AP Corruption: మద్యం మాటున జగన్నాటకం
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:55 AM
మందు బాబుల గొంతుల్లో గరాటాలు పెట్టి, గరళం పోసి, లక్షలాది కుటుంబాల్లో శోకాగ్నులు రగిలించి..
మందు బాబుల గొంతుల్లో గరాటాలు పెట్టి, గరళం పోసి, లక్షలాది కుటుంబాల్లో శోకాగ్నులు రగిలించి, జగన్‌రెడ్డి ముఠా దోచుకొన్న రూ. 3,500కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ రికవరీ’ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేయాలి. ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు చేర్చాలి. హత్యా నేరం కన్నా ఆర్థికనేరం చాలా ప్రమాదకరమని అత్యున్నత న్యాయస్థానం పదే పదే చెబుతున్నది. కాలకూట విషం వంటి మందును తాగించి జనాన్ని రోగాల పాలు జేసి, మద్యం విక్రయాల ద్వారా దండుకున్న వేలకోట్ల రూపాయలను రికవరీ చెయ్యకపోతే చట్టబద్ధమైన పాలనకు ఇక అర్థమేముంటుంది? అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని నంగనాచి కబుర్లు చెప్పి, ఆ వాగ్దానాలు అన్నింటికీ మంగళం పాడి, దేశంలో మరెక్కడా కనీవినీ ఎరగని స్థాయిలో మద్య కుంభకోణానికి జగన్‌రెడ్డి పాల్పడ్డారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు లావాదేవీలకు మాత్రమే అనుమతించి స్వాహా పర్వానికి పాల్పడ్డారు. మోసకారి మాటలతో మద్యం మహమ్మారిని రాష్ట్రం మీదకు వదిలి జనం సొమ్మును, ఆయురారోగ్యాలను దోచారు. జగన్‌రెడ్డి హయాంలో పిచ్చి మందు విక్రయాల విలువ ఏకంగా 43.7శాతం పెరిగింది. విషతుల్యమైన బ్రాండ్లను జనం మీదకు వదలడంతో ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణా అభాగ్యులు నష్టపోయింది రూ.40వేల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రభుత్వ మద్యం మాయ కారణంగా రూ.18వేల కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోగా, మద్యం సరఫరా సంస్థల నుంచి రూ.3,500కోట్ల వరకు కమీషన్లను జగన్ ముఠా దండుకొన్నది.
జగన్ హయాంలో జరిగినంతటి భారీ మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందం గత ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసింది. సిట్ బయటపెట్టిన అంశాలపై సిగ్గుపడాల్సిన జగన్‌రెడ్డి అది వదిలేసి– ఇది రాజకీయ కక్ష సాధింపు అని, లేని లిక్కర్ స్కామ్‌ను ఉన్నట్లు చూపిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.43వేల కోట్లు దోపిడీ చేసినట్లు సీబీఐ నిగ్గుతేల్చినప్పుడు కూడా నయా పైసా ఎరుగనని నానా యాగీ చేసిన ఘనుడు జగన్‌రెడ్డి. ప్రజాధనం దోచుకోవడం, ఇతరులు పైకి నెట్టడం ఆయనకి అలవాటుగా మారింది.
మాజీ సీఎం జగన్‌రెడ్డి పాత్ర నేరుగా ఎక్కడా కనిపించకపోయినా, ఆదేశాలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయని, డిస్టిలరీస్ నుంచి లభించిన ముడుపులు మూలవిరాట్‌కే చేరాయని సిట్ నిర్ధారించింది. జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ, కీలక నిందితుడు, జగన్‌రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డేనని, ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెంచి రూ.3,500కోట్ల వరకు ముడుపులు మేసి, అందులో పెద్ద మొత్తం సొమ్మును మూల విరాట్‌కి చేర్చింది మిథున్‌రెడ్డేనని సిట్ తేల్చింది. ఏ కంపెనీ ఎంతెంత కమీషన్ ఇచ్చిందీ, ఎవరికి ఎక్కడ చెల్లించిందీ, ముడుపులు ఏయే రూపాల్లో అందిందీ కూడా కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో తెలియజేసింది. డిస్టిలరీలను భయపెట్టి ముడుపులను మొదట 12శాతం నుంచి తర్వాత 20శాతానికి పెంచేశారని, డిస్టిలరీల నుంచి, సరఫరాదారుల నుంచి వచ్చే ముడుపులను జగన్‌కు ముట్టజెప్పారని సిట్ స్పష్టం చేసింది. నెలకు రూ.50–60 కోట్ల చొప్పున ఆయనకు అందాయని, మొత్తం రూ.3,500 కోట్లు ముడుపుల రూపంలో వసూలు చేశారని, అందుకు పకడ్బందీ ప్రణాళికలు వేశారని, డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్లాయో దర్యాప్తు సంస్థలకు అంతు చిక్కకుండా వివిధ మార్గాల్లో మళ్లించారని సిట్ విచారణలో వెల్లడి అయింది.
మద్యం కుంభకోణం ఒక్కటి చాలు, దోపిడీలో జగన్‌రెడ్డి ఎంతటి నేర్పరో చెప్పడానికి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, వారి ఆర్థికాన్ని కూడా దెబ్బతీసిన అతి పెద్ద మద్యం స్కామ్ ఇది. ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి, జగన్ ముఠా డిస్టిలరీల నుంచే అడ్డమైన బ్రాండ్ల మద్యాన్ని కొనిపించి అభాగ్యుల జీవితాలతో మృత్యు క్రీడలాడింది జగన్ ప్రభుత్వం. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని వైసీపీ నాయకుల ఎన్నికల ఖర్చుకూ రూ.250 నుంచి 300 కోట్లు పంపిణీ చేశారని, అక్రమంగా వచ్చిన వందల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు హవాలా ద్వారా తరలించారని సిట్ విచారణలో వెల్లడయింది. అధికారంలో ఉండి ఇంత నీచానికి, పాల్పడతారా? ఈ స్థాయిలో వ్యవస్థీకృత నేరం చెయ్యడానికి సిగ్గు అనిపించడం లేదా? మద్య మారీచుడు జగన్‌రెడ్డికి కఠిన దండనలు పడేలా చూడటమే కాదు– బొక్కిన ప్రతి రూపాయిని రెవెన్యూ రికవరీ చట్టంతో ఖజానాకు చేర్చాలి. ఆ సొమ్మును గరళ మద్యానికి బలైన కుటుంబాల సంక్షేమానికి వినియోగించి బాధితులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నది.
రాష్ట్రానికి, ప్రజలకు భారీ ఆదాయ నష్టం చేసిన తీవ్రమైన నేరస్థులు జైలు గదులలో ప్రత్యేక సదుపాయాల కోసం ఇచ్చే పిటిషన్లను స్వీకరించే ముందు కోర్టులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అవినీతిపరులైన నేరస్థులకు వారి మోసాల కారణంగా ప్రత్యేక సెల్ ఉండకూడదు. కోర్టు ముందు హాజరైన ప్రతి ఒక్కరికీ సెక్షన్ కింద రిమాండ్ ఒకేలా ఉంటుంది. స్కామ్‌లలో పాల్గొన్న వ్యక్తులకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు దేశభక్తులు కాదు, ప్రజాధనం దోపిడీ చేసినవారు. వారికి రాచమర్యాదలు అవసరం లేదు. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు అనేది ప్రజలకు అర్థమయింది. విలువలు, విశ్వసనీయతలు అంటూ సుద్దులు చెప్పే జగన్‌రెడ్డి– సిట్ వెల్లడించిన అంశాలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
-యనమల రామకృష్ణుడు
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు