Umesh Chandra: ధైర్యం, నిబద్ధతకు ప్రతీక
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:03 AM
నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఇవే ఉమేశ్ చంద్ర వారసత్వం. చిన్న వయసులోనే దివికేగినా ఆయన గాథ నేటి పోలీస్ అధికారులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రజాసేవే పరమ ధర్మమని ఆయన జీవితం చాటి చెప్పింది. నిజాయితీతో నిలిచినవారు మరణించినా...
నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ– ఇవే ఉమేశ్ చంద్ర వారసత్వం. చిన్న వయసులోనే దివికేగినా ఆయన గాథ నేటి పోలీస్ అధికారులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రజాసేవే పరమ ధర్మమని ఆయన జీవితం చాటి చెప్పింది. ‘‘నిజాయితీతో నిలిచినవారు మరణించినా, వారి పేరు ఆచంద్రార్కం నిలుస్తుంది.’’ 1966 మార్చి 29న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో జన్మించిన ఉమేశ్ చంద్ర చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సత్యనిష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించి, నిజాం కాలేజీలో ఎకనమిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. విద్యలో అగ్రగామిగా ఉన్న ఆయన, ప్రజలకు సేవ చేయాలనే తపనతో 1991లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణ దశలోనే ఆయన కఠిన శ్రమ, ధైర్యస్వభావం అందరినీ ఆకట్టుకుంది. తరువాతి దశలో ఎక్కడ పనిచేసినా వినిపించిన ఒకే ఒక్క మాట– ‘ఉమేశ్ చంద్ర అంటే ధైర్యానికి పర్యాయపదం’. వరంగల్‌లో ఏఎస్పీగా పనిచేస్తూ నక్సలైట్ల ఉనికిని సవాల్‌గా తీసుకున్నారు. తరువాత కడప ఎస్పీగా పనిచేసి ఫ్యాక్షన్ కలహాలను అణచివేసి ‘కడప సింహం’గా పేరుగాంచారు. కరీంనగర్‌లో నక్సలైట్లను అణచి శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా ఏఐజీ (క్రీడలు, సంక్షేమం)గా సేవలందించారు.
ప్రజల సమస్యలను స్వయంగా వినడం, పోలీస్ స్టేషన్లను ప్రజలకు అండగా మార్చడం ఉమేశ్ చంద్ర ప్రత్యేకత. సాధారణ ప్రజల పట్ల మమకారం చూపుతూ, నేరస్థుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించారు. కడపలో ఆయనను ‘ప్రజల పోలీస్’ అని పిలిచేవారు. ఆయన బదిలీ వార్త తెలిసి ప్రజలు రోడ్డెక్కి కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డుపై బారులు తీరి, వాహనం వెంబడి పరుగులు పెడుతూ తమ కుటుంబసభ్యునికే దూరం జరుగుతున్నంతగా ఆందోళన చెందారు. పోలీసు చరిత్రలో ఓ అధికారికి అలాంటి వీడ్కోలు లభించటం అత్యంత అరుదైన గౌరవం. 1999 సెప్టెంబర్ 4– హైదరాబాద్‌లో ఇంటి నుంచి కారులో పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వెళుతున్న ఉమేశ్ చంద్రపై ఎస్.ఆర్. నగర్ సెంటర్ వద్ద నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ దాడి రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రతి తెలుగువాడిని ఉలిక్కిపడేలా చేసింది. అకస్మాత్తుగా దాడి జరిగినా, ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చేతిలో ఆయుధం లేకపోయినా ధైర్యంగా ఎదురుతిరిగారు. దుండగులను నిలువరించడానికి ప్రయత్నించారు. వాహనంపై కాల్పులు మొదలైన క్షణం నుంచే ఆయన ఎదురు దాడి చేయడానికి యత్నించారు. రక్తస్రావం జరుగుతున్నా, క్షణం ఆలస్యం చేయకుండా సహచరులను రక్షించే ప్రయత్నం చేశారు. క్షణాల వ్యవధిలో గన్‌మాన్ రామచంద్రారెడ్డి, డ్రైవర్ సత్యనారాయణ బలయ్యారు. అయినా ఉమేశ్ చంద్ర వెనుకంజ వేయలేదు. చివరి శ్వాసవరకూ పోరాడుతూనే ఉన్నారు. చేతిలో తుపాకీ లేనప్పటికీ కారు దిగిన ఆయన, నక్సలైట్ల వెంటపడి వారిని కొంత దూరం తరిమారు. అయితే ఉమేష్ చంద్ర వద్ద రివాల్వర్ లేదని గుర్తించిన నక్సలైట్లు ఎదురు తిరిగి బుల్లెట్ల వర్షం కురిపించారు. అవి ఆయన శరీరాన్ని ఛిద్రం చేశాయి. రక్తపు మడుగులో ఆయన కుప్పకూలిపోయారు. కేవలం మృత్యువు మాత్రమే ఆయన సాహసాన్ని నిలువరించగలిగింది. ఆ క్షణాలు పోలీస్ చరిత్రలో అమరగాథగా నిలిచాయి. ఉమేష్ చంద్ర మరణం రాష్ట్రాన్ని కదిలించింది. ప్రజలు విగ్రహాలు ప్రతిష్ఠించారు. 2000 సంవత్సరంలో సంజీవరెడ్డినగర్ కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ నివాళులు అర్పించడం మంచి సంప్రదాయంగా మారింది. పోలీస్ శిక్షణా శిబిరాల్లో ఆయన జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. కడప, హైదరాబాద్, తెనాలిలో ఆయన పేరుతో ఏర్పాటైన రహదారులు, విగ్రహాలు నిరంతర స్ఫూర్తికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
-రవికుమార్ బొప్పన సీనియర్ పాత్రికేయులు