేయులు, న్యాయవాదులు, రచయితలు, కవులు.

– మెంతెన సంజీవరావు

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర కో కన్వీనర్

Updated Date - May 17 , 2025 | 03:40 AM