Share News

Adilabad: యూనివర్సిటీ లేని జిల్లా!

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:12 AM

ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీసంపద, సున్నపురాయి, మాంగనీస్‌ నిక్షేపాలు, విస్తృతమైన పత్తిసాగు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్నాయి...

Adilabad: యూనివర్సిటీ లేని జిల్లా!

ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీసంపద, సున్నపురాయి, మాంగనీస్‌ నిక్షేపాలు, విస్తృతమైన పత్తిసాగు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్నాయి. వీటి వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పరిశోధనలు చేరుకుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు కూడా మెరుగుపడతాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో యూనివర్సిటీ నెలకొల్పడం వల్ల జిల్లా వ్యాప్తంగా అనుబంధంగా డిగ్రీ కాలేజీలు, టెక్నికల్‌ విద్యా కోర్సులు పెరిగే అవకాశముంది. ఉన్నత చదువులతో మానసిక వికాసం మెరుగుపడుతుంది. అంతరించిపోతున్న గిరిజన కళలు, సంస్కృతి, భాషలపై పరిశోధనలు విరివిగా జరుగుతాయి. స్థానిక భాషా, సాహిత్యాలపై పరిశోధన, అధ్యయనాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో యూనిర్సిటీ కోసం యూజీసీ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం అనుకూలమైనదిగా నిర్ణయించింది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు జీఓ విడుదల చేసింది. తరువాత 2011లో కూడా అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు జీఓ జారీ చేసింది. సుమారు 300 ఎకరాల భూమిని ఉట్నూర్‌లో ఐటీడీఏ కేటాయించింది. కాని అప్పటి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల మంజూరైన యూనివర్సిటీ ములుగు జిల్లాకు తరలిపోయింది. 2015 నుంచి సుమారు 4, 5 సంవత్సరాలు ఆదిలాబాద్‌ జిల్లా విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి యూనివర్సిటీ సాధన కోసం తీవ్రమైన పోరాటాలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్‌లు ఉధృతంగా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల నుంచి రాష్ట్ర నాయకులపై ఒత్తిడి తెచ్చారు, అయినా అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యారంగంలో సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం, వివక్ష, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆదిలాబాద్‌పై కొనసాగడం చాలా విచారకరం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనుల కోసం మంజూరైన ‘‘కొరట చనకా’’ రిజర్వాయర్‌ పనులు కుంటుతూ నడుస్తున్నాయి. మంజూరైన విమానయానం, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ మధ్యలోనే ఆగిపోయాయి. మూతబడ్డ సీసీఐ పునరుద్ధరణ కోసం ఇప్పటి పాలకులకు చిత్తశుద్ధి కరువైంది. ఐటీ హబ్‌ పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికైనా ఆదిలాబాద్‌ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరుస్తాయని ఆశిద్దాం.

-ఉదారి నారాయణ

Updated Date - Nov 04 , 2025 | 04:12 AM