Share News

Where is the Tail: తోవ ఎక్కడ అన్న ప్రశ్నకు నాపై అప్రకటిత నిషేధం

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:35 AM

నా మొదటి పుస్తకం తోవ ఎక్కడ అప్రకటిత నిషేధానికి గురైంది. విప్లవ వర్గం వారి అప్రకటిత నిషేధిత జాబితాలో ఉన్న నగ్నముని, అంబటి సురేంద్రరాజులు.....

Where is the Tail: తోవ ఎక్కడ అన్న ప్రశ్నకు నాపై అప్రకటిత నిషేధం

నా మొదటి పుస్తకం ‘తోవ ఎక్కడ’ అప్రకటిత నిషేధానికి గురైంది. విప్లవ వర్గం వారి అప్రకటిత నిషేధిత జాబితాలో ఉన్న నగ్నముని, అంబటి సురేంద్రరాజులు దీనికి ముందుమాటలు రాయడం ఒక కారణం. శివసాగర్ దీన్ని ఆవిష్కరించడం మరొక కారణం. విప్లవోద్యమ తాత్వికత మీద సంధించిన సంశయాల, ప్రశ్నల కవితలు, కొత్త మార్గ అన్వేషణాత్మక కవితలు ఈ సంపుటిలో ఉండడం అసలు కారణాల్లో ఒకటోది. దళిత, స్త్రీవాద అస్తిత్వ ఉద్యమాల్ని ఆహ్వానించడం, తెలంగాణ వాదాన్ని సూచనప్రాయంగా చెప్పడం అసలు కారణాల్లో రెండోది. ఈ సంపుటిలోనే విప్లవోద్యమంతో మమేకమైన కవితల్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక కవితల్ని మాత్రం వారు విస్మరించారు.

శివారెడ్డి గారు అందరికీ చెప్పినట్టే ‘‘ఇప్పుడే వద్దు నాన్న’’ అని చెప్పినందువల్ల, ఇతర కారణాల వల్ల, 1977 నుంచి రాస్తున్నప్పటికీ 1994 వరకు సంపుటి తేకుంట ఆగిన. ఆ ఏడాది గుడిహాళం రఘునాథం, గుంటూరు ఏసుపాదం, కె. నరసింహాచారి నేను కలిసి వడపోసి కొన్ని కవితలతో ఈ సంపుటిని తెచ్చిన. అప్పుడు అచ్చు పెద్ద యజ్ఞం. ఎందుకో తెనాలిలో అచ్చువేసిన. జుగాష్ విలీ, కె. శివకుమార్ అక్కడ ఉన్నందువల్ల కావచ్చు. హైదరాబాద్‌ నుంచి పేపర్ బండిల్స్ బస్సులో తెనాలి తీసుకెళ్లి, పసుపులేటి వెంకటరమణ, పి. తిరుపతిరావుల ఆధ్వర్యంలో ముద్రించిన. ‘దాసి’ సినిమా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ సుదర్శన్‌తో ముఖచిత్రం వేయించిన. ముద్రణ బైండింగ్ కూడా అయినంక

ఆ ముఖచిత్రం నచ్చక విప్పేసి, వెంకటరమణ సూచించిన ముఖచిత్రంతో ఫైనల్‌గా అచ్చువేసిన. కవిత్వ సంపుటి పేరు, దాని ముఖచిత్రం, అప్పటి వాతావరణాల్ని బట్టి- నన్ను ఆకాశానికి ఎత్తుతారన్న ఆశ నాకేమీ లేదు. ఊహించినట్టుగానే ‘‘తోక ఎక్కడ’’ అని ప్రశ్నించి అవహేళన చేసినారు. అధిక్షేప కవుల పక్కన చేర్చి ఎకసెక్కెం చేసినారు. నో రిగ్రెట్స్‌! నేనొక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించిన అనే ఆత్మవిశ్వాసం నాకుంది.


నా కవితా సంపుటికి పేరును ఆలూరి బైరాగి కవిత్వం నుంచి తీసుకున్న.

‘తోవ ఎక్కడ?’ అన్నది ఆనాటి బైరాగి ఒక్కడి ప్రశ్న కాదు, నా ఒక్కడి ప్రశ్న కాదు, అప్పటి బాలగోపాల్ ప్రశ్న, దళితుల ప్రశ్న, స్త్రీల ప్రశ్న, సకల అస్తిత్వాల ప్రశ్న, రష్యా చైనా తూర్పు యూరోప్‌ల పరిణామాల మీద ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న. ఈ ప్రశ్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ నగ్నముని, అంబటి సురేంద్ర రాజులు అద్భుతమైన ముందుమాటలు రాసి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపినారు. ‘గడియారంలో లేని కాలం’ అనే శీర్షికతో నగ్నముని ఇలా రాసినాడు: ‘‘కవిగా ఆలోచనపరుడిగా తెలుగువాడిగా భారతీయుడిగా ప్రపంచ పౌరుడిగా చరిత్రలోని నాలుగు రోడ్ల మధ్య నిలబడి నేటి ఏకధ్రువ ప్రపంచ ప్రయాణ దిశ తెలుసుకోగోరి ‘తోవ ఎక్కడ’ అని అడుగుతున్నాడు. ఇది చిన్న ప్రశ్న కాదు, సాదాసీదా ప్రశ్న కాదు, ఇది ఈ పుస్తకానికి, ఇందులోని ఒక కవితకు పెట్టిన పేరు మాత్రమే కాదు, ఇది పెను ప్రశ్న, మానవ చరిత్రలోని ప్రధానమైన ప్రశ్న.... ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే దానిలో సామాజిక తాత్వికాంశం, రాజకీయ తాత్వికాంశం, వ్యవస్థ తాత్వికాంశం లభిస్తాయి.... సామాజిక తాత్విక వ్యవస్థ... మార్పుల మలుపులో ఉన్న సమయంలో ‘తోవ ఎక్కడ’ అని అందరి దృష్టికి గంభీరంగా తీసుక వస్తున్నాడు’’. నగ్నముని ఇలా నా ప్రశ్న సామంజస్యాన్ని తార్కికంగా నిరూపించారు. అలాగే దళిత స్త్రీవాదాలను ఆహ్వానించడాన్ని తాత్వికంగా సమర్థించినారు. ‘కవిత్వంలో కొత్త తోవ’ శీర్షికతో అంబటి సురేంద్రరాజు రాసిన ముందుమాటలో ఇలా అన్నారు: ‘‘(శ్రీశ్రీ) పదుగురిని ఆ తోవన నడిపించి తోవకు క్రెడిబిలిటీ తెచ్చిపోయాడు. సుంకిరెడ్డి ఆ తోవ క్రెడిబిలిటినే క్వశ్చన్ చేస్తున్నాడు... నిజమైన కవి గనుక మనం త్రోవ తప్పిన సంగతి కనిపెట్టి కొత్త తోవను గాలిస్తున్నాడు.’’


ఉదయం పత్రికలో ‘కొత్త చూపు కోసం తపననే తోవ ఎక్కడ’ శీర్షికతో కాసుల ప్రతాపరెడ్డి ఇలా రాసినాడు: ‘‘ప్రస్తుతం విప్లవ కవిత్వం ‘నగిషీల’ మధ్య ‘నటన’ల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. దీనికి విప్లవోద్యమాల తాత్విక వెనుకబాటే కారణం. ఈ వెనుకబాటుతనం నేపథ్యం నుంచే విప్లవోద్యమాలు విస్మరించిన అంశాల పునాదుల్లోంచే దళిత కవిత్వం స్త్రీవాద కవిత్వం గొంతు సారించాయి. ‘ఊరి బయటి దుఃఖాలకు/ గొంతునిచ్చిందా మన సూర్య గీతం’ అని ప్రశ్నిస్తూనే దళిత వాదాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తుచేశాడు కవి’’. ఆంధ్రజ్యోతి పత్రికలో ‘ప్రత్యామ్నాయ విప్లవ కవిత్వం తోవ ఎక్కడ’ అని శీర్షికతో గుంటూరు లక్ష్మీనరసయ్య సమీక్షించారు: ‘‘విప్లవోద్యమాలను గుడ్డిగా స్తుతించడం కాక విమర్శనాత్మకంగా ప్రశ్నించడం, ఉద్యమాల ఆర్థిక వాదాన్ని అప్రజాస్వామిక ఆచరణనూ ఎండకట్టడం, దళిత స్త్రీవాదాలను ప్రగతి వాదాలుగా గుర్తించి వాటిని విప్లవోద్యమాలు సొంతం చేసుకుని తమ అవగాహన ఆచరణలను విస్తృతం చేసుకోవాలని కోరుకోవడం- స్థూలంగా ఈ మూడు లక్షణాలను ప్రత్యామ్నాయ విప్లవ లక్షణాలుగా చెప్పొచ్చు. ఇట్లా అంటే ఎక్కడ ప్రగతి వాద వ్యతిరేకులమని పేరు పడాల్సి వస్తుందో అన్న భయం ఈ కవికి లేదు.’’ లక్ష్మీనరసయ్య ఊహించినట్లే నాకు పడిన శిక్ష దశాబ్ద కాలం. ప్రగతిశీల వేదికల నుంచి బహిష్కారం. పది క్యాలెండర్ల అనంతరం, తెలంగాణ అస్తిత్వ ఉద్యమంతోనే, ఆ సందర్భంగా నేను చేసిన రచనలతోనే, నేను చేసిన కార్యకలాపాలతోనే నాకు విముక్తి దొరికింది. నన్ను మళ్లీ లెక్కలోకి తీసుకున్నరు.

Updated Date - Dec 15 , 2025 | 03:35 AM