G. Ellayya: చరిత్ర నుదుటన చెరగని సంతకం
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:07 AM
ఈ మాటకు ఒక ఆచరణ రూపం వస్తే... అది కచ్చితంగా ట్రేడ్ యూనియన్ లీడర్ జి.ఎల్లయ్యే అవుతుంది. ఎనిమిది పదుల సుదీర్ఘ జీవితంలో ఆయన బతుకంతా...
‘‘నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు’’
– బాబా సాహెబ్ అంబేడ్కర్
ఈ మాటకు ఒక ఆచరణ రూపం వస్తే... అది కచ్చితంగా ట్రేడ్ యూనియన్ లీడర్ జి.ఎల్లయ్యే అవుతుంది. ఎనిమిది పదుల సుదీర్ఘ జీవితంలో ఆయన బతుకంతా ప్రజల కోసమే గడిచింది. 1941 జూన్ 5న మెదక్ జిల్లా రామాయంపేట సమీపాన గల చౌదర్‌పల్లిలో ఎల్లయ్య సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్ననాడే తండ్రి చనిపోవడంతో మేనమామలు ఎల్లయ్యను, అతడి తల్లి వీరమ్మను చేరదీశారు. తండ్రి లేని లోటును తల్లి వీరమ్మే కొంత తీర్చింది. వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువు కొనసాగించాడు. ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాడు. 18 నెలల పాటు టీచర్‌గా కొనసాగిన తరువాత నిజామాబాద్‌లో ఐటీఐ శిక్షణ పూర్తి చేశాడు. అట్లా బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగంలోకి ప్రవేశించాడు.
బీహెచ్‌ఈఎల్‌లో ఒక సామాన్యుడిగా మొదలైన ఎల్లయ్య ప్రస్థానం ఆయన కృషితో అగ్రస్థానానికి చేరింది. బీహెచ్‌ఈఎల్ అంటే ఎల్లయ్య, ఎల్లయ్య అంటే బీహెచ్‌ఈఎల్‌లా మారింది. అందుకు కారణం కార్మికుల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించడం. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్‌టీయూసీ ట్రేడ్ యూనియన్‌లో కార్యకర్తగా కార్యాచరణ మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్నాడు. అందుకు కారణం ఆయనలోని నిబద్ధత, ధైర్యశీలత. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ‘నేనున్నా...’ అనేవాడు. అట్లా వందలాదిమంది కార్మికుల కుటుంబాలకు పెద్దదిక్కు అయ్యాడు. బీహెచ్‌ఈఎల్‌లో అప్పటికే పలు ట్రేడ్ యూనియన్లు ఉన్నప్పటికీ ఎల్లయ్య నిజాయితీ, తలవంచని వ్యక్తిత్వం సంఘాలకు అతీతంగా అతడిని అభిమానించేలా చేసింది. చేతక్ స్కూటర్ మీద బీహెచ్‌ఈఎల్ కలయ తిరుగుతూ కార్మికులకు అందుబాటులో ఉన్నాడు. పోరాటమే తన ఊపిరిగా మలుచుకున్నాడు ఎల్లయ్య. బీహెచ్‌ఈఎల్‌లో ఇవాళ కార్మికులు పొందుతున్న అనేక సౌకర్యాలు ఆయన సాధించినవే. 25శాతం హెచ్‌ఆర్‌ఏ, ఎంఐజీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో దాదాపు ఆరేడు వేల మందికి ఇండ్లు కట్టించాడు. ఇప్పుడు ఆ ఇండ్ల మార్కెట్ ధర ఒక్కొక్కటి రెండుకోట్ల పైమాటే. సూపర్ స్పెషాలిటీ వైద్యం, గ్రామీణ వికాస సేవ సమితి (జీవిఎస్‌ఎస్) ఆధ్వర్యంలో యువతకు ప్రింటింగ్ ఉపాధి కల్పించి వారిని పర్మినెంట్ చేపించాడు. ఇక ప్రమాదకర స్థలాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రతిరోజూ అర లీటర్ పాలు ఇప్పించే ఏర్పాటు చేయించాడు. ఉద్యోగులందరికీ క్యాంటీన్ వసతి ఉండాలని పోరాడాడు. వాటి ధరలు కూడా పెరగకుండా ఉద్యమించాడు. ఇక దూర ప్రాంతాల నుంచి బీహెచ్‌ఈఎల్‌కు వచ్చి పని చేసే కార్మికుల కోసం బస్సు సౌకర్యం కావాలని పోరాడి సాధించాడు. కంపెనీ అభివృద్ధి కోసం ఓవర్‌టైమ్ పని చేసే కార్మికులకు అదనపు వేతన పద్ధతిని సాధించాడు. అప్పటిదాకా ట్రేడ్ యూనియన్‌ల పక్షాన బయటి వ్యక్తులు కూడా బీహెచ్‌ఈఎల్‌లో పోటీ చేసే సంప్రదాయం ఉండేది. దానిని కూడా రద్దు చేయించి కార్మికుల్లో ఒకరే ప్రెసిడెంట్‌గా ఉండాలని డిమాండ్ చేసి సాధించాడు. ఇక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎల్లయ్య నాలుగు దశాబ్దాల పాటు విరామమెరుగని పోరు సలిపినాడు. 1969లో తెలంగాణ కోసం ఉద్యమం పెద్దెత్తున రగులుకున్న సమయంలో అందులో భాగస్వామి అయ్యాడు. ఆనాటి ప్రధాన నాయకత్వమైన మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్, సదాలక్ష్మీ, మదన్‌మోహన్ వంటి వారితో కలిసి నడిచాడు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌కు అత్యంత సన్నిహితుడు ఎల్లయ్య.
2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందే తెలంగాణ కోసం తండ్లాడిండు. అదే సమయంలో బీహెచ్‌ఈఎల్‌లో ఉండే ఆంధ్రా ఉద్యోగులతో సఖ్యతగానే ఉండేవాడు. ఆంధ్రా పాలకులతోనే యుద్ధం తప్ప, ఆంధ్రా సోదరులతో కాదు అని ప్రకటించాడు. అన్నట్టుగానే నాటి ఉమ్మడి రాష్ర్టం గుంటూరులో వరదలు వచ్చినప్పుడు, బీహెచ్‌ఈఎల్ యాజమాన్యంతో మాట్లాడి రెండువందలకు పైగా ఇండ్లు కట్టించాడు. ఇట్లా విశేష కార్మికాదరణ కలిగిన నేతగా ఆవిర్భవించాడు. అందుకే 13 సార్లు పోటీ చేసి 9 సార్లు ప్రెసిడెంట్‌గా గెలుపొందాడు. 1989, 1991, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు.2014లో జేఏసీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ముందువరసలో పాల్గొన్నప్పుడు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. డీసీఎంలో స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేస్తే ఎల్లయ్య దానిని నిరసించాడు. ‘శాంతియుతంగా పోరాడుతున్న మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారంటూ’ వ్యాన్‌లో నుండి కిందికి దూకాడు. అట్లా రెండు కాళ్లు విరిగాయి. హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నా తెలంగాణ ముచ్చట మాత్రం మరువనివాడు ఎల్లయ్య. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అనర్గళంగా మాట్లాడేవాడు. వేదికల మీద కంచుకంఠంతో జనాలను ఉత్సాహపరిచి, దిశానిర్దేశం చేసేవాడు. తాను కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ సంఘంలో ఉన్నప్పటికీ, కమ్యూనిస్టుల పట్ల అమితమైన గౌరవం ఉండేది. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మేవాడు. అనామకుడిగా మొదలైన తన ప్రస్థానం అనతి కాలంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల జేఏసీ చైర్మన్ స్థాయికి చేరింది. పాండురావు, బంగారు లక్ష్మణ్, మహా పాత్రోలతో కలసి పోరాడాడు. మంత్రులు, ముఖ్యమంత్రులకే కాదు ఎల్లయ్య నాయకత్వ పటిమ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు వంటి ప్రధానులకు కూడా చేరింది. అంతటి విజనరీ ఎల్లయ్య. తనకు తిండి పెడుతున్న బీహెచ్ఈఎల్‌ను కర్మభూమిగా భావించేవాడు. కంపెనీ ఉత్పత్తిని కొల్లగొట్టే కుట్రలు చేసిన గోల్ మిల్ ఆర్డర్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి కొన్ని వందలకోట్ల రూపాయల మేలు చేశాడు. క్రమశిక్షణతో జీవించడం అన్నా, ఇతరుల కష్టాలకు స్పందించడమన్నా ఎల్లన్నకు ఎనలేని ప్రీతి. అందుకే ఆయనను ‘‘బీహెచ్‌ఈఎల్ టైగర్’’ అని పిలుచుకునేవారు. ఆయన చేసిన కృషికి గత బీఆర్‌ఎస్ సర్కారులో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పూనుకొని ఎల్లయ్య కృషిని, స్ఫూర్తిని శాశ్వతం చేయాలి. బీహెచ్‌ఈఎల్ మెయిన్ గేట్ ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి.
--కొల్లూరి సత్తయ్య ఫౌండర్ చైర్మన్,
అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ