Rohith Vemula Law: రోహిత్ వేముల చట్టం ఎలా ఉండాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:10 AM
ఒక విద్యార్థి విషాద మరణం ఉన్నత విద్యా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన సంక్షోభాన్ని ఎత్తి చూపింది. అతని పేరు మీద ప్రతిపాదించబడిన ఒక కొత్త చట్టం ఉన్నత విద్యా వ్యవస్థలో కుల వివక్షను పరిష్కరించడానికి ఆశను కల్పిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్....
ఒక విద్యార్థి విషాద మరణం ఉన్నత విద్యా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన సంక్షోభాన్ని ఎత్తి చూపింది. అతని పేరు మీద ప్రతిపాదించబడిన ఒక కొత్త చట్టం ఉన్నత విద్యా వ్యవస్థలో కుల వివక్షను పరిష్కరించడానికి ఆశను కల్పిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో పరిశీలనలో ఉన్న రోహిత్ వేముల చట్టాలు కుల వ్యవస్థపై పోరాటంలో గొప్ప ముందడుగు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ అయిన రోహిత్ వలెనే, 2004 నుంచి ఉన్నత విద్యా సంస్థలలో 50మందికి పైగా విద్యార్థులు సామాజిక బహిష్కరణ, వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. 2018–2023 మధ్య ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన 13,600 మందికి పైగా విద్యార్థులు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుంచి మధ్యలోనే చదువు మానేశారని పార్లమెంటులో తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989, కుల ఆధారిత హింసను, వివక్షను నేరంగా పరిగణిస్తున్నది. అయితే, దీని పరిధి ప్రధానంగా బహిరంగంగా జరిగే అత్యాచారాలకు మాత్రమే పరిమితం. ఉన్నత విద్యలో సూక్ష్మ రూపాల్లో ఉండే వివక్షను ఇది పరిష్కరించలేదు. రోహిత్ వేముల, పాయల్ తడ్విల తల్లులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, భారత సుప్రీంకోర్టు ఏప్రిల్ 26, 2025న, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కి ‘యూజీసీ (ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ) నిబంధనలు–2025’ను నోటిఫై చేయడానికి అధికారం ఇచ్చింది. మొదటిసారిగా ‘కుల–ఆధారిత వివక్ష’ను నిర్వచించిన ఈ నిబంధనల ప్రకారం ఫిర్యాదులను స్వీకరించి, దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయడానికి ‘సమానత్వ కమిటీ’లను ఏర్పాటు చేయాలి. బాధిత విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్, హెల్ప్‌లైన్ కూడా ప్రతిపాదించబడ్డాయి.
ఈ దిశగా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న రోహిత్ వేముల చట్టాలు కొత్త నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కర్ణాటక– రోహిత్ వేముల బిల్లు కుల వివక్షకు శిక్షలను ప్రతిపాదిస్తున్నది. అయితే, శిక్షలతో పాటు నివారణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. చట్టం నిజమైన బలం శిక్షించడంలో లేదు. కుల వివక్షకు అవకాశం లేని విద్యా వ్యవస్థను సృష్టించడంలో ఉంది. భారతదేశంలో కులం ఎప్పుడూ కనిపించదు, వినిపిస్తుంది. ఇంటిపేర్లు, ‘మీ ర్యాంక్ ఎంత?’, ‘మీ బాక్‌గ్రౌండ్ ఏమిటి?’ వంటి ప్రశ్నల ద్వారా కులం బయటపడుతుంది. ఈ సాధారణ పలకరింపులు శతాబ్దాల అణచివేతను మోసుకొస్తాయి. తరగతి గదులు, సర్టిఫికెట్లు, రోజువారీ సంభాషణలలో ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణ రోహిత్ చట్టం కేవలం కర్ణాటక చట్టాన్ని అనుకరించకుండా, మరింత లోతైన, నిర్మాణాత్మక పరిష్కారాలను అందించాలి. ముఖ్యంగా, విశ్వవిద్యాలయాలలో కనిపించకుండా పాతుకుపోయిన ‘ర్యాంక్ సంస్కృతి’పై దృష్టి పెట్టాలి. భారతీయ విశ్వవిద్యాలయాలలో ర్యాంక్ సంస్కృతి ఒక క్లిష్టమైన సమస్య. జేఈఈ, నీట్, ఇతర పోటీ పరీక్షల ప్రవేశ పరీక్ష ర్యాంకులు జీవితకాల గుర్తింపుగా మారి, అంతరాలను శాశ్వతం చేస్తున్నాయి. అగ్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులు వాటిని తమ ఆధిక్యతకు చిహ్నంగా భావిస్తారు. తక్కువ ర్యాంకులను రిజర్వేషనుతో ముడిపెడతారు. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ర్యాంకుల ప్రాముఖ్యత లేకపోయినా, అవి బహిరంగ చర్చలలో ఉంటాయి. అదేవిధంగా, నోటీసు బోర్డులు, హాజరు పట్టికలు లేదా సర్టిఫికెట్లపై ఇంటిపేర్ల ద్వారా కుల గుర్తింపులను బహిరంగంగా ప్రదర్శించడం కూడా తీవ్రమైన సమస్య. అడ్మిషన్ల తర్వాత ర్యాంకులను గోప్యంగా ఉంచాలని కొత్త చట్టాలు ఆదేశించాలి. విశ్వవిద్యాలయాలు వెబ్‌సైట్లలో, బ్రోచర్లలో, బహిరంగ వేదికలపైనా ర్యాంకులను ప్రకటించడం నిషేధించాలి. విద్యా ప్రాంగణాలలో అధికారిక, అనధికారిక సంభాషణలలో ర్యాంకుల ప్రస్తావన రాకూడదు. ఇది విద్యార్థులపై జీవితకాల ర్యాంకుల భారాన్ని తగ్గిస్తుంది.
ఈ చట్టం ద్వారా విద్యార్థులకు కుల గోప్యతా హక్కు కూడా కల్పించాలి. అన్ని కులాల విద్యార్థులకు బహిరంగ రికార్డుల నుంచి కులాన్ని సూచించే ఇంటిపేర్లను స్వచ్ఛందంగా తొలగించుకునే అవకాశం ఇవ్వాలి. డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ చట్టం, 2023కి అనుగుణంగా కఠినమైన డేటా గోప్యతా నిబంధనలు రూపొందించాలి. కులం, ర్యాంక్ వివరాలను సున్నితమైన వ్యక్తిగత సమాచారంగా పరిగణించి, వాటిని కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం అధీకృత సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంచాలి. ప్రవేశాల కోసం, కుల ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ వివరాలను అధ్యాపకులకు కనిపించని ప్రత్యేక పరిపాలనా విభాగం నిర్వహించాలి. విశ్వవిద్యాలయాలు యాక్సెస్ నియంత్రణలతో సురక్షిత డేటాబేస్‌లను అమలు చేయాలి, డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడిందని నిర్ధారించుకోవాలి. ప్రతిపాదిత రోహిత్ చట్టాలు– విద్యా సంస్థల్లో అన్ని కుల నేపథ్యాల విద్యార్థులకు సామాజిక అసమానతలు లేని సమాన అవకాశాలను అందించే భవిష్యత్తును సృష్టించాలి.
-శ్రీనివాస్ మాధవ్ సమాచార హక్కు పరిశోధకులు