Share News

A New Era of Democratic Debate: ఇనుమడించిన శాసనసభ ప్రతిష్ఠ

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:32 AM

తెలంగాణ‌లో గత ప‌దేళ్లలో ఏ రోజూ క‌న‌ప‌డ‌ని అరుదైన దృశ్యాల‌కు ఇటీవలి శాస‌న‌స‌భ కేంద్ర బిందువైంది. ప్ర‌తిప‌క్ష నేత‌ల ప్ర‌సంగాల‌కు కావ‌ల్సినంత స‌మ‌యం ఇవ్వడం, విపక్ష స‌భ్యులు ప్ర‌భుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం, వాటిని మంత్రులు స‌హృద‌యంతో స్వీక‌రించడం, అబ‌ద్ధపు ప్ర‌సంగాల‌ను సభానాయకుడు రేవంత్‌రెడ్డి అంకెలు, వాస్త‌వాల ఆధారంగా చీల్చిచెండాడటం..

A New Era of Democratic Debate: ఇనుమడించిన శాసనసభ ప్రతిష్ఠ

తెలంగాణ‌లో గత ప‌దేళ్లలో ఏ రోజూ క‌న‌ప‌డ‌ని అరుదైన దృశ్యాల‌కు ఇటీవలి శాస‌న‌స‌భ కేంద్ర బిందువైంది. ప్ర‌తిప‌క్ష నేత‌ల ప్ర‌సంగాల‌కు కావ‌ల్సినంత స‌మ‌యం ఇవ్వడం, విపక్ష స‌భ్యులు ప్ర‌భుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం, వాటిని మంత్రులు స‌హృద‌యంతో స్వీక‌రించడం, అబ‌ద్ధపు ప్ర‌సంగాల‌ను సభానాయకుడు రేవంత్‌రెడ్డి అంకెలు, వాస్త‌వాల ఆధారంగా చీల్చిచెండాడటం... ఆగస్టు 30, 31 తేదీల్లో పదమూడు గంట‌ల‌కు పైగా సాగిన తెలంగాణ శాస‌స‌స‌భ ఈ వేడుక వంటి దృశ్యాలకు వేదికైంది. ఇందుకు ప్ర‌ధాన కారకుడు ప్ర‌జాస్వామిక విలువ‌ల‌పై ప్ర‌గాఢ విశ్వాసం ఉన్న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్‌రెడ్డే! ఎట్టకేలకు శాస‌నస‌భ శాసనస‌భ‌లా న‌డిచి ఆద్యంతం ఆక‌ట్టుకున్నది. ‘తుమ్మిడిహెట్టి వ‌ద్ద 205 టీఎంసీల నీటి ల‌భ్య‌త ఉంద‌ని నాటి జ‌లవ‌న‌రులశాఖ మంత్రి ఉమాభార‌తి రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు’ అంటూ ఆ లేఖ‌ను చూపుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు స్థ‌ల మార్పిడిలోని మ‌త‌ల‌బును స‌భా వేదిక‌ సాక్షిగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. కాళేశ్వ‌రం ఘ‌ట‌న‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఇష్టారీతిన చేసిన వాదనలను ఎప్పటికప్పుడు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అంకెలతో, లేఖ‌లతో, తగిన ఆధారాల‌తో తిప్పికొట్టారు. జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఎమ్మెల్యేల‌కు అంద‌క ముందే మీడియాకు రావ‌డంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విమ‌ర్శ‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ అంశంపై విచార‌ణ చేయిస్తామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హామీ ఇచ్చారు. సున్నిత‌మైన ప్రాజెక్టుల విష‌యంలో త‌ప్పు చేయ‌డం మ‌ర‌ణంతో స‌మాన‌మ‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు ప్ర‌సంగించారు. నీటి ల‌భ్య‌త‌లో తేడా లేకుండా క‌మీష‌న్ల కోస‌మే ప్రాజెక్టు స్థ‌ల మార్పిడి చేశార‌ని, నాడు అంతా తానే అన్న కేసీఆర్ ఇప్పుడు త‌న‌కు సంబంధం లేద‌న‌డం స‌రికాదనీ బీజేపీ ఎమ్మెల్యే హ‌రీశ్‌బాబు ప్ర‌సంగించారు. మరో పక్క బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు త‌మ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై ఆక్రోశం వెళ్ళగక్కుతూ, ఆ నివేదిక‌ను ముక్క‌లుగా చింపిపారేసి త‌మ అప్ర‌జా స్వామిక వైఖ‌రిని చాటుకున్నారు. అధికారపక్షం మాత్రం ఓపిగ్గా స‌హ‌నంగా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లను వింటూ, వారి స‌ల‌హాల‌ను స్వీక‌రిస్తూ స‌భా ప్ర‌తిష్ఠ పెంచింది.


ఉమ్మ‌డి రాష్ట్రంలో నీళ్లు ద‌క్క‌క బీళ్లుగా మారిన భూములను స‌స్య‌శ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల రీడిజైన్ మొద‌లు పెడుతున్నామంటూ నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టిస్తే ప్ర‌జ‌లు నిజ‌మేన‌ని న‌మ్మారు. కానీ ఆ రీడిజైన్‌లు ఇంజినీర్లు కాకుండా తానే చేస్తున్నాన‌ని, ప్రాజెక్టులు ఎక్క‌డ క‌ట్టాలో నిపుణులు కాకుండా తానే నిర్ణయిస్తున్నానని ప్రగల్భాలు పలికినప్పుడే తెలంగాణ స‌మాజం ఉలిక్కిప‌డింది. కానీ ప్ర‌శ్నించిన గొంతుక‌ల‌ను ఉక్కుపాదంతో అణిచివేయ‌డం, విప‌క్ష పార్టీల ఉనికే శాస‌న‌స‌భ‌లో లేకుండా చేయ‌డం వల్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎదురన్నది లేకుండా పోయింది. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులకు నిర‌స‌న తెలిపేందుకు ధ‌ర్నాచౌక్ లేదు, ప్రశ్నించేందుకు శాస‌న‌స‌భ‌లో, మండ‌లిలో విప‌క్షాల‌కు చోటే లేదు. ప్ర‌జ‌లు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం ఇచ్చిన పార్టీల ఉనికినే స‌భ‌లో లేకుండా చేయ‌డం ద్వారా శాసనస‌భ‌ను బాతాఖానీ క్ల‌బ్‌గా, భ‌జ‌న మండ‌లిగా మార్చేశారు గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్. కానీ 20 నెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆ చీక‌టి రోజుల‌కు తెరదింపి ప్ర‌జాస్వామిక పాల‌న‌కు తెర‌లేపారు. దాని ఫలితంగానే నేడు లోతైన చ‌ర్చల‌ ద్వారా శాస‌న‌స‌భ ప్ర‌తిష్ఠ మ‌రింత పెరిగింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో 1970వ ద‌శ‌కం నుంచి 2014 వ‌ర‌కు ఉద్ధండులైన ముఖ్యంత్రులు జ‌ల‌గం వెంగ‌ళ‌రావు, మ‌ర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజ‌య్య‌, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్‌. రాజ‌శేఖర రెడ్డి ఉన్న స‌మ‌యంలో భిన్న ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన గౌతు ల‌చ్చ‌న్న‌, భాట్టం శ్రీ‌రామమూర్తి, సూదిని జైపాల్‌రెడ్డి, వెంక‌య్యనాయుడు, న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి, మ‌ద్దికాయ‌ల ఓంకార్‌, బోడేపూడి వెంక‌టేశ్వ‌ర‌రావు, చిలుముల విఠ‌ల్‌రెడ్డి, పి. జ‌నార్ద‌న్‌రెడ్డి, చెన్న‌మ‌నేని రాజేశ్వ‌ర‌రావు, గుమ్మ‌డి న‌ర్స‌య్య‌, చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్‌రావు ప్ర‌తిప‌క్ష నేత‌లుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా ప్ర‌భుత్వాన్ని చీల్చిచెండాడుతూనే మ‌రోవైపు రాష్ట్ర భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేవారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాస‌న‌స‌భ‌ల ప్ర‌తిష్ఠ చాలావ‌ర‌కు మ‌స‌క‌బారింది. తెలంగాణ‌లో తొలి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్‌కు విప‌క్ష పార్టీల‌పై ఉన్న చిన్న చూపు, నియంతృత్వ వైఖ‌రి వల్ల శాస‌న‌స‌భ స‌మావేశాలంటే ప్ర‌జ‌ల‌కు చులకన భావం ఏర్పడింది. అధికార ప‌క్షానికి డ‌బ్బా కొట్టడంతో, ప్ర‌తిప‌క్షాల‌పై నింద‌ల‌తో గౌర‌వ స‌భ‌ను కౌర‌వ స‌భ‌గా మార్చివేశారు.


నేడు సభానాయకుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సభలో వ్యవహరిస్తున్న తీరుతో శాసనసభ మళ్ళీ పూర్వ వైభవాన్ని, గౌరవాన్ని వెనక్కి తెచ్చుకుంది. ప్ర‌తిప‌క్షాల‌కు సమ‌యం ఇవ్వ‌డంతో పాటు వారి ప్ర‌తి సందేహాన్ని నివృత్తి చేస్తూ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, మంత్రులు పూర్తి ప్ర‌జాస్వామ్య‌యుతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫలితమే గ‌తంలోలా అనవ‌స‌రంగా స‌భ్యుల‌పై అన‌ర్హ‌త వేట్లు, మార్ష‌ల్స్ స‌భ నుంచి ఈడ్చి పారేయ‌డం వంటి అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌కు తావులేకుండా స‌భ స‌జావుగా సాగుతున్నది. స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్‌ కుమార్ ఎటువంటి ప‌క్ష‌పాతం చూప‌కుండా అన్ని ప‌క్షాల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం; బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు అడ్డుగా ఉన్న పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టాల స‌వ‌ర‌ణ‌; కాళేశ్వ‌రం అవినీతిపై జ‌స్టిస్ పీసీ ఘోష్ నివేదిక‌పై చర్చల సందర్భంలో ముఖ్య‌మంత్రి, మంత్రులు పూర్తి ప్ర‌జాస్వామ్యయుతంగా వ్య‌వ‌హ‌రించారు. శాస‌న‌స‌భలో ఇటీవలి ఈ చ‌ర్చ‌లు రానున్న సంవ‌త్స‌రాల్లో మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తాయి. గత పదేళ్లు సభ జరిగిన తీరుతో, ఇప్పుడు సభ జరుగుతున్న తీరును ప్రజలు బేరీజు వేసుకొని ప్ర‌శంసిస్తున్నారు.

-అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ

Updated Date - Sep 05 , 2025 | 12:32 AM