After a Moment of Silence: కాస్త నిశ్శబ్దం తర్వాత
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:05 AM
తన జ్ఞాపకం ఒక వ్యక్తాతీత అనుభవం రెండు హృదయాల బ హిరంతర సంగమం అనేక ప్రశ్నలు లుంగచుట్టుకున్న..
తన జ్ఞాపకం ఒక వ్యక్తాతీత అనుభవం
రెండు హృదయాల బ హిరంతర సంగమం
అనేక ప్రశ్నలు లుంగచుట్టుకున్న
పల్చటి నిశ్శబ్దం
పిడికిట్లోంచి జారిపోతున్న అస్పష్ట ప్రేమపత్రం
చెట్ల కొమ్మల్లో ముడుచుకుంటున్న
చీకటి పిట్టలు
ఎద ముంగిట తచ్చాడుతున్న చిక్కని పరిమళం
తలుపు తట్టిన ఊపిరి చప్పుడు
తెరిచేందుకు సహకరించని అవయవ వ్యవస్థ
నువ్వు ఎప్పుడు వచ్చావో గుర్తులేదు
వెళ్లిపోవడం మాత్రం..
గుండె కొట్టుకుంటున్న ప్రతీసారి గుర్తు వస్తోంది
నువ్వు వచ్చి వెళ్లిన దారి నాకు తెలుసు
నువ్వు అసలు రాకుండా ఉంటే బాగుండేదేమో..!
దుఃఖాన్ని కప్పుకున్న ఈ రాత్రి
సన్నటి నిట్టూర్పుతో ఒళ్ళు విరుచుకుంది
గుమ్మం బయట పొగ మంచు వాన
దూరం నుంచి సముద్రం పిలుస్తున్న కేక
ఆ ఒంటరి పక్షికి ఎంతకూ నిద్ర పట్టదు
విషాదగీతమేదో గుండెలోనుంచి ఆలపిస్తుంది
నువ్వు వెళ్లిన రోజు నాకు గుర్తుంది
నా చెవి అంచున నీ గుండె చప్పుడు
ఇంకా వినపడుతూనే ఉంది
అయినా నువ్వు రాకుండా ఉండాల్సింది..
వచ్చినా.. వెళ్ళేటప్పుడు నీ స్మృతుల చిహ్నాల్ని
చెరిపేసి పోవాల్సింది..!
సునీత గంగవరపు - & 94940 84576