Share News

Crushed Feet: నలిగిన పాదాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:31 AM

నాన్న చిటికెన వేలు పట్టుకొని జాతరలు ఊరేగడం గుర్తేలేదు కడపిక్కలు పట్టేసిన నాగలి కాళ్ళంట కణతలు దేరిపోయిన పాదాల కింద గడ్డి పరకలు ఏరుకొని బతుకు నూకలు పోగేసుకోవడమైతే....

Crushed Feet: నలిగిన పాదాలు

నాన్న చిటికెన వేలు పట్టుకొని జాతరలు ఊరేగడం గుర్తేలేదు కడపిక్కలు పట్టేసిన నాగలి కాళ్ళంట కణతలు దేరిపోయిన పాదాల కింద గడ్డి పరకలు ఏరుకొని బతుకు నూకలు పోగేసుకోవడమైతే ఇప్పుడిప్పుడే మరిచిపోయినట్టు లేదు ‘పగులు లోయ గుండా ప్రవహిస్తున్న నది’ అన్నప్పుడల్లా తరగతి గదిలో, నాన్న అరికాళ్లే కళ్ళ ముందు మెదులాడుతాయి నాన్న పాదాలు– నదీ వ్యవస్థను ఉదహరించడానికి ఇంతకంటే నమూనా ఉండదేమో! కాకపోతే, నీళ్ళ జాగాలో చెమట, నెత్తురు కనిపిస్తుందంతే ఏ సుక్కపొద్దు యాలకో కుండా మండ చల్లారబెట్టి, నాన్న పాదాల ప్రవాహాలలో వేడి నూనొత్తులతో అమ్మ కట్టిన ఆనకట్టలన్నీ తెల్లారి మెరక పొలంలో ఏ దుబ్బుగడ్డికో లోకువైపోతుండేవి కవితల్లో అల్లినట్టుగా కథల్లో చెప్పినట్టుగా సుకుమారమైన నాన్న చేతులెప్పుడూ మా తలలను నిమరలేదు బండలు పగలేసిన చేతులు కదా! రాళ్ళదేరిపోయి, రాయీ రప్పల్లోనూ వెన్నపూసలాంటి మనసులే నాన్న చేతులు చూపించాయి నాన్నైతే ఇప్పుడు లేరు అంతోటి నాగలి కొండెక్కింది ఉన్నవన్నీ బతుకు పాఠాలే నాన్న ఈదుకొచ్చిన సంసారమంతా నాలుగు స్తంభాలై అమ్మని నిలబెడుతున్నప్పుడు అమ్మ పాదాల్లోనూ నాన్నే కనిపిస్తాడు నాగలి లేని సంసారాన్ని ఒడ్డుకు చేర్చిన అమ్మ పాదాలు ఇప్పుడు ఏ వెన్నపూసకు ఇసుమంతైనా లొంగడం లేదు!

- వినోద్‌ కుత్తుం & 96343 14502

Updated Date - Nov 03 , 2025 | 04:31 AM