Share News

Bihars SIR: ప్రజాస్వామ్య భరోసానివ్వని బిహార్‌ సర్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:57 AM

బిహార్‌ ఓటర్ల తుది జాబితాలు వెలుడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తేదీలూ ప్రకటించారు. పూర్తయిన ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ సర్‌ కార్యక్రమాన్ని నిశితంగా పరీక్షిస్తే మా....

Bihars SIR: ప్రజాస్వామ్య భరోసానివ్వని బిహార్‌ సర్‌

బిహార్‌ ఓటర్ల తుది జాబితాలు వెలుడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తేదీలూ ప్రకటించారు. పూర్తయిన ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌) కార్యక్రమాన్ని నిశితంగా పరీక్షిస్తే మా దృష్టికి వచ్చిన వాస్తవాలను వివరించడమే ఈ వ్యాస లక్ష్యం. కొత్త ఓటర్‌ జాబితాల నాణ్యతను అంచనా వేసేందుకు గాను ఓటర్ల నమోదు కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో అంగీకారయోగ్యమైన మూడు మార్గద్శక సూత్రాలను ప్రాతిపదికగా తీసుకున్నాం: సమగ్రత, నిష్పాక్షికత, నిర్దుష్టత. తొలుత ఓటర్‌ జాబితా సమగ్రతను చూద్దాం. ఓటర్‌ జాబితాలో చోటు చేసుకున్న అర్హులైన జనుల నిష్పత్తిని దీనికి కొలమానంగా తీసుకున్నాం. గత జూలైలో ప్రచురితమైన ముసాయిదా ఓటర్‌ జాబితాలలో చోటుచేసుకున్న వయోజనుల నిష్పత్తి ఈ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో దిగ్భ్రాంతికరంగా 97 శాతం నుంచి 88 శాతానికి తగ్గిపోయింది. తుది ఓటర్ల జాబితాలో కొంతమేరకు మెరుగుదల కనిపించినప్పటికీ, విస్తృత పరిశీలనలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని స్పష్టమయింది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కారణంగా ఓటర్లకు–జనాభాకు మధ్య నిష్పత్తి గణనీయంగా పడిపోయింది మరి. భారత ప్రభుత్వ నిపుణుల బృందం విడుదల చేసిన జనాభా అంచనాల ప్రకారం సెప్టెంబర్‌ 2025లో బిహార్‌లో 8.22 కోట్ల మంది ఓటర్లు ఉండాలి. తుది ఓటర్‌ జాబితాలో ఉన్నవారు 7.42 కోట్లు మాత్రమే! అంటే దాదాపు 80 లక్షల మంది సంభావ్య ఓటర్లు తుది జాబితాలో కనిపించడం లేదు! ఇదేమంత సంతోషించదగిన విషయం? దీన్నెలా అంగీకరించాలి? తుది ఓటర్‌ జాబితాలు భ్రమపూరితమైన ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి.


ఎందుకని? తుది జాబితా నుంచి తొలగింపులు ముసాయిదా జాబితాల నుంచి తొలగించబడిన 65లక్షల కంటే తక్కువ కాబట్టి. నిజానికి రెండు కోట్ల మంది ఓటర్లు తొలగింపుకు గురవుతారని భయపడ్డాము. అంత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు తొలగింపులు సంభవించలేదంటే అందుకు కారణం ‘సర్‌’ గానీ, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కానీ కాదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్రమత్తత వల్లే అటువంటి అప్రజాస్వామిక చర్య చోటుచేసుకోలేదు. సుప్రీంకోర్టు కృతనిశ్చయంతో ‘సర్‌’ అమలును పర్యవేక్షించింది. గౌరవ భంగం కాకుండా ఉండేందుకు ఈసీఐ తన ఆదేశాలకు, కార్యనిర్వహణ పద్ధతులకు భిన్నంగా వ్యవహరించింది. తొలుత ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను సమర్పించని ఓటర్లు పెద్ద సంఖ్యలో లేరనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నించింది. ఈ ప్రకారం కనీసం 20 శాతం ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను బీఎల్‌ఓలే నింపి ఈసీఐకు సమర్పించడం జరిగింది. ఈ ఫోర్జరీని ఈసీఐ ప్రోత్సహించింది. పిదప సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆధార్‌ కార్డును ఓటర్‌ నమోదుకు ఒక ప్రామాణిక పత్రంగా ఈసీఐ అంగీకరించింది. తుది జాబితాలలో నిష్పాక్షికత ఉన్నదా? ఓటుహక్కుకు అర్హులైన జనాభాలో తమ నిష్పత్తికి సమరీతిలో అన్ని సామాజిక బృందాలకు ప్రాతినిధ్యం లభించిందా? దళితులకు, వచ్చిపోయే వలసకారులకు ఈ విషయంలో న్యాయం ఏ మేరకు జరిగిందీ? వీటిపై మరింత నిశిత శోధన జరగవలసివున్నది. మహిళలు, ముస్లింలకు న్యాయం జరగలేదన్నది మా పరిశీలనలో స్పష్టంగా వెల్లడయింది. బిహార్‌ ఓటర్‌ జాబితాలలో మహిళల నిష్పత్తి రాష్ట్ర జనాభాలో వారి వంతు కంటే ఎప్పుడూ తక్కువగా ఉండడం పరిపాటి. ఇటీవలి సంవత్సరాలలో ఈ అంతరం తగ్గింది. 2012లో 21 లక్షలుగా ఉండగా అది ఈ ఏడాది 7 లక్షలకు తగ్గింది. ‘సర్‌’తో ఈ అంతరం మరింతగా తగ్గక పోగా 16 లక్షలకు పెరిగింది. ముస్లింల విషయంలో సాక్ష్యాధారాలు స్పష్టంగా లేవు. ఈసీఐ రికార్డులో ముస్లింలు ఒక అధికారిక వర్గంగా లేకపోవడమే అందుకు కారణం. అయితే పేర్ల గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించగా ఆందోళనకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. ముసాయిదా ఓటర్‌ జాబితాల నుంచి మినహాయింపబడిన 65 లక్షల మంది ఓటర్లలో ముస్లింలు 24.7 శాతం కాగా తుది జాబితాల నుంచి తీసివేసిన 3.88 లక్షల పేర్లలో వారు 33 శాతంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారి నిష్పత్తి 16.9 శాతంగా ఉండడం గమనార్హం. అంటే ఆరు లక్షల ముస్లిం ఓటర్ల పేర్లను అదనంగా తొలగించారు. తుది ఓటర్‌ జాబితాలు నిర్దుష్టంగా ఉన్నాయా? ప్రత్యేక సమగ్ర సవరణతో ఈ విషయంలో పరిస్థితి మరింత దిగజారినట్టు అర్థమవుతున్నది. ‘సర్‌’ ముందు జాబితాలు, ‘సర్‌’ తరువాతి జాబితాలలోని నిర్దుష్టతపై మరింత పరిశీలన జరగవలసి ఉన్నది. అయితే మా ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఓటర్‌ జాబితాలను ప్రక్షాళన చేశామన్న ఈసీఐ వాదన సమర్థనీయంగా లేదు. తుది ఓటర్‌ జాబితాలలో 24 వేల పేర్లు అర్థంకాని రీతిలో ఉన్నాయి. 5.2 లక్షల పేర్లు నకిలీవి. 6,000 మంది ఓటర్ల జెండర్‌ ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు.


రెండు లక్షల మంది ఓటర్ల ఇంటి నెంబర్లు సక్రమంగా లేవు. ప్రక్షాళన జరగాల్సింది ఇలాగేనా? చాలా అంశాలలో ముసాయిదా జాబితాల కంటే తుది జాబితాలు మరింత ఘోరంగా ఉన్నాయి. ఓటర్‌ జాబితాల నుంచి విదేశీయుల (బంగ్లాదేశీయులు, రోహింజ్యాలు అని చదువుకోండి) పేర్లను తొలగించడమే ‘సర్‌’ లక్ష్యమని బీజేపీ వాదించింది. ఈ వాదనతో ఈసీఐ ఏకీభవించింది. అయితే ‘సర్‌’కు సంబంధించి ఈసీఐ తొలగించిన ఓటర్ల పేర్లను ఏ కారణాలతో తొలగించడం జరిగిందో రోజువారీ బులెటిన్‌లో వివరంగా తెలిపారు. అయితే ఇంటింటికి వెళ్లి ధ్రువీకరించుకున్న కార్యక్రమంలో ఎంతమంది విదేశీయులు తమ దృష్టికి వచ్చారన్న విషయమై ఎలాంటి వివరాలను ఈసీఐ వెల్లడించలేదు. విదేశీయుడు అన్న కారణంగా ఏ ఒక్క ఓటరు విషయంలోనూ బీజేపీ తన అభ్యంతరాన్ని ఈసీఐకి తెలుపలేదు. బిహార్‌ సీఈఓ వెబ్‌సైట్‌ ముసాయిదా జాబితాలకు 2.4 లక్షల ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వీటిలో 1,087 మాత్రమే (మొత్తం ఓటర్లలో వీరు 0.015 శాతం మాత్రమే) భారతీయ పౌరులు కారనే కారణంతో చేసినవి. ఈ ఫిర్యాదుల్లో 226 మాత్రమే ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నవి కనుక మిగతా 779 విదేశీయులు అన్న ఆక్షేపణతో చేసినవి అయివుంటాయి. బహుశా వారంతా నేపాలీలు అయివుండొచ్చు. ఈ ఫిర్యాదుల్లో 390ని మాత్రమే ఈసీఐ ఆమోదించింది. తుది జాబితాల నుంచి సదరు ఓటర్ల పేర్లను తీసివేసింది. ఇలా తీసివేతకు గురైన వారిలో ముస్లింలు 87 మంది మాత్రమే ఉన్నారు. పారదర్శకత, సక్రమత అనే ప్రమాణాల ప్రాతిపదికన ఈ తుది జాబితాల నాణ్యతను నిర్ధారించేందుకు సంపూర్ణ తనిఖీకి వేచివుండవలసిన అవసరం లేదు. 2003 నాటి సమగ్ర సవరణ ఉత్తర్వు ప్రతిని అందించాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన అభ్యర్థనకు ఈసీఐ ప్రతిస్పందించనే లేదు. తుది ఓటర్ల జాబితాలను సరైన రీతిలో విడుదల చేయనేలేదు. అనేక విషయాలలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈసీఐ వ్యవహరించింది. కనుకనే ముసాయిదా ఓటర్‌ జాబితాల నుంచి తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను సంపూర్ణంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అనివార్యమయింది. ప్రతి ఎన్నికల సంఘం విధిగా చేయవలసిన దానికి, గతంలో తాను నెలకొల్పిన సంప్రదాయాలకు విరుద్ధంగా ఈసీఐ వ్యవహరించింది. ‘సర్‌’ నిర్వహణపై ముందుగా సంప్రదింపులు చేయకపోవడం, హడావుడిగా అమలుపరచడం, అన్ని నిర్ణయాలనూ పారదర్శకంగా తీసుకోకపోవడం, ప్రతిపక్షాలతో కలహశీలంగా వాదప్రతివాదాలు చేయడం మొదలైనవన్నీ భారత ఎన్నికల సంఘం తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదనే భావనను ప్రజలలో నెలకొల్పాయి. వర్ధమాన దేశాలలోని ఎన్నికల సంఘాలకు ఆదర్శప్రాయంగా వెలుగొందిన, దేశ ప్రజల సంపూర్ణ విశ్వాసాన్ని పొందిన ఈసీఐ బిహార్‌లో ‘సర్‌’ను అమలుపరిచిన తీరు ఆమోదయోగ్యంగా లేదని చెప్పక తప్పదు. బిహార్‌లో అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా దేశ వ్యాప్తంగా ‘సర్‌’ అమలుకు పూనుకుంటే భారీ సంఖ్యలో ప్రజల ఓటుహక్కు రద్దు జరిగేందుకు అవకాశమున్నది. పర్యవసానమేమిటి? ఎన్నికలపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు. భారత ప్రజాస్వామ్యానికి ఇదెలా మేలు చేస్తుంది?

-యోగేంద్ర యాదవ్

Updated Date - Oct 09 , 2025 | 03:57 AM