Farewell to Shanku: హాస్యానికి శంకు తీర్థం
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:53 AM
ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, బుల్లితెర సీరియల్స్ డైరెక్టర్ శంకు మరణం కార్టూన్, టీవీ రంగాలకు తీరని లోటు. బాల్యం నుంచే చిత్రలేఖనం మీద ఆసక్తి ఉన్న శంకు పూర్తి పేరు సంపర భీమ శంకర్ కుమార్. ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు..
ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, బుల్లితెర సీరియల్స్ డైరెక్టర్ శంకు మరణం కార్టూన్, టీవీ రంగాలకు తీరని లోటు. బాల్యం నుంచే చిత్రలేఖనం మీద ఆసక్తి ఉన్న శంకు పూర్తి పేరు సంపర భీమ శంకర్ కుమార్. ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. 1946 డిసెంబర్ 16న తెనాలిలో జన్మించారు. తండ్రి సంపర రామచంద్రారావు, తల్లి ప్రభావతి. ఐదుగురు సంతానంలో శంకర్ కుమార్ పెద్దవాడు. ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే శంకర్ కుమార్‌కు వడ్డాది పాపయ్య బొమ్మల పట్ల ఆసక్తి కలిగింది. ఆ తర్వాత బాపు రేఖాచిత్రాలు చూసి తానూ కార్టూనిస్ట్ కావాలనుకున్నారు. బాపు కార్టూన్లను సేకరించి, ఓ పుస్తకంలో అంటించుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ కార్టూన్లు గీయడం మొదలు పెట్టారు. శంకర్ కుమార్ గీసిన తొలి కార్టూన్ 1962లో ఆంధ్ర సచిత్ర వార ప్రతికలో ప్రచురితమైంది. అలా మొదలైన ప్రయాణం 2025 ఆగస్టు 24వ తేదీన శంకు తుదిశ్వాస విడిచే వరకూ కొనసాగుతూనే ఉన్నది. అంటే కార్టూనిస్ట్‌గా ఆయనది 63 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం.కుమార్, శంకర్ కుమార్ పేర్లతో కార్టూన్లు గీస్తున్న సమయంలోనే ఆంధ్రజ్యోతి వారపత్రికలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్యం శర్మ ‘శంకర్ కుమార్’ పేరులో మొదటి రెండు అక్షరాలైన ‘శం.కు’ను తీసుకుని కలం పేరుగా మార్చుకోమని సలహా ఇచ్చారు. అలా 1970 నుంచి శంకర్ కుమార్ ‘శంకు’గా మారిపోయారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లోని పత్రికల్లో ఆయన కార్టూన్లు ప్రచురితమయ్యాయి. పలు వారపత్రికలకు ముఖచిత్ర కార్టూన్లూ గీశారు. అప్పట్లో పలు పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతి పొందిన కథలకు ఆయన ఇల్లస్ట్రేషన్స్ గీశారు. కొన్ని దిన, వార పత్రికల్లో కార్టూన్ ఫీచర్స్ నిర్వహించారు.
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తెలుగు కార్టూనిస్టులను ఏకతాటి పైకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు శంకు. అప్పటి లబ్ధప్రతిష్ఠులైన కార్టూనిస్టుల సలహాతో 1976లో ఖమ్మంలో తొలి తెలుగు కార్టూనిస్టుల సమావేశాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఏపీ క్రోక్విల్ అకాడమీని స్థాపించి, క్రోక్విల్ మేగజైన్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత దాని పేరును ‘క్రోక్విల్ హాస్యప్రియ’గా మార్చారు. పుష్కరకాలం పాటు ఇది మాస పత్రికగా, మరికొంతకాలం పక్ష పత్రికగా వచ్చింది. ఈ పత్రిక ద్వారా కార్టూనిస్టులనే కాకుండా హాస్య రచయితలను సైతం ప్రోత్సహించారు. మద్రాస్‌లో ఉండే డాక్టర్ జయదేవ్ బాబుతో వినూత్నమైన శీర్షికలను నిర్వహించి, కొత్త కార్టూనిస్టులను ప్రోత్సహించారు. కార్టూన్లు గీయడంలో మెళకువలను తెలియచేయడంతో 1980, 90లలో వందలాది మంది యువకులు కార్టూనిస్టులుగా మారిపోయారు. వారందరి తొలి కార్టూన్లు ‘హాస్యప్రియ’లోనే ప్రచురితమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆనాటి కార్టూనిస్టులు ‘శంకు’లో పోసిన తీర్థంగా తమ కార్టూన్లను చెప్పుకునే వారు. వీరందరినీ పరిచయం చేస్తూ 1984లో తెలుగు కార్టూనిస్ట్ డైరెక్టరీని ప్రచురించారు శంకు.
కార్టూనిస్టులను ప్రోత్సహించడంతో ఆగిపోకుండా డీడీ నేషనల్ కోసం శంకు 1999లో ‘ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దేశంలోని 13 మంది ప్రముఖ కార్టూనిస్టులపై డాక్యుమెంటరీని తీశారు. ఇది అనేకసార్లు దూరదర్శన్‌లో ప్రసారమైంది. దాంతో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ ఉత్సాహంతోనే 2006లో మునిమాణిక్యం నరసింహారావు ‘కాంతం కథలు’ను, సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’ను ధారావాహికగా తీసుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు వంశీ రాసిన ‘మా పసలపూడి కథలు’ను, సలీం కథలను కూడా సీరియలైజ్ చేశారు. దీనితో పాటు ‘మహదానందం’, ‘కాదంబరి’, ‘హాస వికాసం’ వంటి సీరియల్స్ నిర్మించారు. ఇవన్నీ చక్కని ఆదరణ పొందాయి. దీంతో ఏకంగా శంకు తొమ్మిది నంది అవార్డులను అందుకున్నారు. శంకు రాసిన తొమ్మిది కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 1992లో నాఖీస్ట్ అంతర్జాతీయ కార్టూన్ల పోటీలో అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ సహకారంతో బెల్జియం వెళ్లి స్వయంగా దానిని స్వీకరించారు. తెలుగు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందించారు. ‘ఈ కార్టూన్లు మీవే’ పేరుతో కలర్‌లో శంకు కార్టూన్ల సంకలనాన్ని తీసుకొచ్చారు.
ప్రముఖ దర్శకుడు బాపుతో ఉన్న సాన్నిహిత్యంతో శంకు ఆయన దర్శకత్వం వహించిన దాదాపు తొమ్మిది చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్, ఆమని జంటగా నటించిన ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అల్లరికం’ పేరుతో ఓ సినిమా స్క్రిప్ట్ రాసి, రేలంగి నరసింహారావు దర్శకత్వంతో దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ తన స్నేహితులకు, సన్నిహితులకు తాను గీసిన కార్టూన్లను వాట్సప్ ద్వారా, శుభోదయ సందేశంగా పంపడం శంకుకు అలవాటు. ఎనభై ఏళ్ళు సమీపిస్తున్నా నిత్య చైతన్యశీలిగా ఉంటూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని కార్టూనిస్టులకు గురువుగా, మార్గదర్శిగా వ్యవహరించారు. చిత్రం ఏమిటంటే– కార్టూనిస్ట్ వాడ్రేవు శ్రీనివాసరావు డీడీ యాదగిరి ఛానెల్‌లోని ‘కార్టూన్ కబుర్లు’ ప్రోగ్రామ్ కోసం శంకును ఇటీవల ఇంటర్వ్యూ చేశారు. ఆగస్ట్ 23 ఉ.9.00గంటలకు ఇది ప్రసారమైంది. దీన్ని చూసిన వారంతా ఆ తర్వాత 24 గంటలు గడవకముందే శంకు తనువు చాలించారంటే నమ్మలేకపోయారు. శంకు భౌతికంగా దూరమైనా ఆయన కార్టూన్ రంగానికి చేసిన సేవ చిరస్మరణీయం.
ఓనావ కార్టూనిస్ట్