Respecting Elders: వృద్ధులను గౌరవిద్దాం
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:02 AM
పుట్టినవాళ్లెవరైనా కాలక్రమంలో వృద్ధులుగా మారక తప్పదు’ ఈ సత్యాన్ని గ్రహించకుండా వారిని హింసించడం, వేధింపులకు గురి చేయడం, వారి కష్టార్జితాన్ని స్వాధీనం...
‘పుట్టినవాళ్లెవరైనా కాలక్రమంలో వృద్ధులుగా మారక తప్పదు’ ఈ సత్యాన్ని గ్రహించకుండా వారిని హింసించడం, వేధింపులకు గురి చేయడం, వారి కష్టార్జితాన్ని స్వాధీనం చేసుకొని వాళ్లను రోడ్లపైన వదిలేయడం వంటి దుర్మార్గపు పరిస్థితులు సమాజంలో నేడు అధికమయ్యాయి. వృద్ధుల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం చట్టరీత్యా నేరం. వృద్ధులను పట్టించుకోకపోతే, వారి ఆస్తి పొందే అర్హత, అనుభవించే హక్కు వారసులకు లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ‘వృద్ధులకు చేయూతనివ్వడం కనీస బాధ్యత’ అని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు నేర్పాలి. వయసు పైబడిన వారు చాదస్తం కారణంగా కొన్ని ఇబ్బంది కలిగించే పనులు చేయవచ్చు, వాటిని పిల్లలు విసుక్కోకూడదు. వృద్ధుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కనీస విచక్షణ, సహనం కలిగి ఉండాలి. వాళ్లను చిన్న పిల్లల వలె జాగ్రత్తగా చూసుకోవాలి. వారి మనసుకు ప్రశాంతతనిచ్చే మాటలే మాట్లాడాలి. అప్పుడే వృద్ధులు కాస్త సంతృప్తి చెందుతారు. వారు సంతోషంగా ఉంటే వయసు కారణంగా వచ్చే రోగాలు కూడా చాలా వరకూ దూరమవుతాయి. వృద్ధుల్లో సహజంగానే అరుగుదల క్షీణిస్తుంది కాబట్టి వాళ్లకు జీర్ణమయ్యే ఆహారాన్నే ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా వృద్ధుల సంరక్షణకు సంబంధించిన నైతిక విలువలను ప్రజల్లో పెం పొందించేందుకు తమ వంతు కృషి చేయాలి.
– వై. సంజీవ కుమార్