Share News

Legendary Actress Savitri: వెండితెరపై తెలుగువెన్నెల

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:54 AM

నడకలోనే నవ్వులు పూయించే నటనామయి, భావాలే మాటలుగా పలికించే మహానటి. ఒక్కో నవ్వు వెనుక వెయ్యి కష్టాలున్నా ఆమె చిరునవ్వే నిత్యవసంతం...

Legendary Actress Savitri: వెండితెరపై తెలుగువెన్నెల

నడకలోనే నవ్వులు పూయించే నటనామయి, భావాలే మాటలుగా పలికించే మహానటి. ఒక్కో నవ్వు వెనుక వెయ్యి కష్టాలున్నా ఆమె చిరునవ్వే నిత్యవసంతం. కన్నీటి చుక్కకే జీవం పంచిన ఆ కళామయి పేరు పలికితే తెలుగుతెరపైన వెలుగురేఖ వికసిస్తుంది. ఆవిడే మహానటి సావిత్రి. ఆమె ప్రతి భావం ఒక నటశాస్త్ర గ్రంథం. ప్రతి పాత్ర ఒక దర్శనం. విమర్శకులు ‘నటి’ అంటారు గానీ ప్రేక్షక దేవుళ్లు ఆత్మీయంగా ‘అమ్మ’ అన్నారు.

సావిత్రి తెలుగు చిత్రసీమ పుటల్లోనే కాదు, తెలుగు మనసుల్లోనూ శాశ్వతంగా వెలిగే అక్షరం. దక్షిణాదిలో ప్రేక్షకాభిమానం పొందిన నటీమణులు ఎందరో ఉన్నప్పటికీ, ‘మహానటి’ గౌరవానికి సావిత్రి మాత్రమే ప్రతీక. సత్యజిత్ రే వంటి ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడే అలా కీర్తించటం ఆమె కళాభినయానికి అతిపెద్ద ముద్ర.

నవరసాలను అలవోకగా పండించి, ఏ పాత్రలోనైనా జీవించి, కళ్లతోనే హావభావాలను పలికించిన సావిత్రి ఒక అద్భుత నటశిఖరం. ఆమె సినిమాలు ఆ తరాన్నే కాదు, ఈ తరం వారినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన ‘మహానటి’ సినిమా అందుకున్న అపార ప్రజాదరణ, ఆమె మహత్తర వ్యక్తిత్వానికి నేటి యువతరం అందించిన వందనం. ఆమె పోషించిన ప్రతి పాత్రలోనూ ఆమె ఆత్మ నిలిచేది. ఆ పాత్ర సావిత్రి తప్ప మరెవరూ చేయలేరని అనిపించే విధంగా తెరపై ఆమె మెరిసేది. సావిత్రి నటించిన చిత్రాలన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ వైవిధ్యం మన కళ్లముందు కదలాడుతుంది. ‘దేవదాసు’లో పార్వతే గుర్తొస్తుంది. ‘మాయా బజార్’లో శశిరేఖే కనిపిస్తుంది. ఆ మహానటి మనకు దొరకటం తెలుగుజాతి అదృష్టం.


1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఆయనకు ఘన సన్మానం నిర్వహించి, ఒక భారీ పూలదండ అర్పించారు. అది పాకిస్థాన్ దురాక్రమణను దేశం ఎదుర్కొంటున్న వేళ కనుక, ఆ పూలదండను దేశరక్షణ నిధుల కోసం వేలంపాటకు పెట్టారు. అక్కడ సుప్రసిద్ధ అగ్రనటులు, నిర్మాతలు ఎందరో ఉన్నప్పటికీ, ఆ వేలానికి మొదటగా ముందుకు వచ్చినది సావిత్రిగారే. ఆకస్మికంగా ఆమెను ప్రోత్సహిస్తూ ఆ వేలంపాటలో పాల్గొన్న మరో మహానటుడు ఎం.జి. రామచంద్రన్. వేలం పాటను పెంచుకుంటూ పదిహేను వేలవరకూ ఆయన తీసుకెళ్లారు. చివరకు ఆ పూలదండను గెలుచుకుంది సావిత్రిగారే. ఎం.జి.ఆర్. లాంటి మహానటుడితో పోటీపడి గెలవడం ఒక విశిష్ట ఘనత. అయినా, ఆమె ‘ఇది దేశరక్షణ విషయం కనుక మీతో పోటీపడ్డాను. తప్పయితే మన్నించండి’ అని ఎం.జి.ఆర్.తో వినమ్రంగా అన్నారు. దానికి ప్రతిగా ఎం.జి.ఆర్. ఆమెను ప్రశంసిస్తూ, ‘‘అమ్మా! తప్పేమీ లేదు. ఎవరూ ముందుకు రాలేదు. నువ్వు ఎలా వేలం పాడుతావో నాకు తెలుసు. ఇది దేశం కోసం ఇచ్చే డబ్బు కనుక నేను పాట పెంచాను’’ అన్నారు. సావిత్రి దాతృత్వానికీ, దేశభక్తికీ, ఆమె అమోఘమైన వ్యక్తిత్వానికీ శాశ్వత సాక్ష్యం ఈ ఘటన. తెలుగు తెరకు మహానటి అయితే, జీవనవేదికపై ఆమెది మహా మనసు.

నాటి ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి హైదరాబాదుకు వచ్చినప్పుడు, దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులందరినీ కలిసి దేశరక్షణ నిధికి సహాయం కోరారు. చాలామంది తమవంతు సాయం చెక్కుల రూపంలో అందించారు. సావిత్రి మాత్రం ఆ రోజు ఆమె ఒంటినిండా వేసుకున్న బంగారు నగలన్నింటినీ తీసి ప్రధాని చేతిలో పెట్టారు. ఆ నిశ్శబ్ద క్షణం– ఆమె దాతృత్వాన్ని, ఆమెలోని దేశభక్తిని కూడా అక్షరాలుగా చెక్కింది. సావిత్రి మనసున్న మనిషి. రాయలసీమ క్షామ నివారణకు, తుఫాన్ల బాధితులకు, విద్యాసంస్థలకు, అనేక సేవాసంస్థలకు స్వయంగా వెళ్లి సహాయం అందించేది. 1975 నాటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆవిడను ప్రత్యక్షంగా దర్శించే అదృష్టం నాకు దక్కింది. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుగారు, జలగం వెంగళరావుగారు కలిసి ఆమెకు ఘన సన్మానం చేసినప్పుడు, ఆ ఆరాధ్య నటీమణి నవ్వు, భాషణం ఎన్నటికీ మరిచిపోలేనివి. సావిత్రి పోషించిన తెరపాత్రలన్నీ తెలుగుతనం ఎలా ఉండాలో మనకు చూపించే పాఠాలే. ఆమె కట్టు, తిలకం, మాట, నవ్వు తెలుగు సంస్కృతీ స్వరూపం.

-మండలి బుద్ధప్రసాద్

శాసనసభ్యులు, అవనిగడ్డ

Updated Date - Dec 06 , 2025 | 04:54 AM