Share News

Surekha Panigrahi: పాణిగ్రాహి ఆద‌ర్శాలే ప్రాణంగా...

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:33 AM

భార‌త విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో సుబ్బారావు పాణిగ్రాహి పేరు విన‌ని వారు ఉండ‌రు. సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్‌ సురేఖ

Surekha Panigrahi: పాణిగ్రాహి ఆద‌ర్శాలే ప్రాణంగా...

భార‌త విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో సుబ్బారావు పాణిగ్రాహి పేరు విన‌ని వారు ఉండ‌రు. సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్‌ సురేఖ పాణిగ్రాహి జూలై 24వ తేదీ నాడు (89వ ఏట) శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో అమరులయ్యారు. 1959లో ఆమెకు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహితో వివాహం జరిగింది. రెండూ సంప్రదాయక పేద బ్రాహ్మణ కుటుంబాలు. సుబ్బారావు పాణిగ్రాహిది సోంపేట గ్రామం. బారువాలో పాణిగ్రాహి తండ్రి శ్రీవత్స పాణిగ్రాహి పౌరోహిత్యం, నాటు వైద్యం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సుబ్బారావు పాణిగ్రాహి ఎస్‌ఎల్‌సి పూర్తిచేసుకుని పద్యాలు పాడుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు. కళా రంగంలో ఉన్న కాలంలోనే తల్లి అనారోగ్యం కారణంగా వివాహం చేసుకోవాలని పెద్ద బావ పట్టుబట్టడంతో సురేఖను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకి సోంపేటలో వారి దాంపత్య జీవితం ప్రారంభమైంది. క‌టిక‌ పేదరికం. అనేక ఆర్థిక‌ ఇబ్బందుల న‌డుమ‌ జీవితం. అప్ప‌టికే ఖర‌గ్‌పూర్ వెళ్ళిన పాణిగ్రాహి క‌మ్యూనిస్టు భావాల‌తో తిరిగొచ్చాడు. ఆనాటికే క‌మ్యూనిస్టు పార్టీలో ప‌నిచేస్తున్న ఆయన, పార్టీ ఆదేశాల మేర‌కు 1959 లోనే బొడ్డపాడు శివాలయానికి పూజారిగా వ‌చ్చారు. తనతో పాటు భార్య సురేఖ‌ను, తన చెల్లెలు లీలా కుమారిని తీసుకొని బొడ్డపాడు చేరారు. చేరింది పూజారి ఉద్యోగంలోనే అయినా స్థానిక యువత‌రానికి విప్ల‌వ పాఠాలు బోధించేవారు సుబ్బారావు పాణిగ్రాహి. ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వ‌ర‌కు పార్టీ కార్య‌క్ర‌మాల్లో త‌ల‌మున‌క‌లై ఉండేవారు. ప్రజల చుట్టూ, కళా రంగం చుట్టూ ఆయ‌న జీవితం గ‌డిచేది. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు తామడ గణపతి, పైల వాసుదేవరావు, పంచాది కృష్ణమూర్తి తదితర మిత్రులతో నిరంతరం ఉద్దానం పల్లె ప్ర‌జ‌ల్లో విప్ల‌వాగ్నులు ర‌గిల్చేవారు.


మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ ‘ఆట, పాట, మాట’ ద్వారా వారి నోట్లో నాలుకయ్యాడు సుబ్బారావు. అయితే అత్యంత నిర్బంధ ప‌రిస్థితుల్లో కూడా ఆయ‌న స‌హ‌చ‌రి సురేఖా పాణిగ్రాహి భ‌ర్త‌కు అడ్డు చెప్ప‌లేదు. ఉద్యమ జీవితానికి సురేఖ అన్ని రకాల స‌హాయ సహకారాలనూ అందించింది. ఒక ర‌కంగా ఆమె తోడ్పాటు లేక‌పోతే విప్ల‌వోద్య‌మంలో పాణిగ్రాహి పాత్ర అంత‌గా గొప్పగా వెలిగేది కాదేమో. శ్రీకాకుళం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిప‌డుతోన్న కాలంలో సుబ్బారావు పాణిగ్రాహి అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. 1969 డిసెంబర్ 22న‌ రంగమ‌ట్టియ‌ కొండల్లో జ‌రిగిన బూటకపు ఎన్‌కౌంటర్లో సుబ్బారావు పాణిగ్రాహి అమ‌రుల‌య్యారు. పాణిగ్రాహితో సాహచర్యం వీడి 55 ఏళ్ళు ఆమె ఒంటరి జీవితం సాగించింది. బిడ్డలు లేరు, అయినా ఆ చింత లేదు. కొత్తపల్లిలో తమ్ముడు వద్ద పదిహేనేళ్ళు ఉన్నారు. బొడ్డపాడులో పాణిగ్రాహి తమ్ముడు కొడుకు అయిన నిరంజన్ ద‌గ్గ‌ర మరికొన్ని రోజులు కాలం వెళ్ళ‌బుచ్చారు. పేద‌రికం, కష్టాలు ఆమెకు కొత్త కాదు. ఉద్యమ కాలంలో పోలీసుల వేధింపులు, సాధింపులు నిర్బంధాల మధ్య ఆమె జీవితం గడిచింది. ఆమె ప్రత్యక్షంగా ఉద్యమంలో లేకపోయినా ఆమె ఉద్యమాన్ని, ప్రజలను, ఎర్రజెండాను ప్రేమించారు. పాణిగ్రాహి వర్ధంతి సభలకు కవులు, కళాకారులు, రచయితలు, విప్లవ సంస్థలు పిలిచిన‌ప్పుడు ఆమెలో ఉత్సాహం ఉప్పొంగేది. అరుణ పతాకం ఎగరవేసిన‌ప్పుడ‌ల్లా ఆమె హుందాగా వెళ్లి తన భర్త లాంటి అమరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారు కోరుకున్న వ్యవస్థ రావాలని ఆకాంక్షించేవారు. తనను చూడడానికి వచ్చిన రచయితలు, కవులు, క‌ళాకారుల‌తో నాటి జ్ఞాపకాలు నెమ‌రువేసుకునేవారు. వాళ్ళ‌ ద‌గ్గ‌ర పాణిగ్రాహి పాట‌లు పాడి గుర్తు చేసుకునేవారు. ‘ఎందాకా నేస్తం? ఆగాగు అందాక వస్తాం... అందరం కలిసి, ముందరకే పోదాం’ అంటూ పాడేవారు. ‘ఎరుపంటే కొందరికి భయం భయం’ అంటూ ఆమె పాణిగ్రాహి పాట‌లోని వాక్యాలు ప‌దే ప‌దే మ‌న‌నం చేసుకునేవారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎర్రజెండా మీద, విప్లవోద్య‌మం మీద ఆమె విశ్వాసం చెక్కు చెద‌ర‌లేదు. ఆమె ఆఖ‌రి ద‌శ‌లో, బొడ్డపాడులో నిరంజన్ ద‌గ్గ‌ర ఉన్న కాలంలో వృద్ధాప్య పెన్షన్ కూడా తొలగించారు. పెన్షన్ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ సాధ్యం కాలేదు. మిత్రులు శ్రేయోభిలాషులు చిన్నపాటి తోడ్పాటు అందించారు. నిరంతరం ప్రజలను ప్రేమించి, ప్రజల పట్ల అంతులేని విశ్వాసంతో జీవితాంతం నిలబడ్డారు.

-బ‌త‌క‌ల ఈశ్వ‌ర‌మ్మ పీఓడ‌బ్ల్యూ రాష్ట్ర ‌క‌మిటీ స‌భ్యురాలు, ఆంధ్రప్రదేశ్‌

Updated Date - Aug 07 , 2025 | 05:33 AM