Share News

The Unstoppable Smile: ఆ నవ్వు

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:32 AM

అమాయకత్వమో, అజ్ఞానమోగాని నాకామె తెలువదు నేనామెను చదవలేదు ఆమె నవ్వొక్కటే తెలుసు....

The Unstoppable Smile: ఆ నవ్వు

అమాయకత్వమో, అజ్ఞానమోగాని

నాకామె తెలువదు

నేనామెను చదవలేదు

ఆమె నవ్వొక్కటే తెలుసు

అది వెంటాడే నవ్వు

వేల భరోసాల నవ్వు

కొండసిగలో పూసిన వెన్నెల నవ్వు

అంతుబట్టని అడవి రహస్యం

ఆకాశపుటూయలలో అర్ధరాత్రి నక్షత్రగానం

ఆ నవ్వు ఇప్పటిదేనా

ఇంతకుముందు కూడా ఉన్నదా

నాకది చిరపరిచితమైనదేనా

అవును

నేను తొలిసారి భూమ్మీద పడ్డపుడు

నన్నెత్తుకు ముద్దాడుతూ వికసించిన

మా అమ్మ నవ్వే అది

నేను బర్రెల్ని కాస్తున్నప్పుడు

ఎండాకాలపు సాయంకాలంలో

వరిపైరు మీదుగా వీచిన

చిరుగాలి సితార సంగీతమే అది

ఆ నవ్వు

తొలిసారిగా

రోమన్ సైన్యం మట్టి గరిచినప్పుడు

స్పార్టకస్ ముఖంలో

వెల్లివిరిసిన కాంతిపుంజం

భూస్వామి తలతెగిపడ్డప్పుడు

‘బషాయిటుడు’ కళ్ళలో

విప్పారిన వసంతాల సందోహం

అనేక స్థలకాలాలు దాటి

దుర్భేద్యపు కోటల్ని

నిశ్చలంగా ఎదుర్కొన్న నవ్వు

ఎందరో వీరులు

ఉరికంబాల మీద చేసిన

చివరి సంతకం ఆ నవ్వు

అది మంచు కడిగిన మల్లెపువ్వు

సముద్రం దాని ముందు దిగదుడుపు

అరే భాయ్

ఏ ఫంక్షన్ల కాడనో

స్నేహితుల, బంధువుల కబుర్లలోనో

ప్రేయసీప్రియుల స్వీట్ నథింగ్స్ లోనో

వొచ్చీ పోయే బాటల్లోనో

ఆడీపాడే అనుభవాలలోనో

విరబూసిన, అరవిరిసిన నవ్వుల్ని

నిర్వచించగలమేమో గాని

చుట్టూరా యుద్ధబీభత్సంలో

తొణకని చిరునవ్వును

ఎవడు నిర్వచించగలడు

యుద్ధం తెలిసినవాడు తప్ప

శాంతి తెలిసినవాడు తప్ప

యుద్ధమూ- శాంతి మధ్య

వికసించిన మానవేతిహాసం చదివినవాడు తప్ప

ఎవడ్రా అన్నది

మనిషిని చంపి

పాలిథిన్ కవర్లో చుట్టబెడితే

ఆ నవ్వు ఆగిపోతుందనీ

దాన్ని ఎవరూ ఆపలేరు

భూమిలో నాటితే

చెట్టయి మొలుచుకొస్తది

సముద్రంలోకి విసిరేస్తే

పూల పడవలా సాగి వొస్తది

కొండలో దాస్తే

దాని గుండెని జీల్చుకు

జలపాతమై దూకుతూ వొస్తది

అది నూతన మానవుడి

అజేయ సంకేతం

పీడన ఉన్నంతవరకు

పీడకుని ముఖం మీద ఉమ్మేసే

ధిక్కార దరహాసం

ఆ నవ్వుకు నా సలాం

ఉదయమిత్ర

Updated Date - Dec 15 , 2025 | 03:32 AM