ప్రభుత్వోద్యోగులు జవాబుదారీగా ఉండాలి
ABN , Publish Date - May 27 , 2025 | 12:59 AM
పబ్లిక్ సర్వెంట్లు అధికార దుర్వినియోగం, చట్టాలు నిర్వీర్యం చేయకుండా నిరోధించడానికి ఆటంకం కలిగిస్తున్న ‘సద్దుద్దేశ్య చర్యలకు రక్షణ’ పేరుతో అవినీతి నిరోధక చట్టం, నేర విచారణ చట్టం తదితర చట్టాలలో ఉన్న నిబంధనలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం...
పబ్లిక్ సర్వెంట్లు అధికార దుర్వినియోగం, చట్టాలు నిర్వీర్యం చేయకుండా నిరోధించడానికి ఆటంకం కలిగిస్తున్న ‘సద్దుద్దేశ్య చర్యలకు రక్షణ’ పేరుతో అవినీతి నిరోధక చట్టం, నేర విచారణ చట్టం తదితర చట్టాలలో ఉన్న నిబంధనలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల గడిచినా, ఇంకా పాత–కొత్త భూ సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం నిత్యం బాధితులు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను ఆశ్రయిస్తున్నారు. వీరు ఆ అర్జీలను సంబంధిత అధికారులకు తగు చర్యల నిమిత్తం పంపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన సమస్యల కోసం కొద్ది సంఖ్యలో ప్రజలు వీరి వద్దకు రావాలి. దానికి విరుద్ధంగా చిన్న సమస్యల నుంచి పరువు–మర్యాదలు, జీవన్మరణ సమస్యల దాకా వీరి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికీ రాజకీయ జోక్యం, పని భారం, వ్యక్తిగత ప్రయోజనాలు ప్రభావం చూపిస్తున్నాయి. వాస్తవానికి పబ్లిక్ సర్వెంట్లలో అధిక శాతం సేవాభావంతోనే విధులు నిర్వహిస్తున్నారు. కాని దారితప్పిన కొంతమందితో ప్రభుత్వ సేవకుల పరువుప్రతిష్ఠలు దిగజారుతున్నాయి. పబ్లిక్ సర్వెంట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ సమస్యలను సంవత్సరాల తరబడి పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యోగులు ప్రజల్ని వేధిస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్లకి ‘రక్షణ’ పేరుతో ఉన్న నిబంధనలు వారికి కవచాలుగా ఉన్నాయి. ఒక ఉద్యోగి నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులో తన విధి నిర్వహిస్తే అందుకు తగిన ఆధారాలు ఉంటాయి. చేయని నేరాలను అంటకట్టి తప్పుడు కేసులు పెట్టే బాపతు సామాన్య ప్రజానీకంలో నూటికి ఒక్కరు ఉంటారు. ఆ సందర్భంలో అన్ని రుజువులు పబ్లిక్ సర్వెంట్లకు అందుబాటులో ఉంటాయి.
కాబట్టి నిరూపించుకుని, బయటపడడం సులువు. ప్రభుత్వోద్యోగి అధికార దుర్వినియోగాన్ని లేదా చట్టం నిర్వీర్యం చేయడాన్ని నిరూపించాలంటే సామాన్య ప్రజానీకానికి చాలా కష్టమైన పని. అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు తమ వద్దకు వచ్చే ఫిర్యాదులు పరిష్కారం చేయడంతో పాటు అసలు తమ వద్దకు సమస్య వచ్చేదాకా పరిష్కారం చేయకపోవడానికి కారణాలు ఏమిటో అధికారుల నుంచి సంజాయిషీ కోరాలి. అందులో నిర్లక్ష్యం లేదా కారణాలు సరిగా లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తే, భవిష్యత్తులో ఈ తప్పిదాలు పునరావృతం కావు.
డి.వి. లక్ష్మీనారాయణ, గుంటూరు
ఇవి కూడా చూడండి
నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి