Blooming Again: మళ్ళీ మొలుస్తూ...
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:27 AM
ఏదోగా ఉంటుంది అంతా ఏమిటోగా ఉంటుంది అర్ధరాత్రి సముద్రాన్ని కప్పుకున్న ఒంటరి పడవ ఆకాశాన్ని మోస్తున్న విమానం జీవన సంధ్యలో భూమిపైన మొలుస్తున్న చుక్కలు....
ఏదోగా ఉంటుంది అంతా ఏమిటోగా ఉంటుంది అర్ధరాత్రి సముద్రాన్ని కప్పుకున్న ఒంటరి పడవ ఆకాశాన్ని మోస్తున్న విమానం జీవన సంధ్యలో భూమిపైన మొలుస్తున్న చుక్కలు ఒక కల నడుస్తున్నట్లే ఉంటుంది ఏళ్ల తరబడి మౌనీకరించబడ్డ శబ్దం అకస్మాత్తుగా పేలిపోతుంది ఏదోగా ఉంటుంది అంతా ఏమిటోగా ఉంటుంది నిశ్శబ్దంగా ఒంటరిగా కుటీరంలో నివసిస్తున్న ఏకాంత వాసికి అర్ధరాత్రి ఎవరో దర్శనమిస్తారు జీవన పోరాటంలో అలసిపోయానని చెబుతున్నా వినక ఇంకా పోరాటం చేయాల్సి ఉందని ప్రబోధిస్తారు అనుకోని అతిథికి రెండు పద్యాలని వడ్డించి మౌనంగా కూర్చుంటాను కొంతకాలం గడుస్తుంది కొన్ని యుగాలు వెనక్కి వెళ్తాయి ఎక్కడో ఎప్పుడో దాచుకున్న కొన్ని స్వప్నాలు నిశ్శబ్దాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి బాటసారి ఇంకొంచెం కవిత్వం మధురసం తాగి బయలుదేరుతాడు మళ్లీ కళ్ళు తెరుస్తాను వర్తమానపుటెండ నెగడు తలకు చుట్టుకుంటుంది తెగిపోయిన చెట్టుకొమ్మ ఒకటి ఎగురుతూ వచ్చి రక్తదాహపు ప్రభుత్వాలు పడిపోతాయని రహస్యం చెబుతుంది భూగర్భ కుహరాల్లో అప మృత్యువుకు బలైపోయిన దుఃఖిత ప్రాణవాయువులు కొత్త పద్యాలై జీవం పోసుకుంటాయి. ఎంత వృద్ధాప్యం వచ్చినా నడవక తప్పదని తెలుస్తుంది జీవితానికి కొత్త అర్థం పురుడు పోసుకుంటుంది.
కాంచనపల్లి గోవర్ధన్ రాజు & 96760 96614