Amarajyothi Memorial: బంగారు దివ్వెలో కానరాని అమరుల స్మృతి!
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:12 AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున, సచివాలయం సమీపంలో అమరజ్యోతి స్మారకాన్ని నిర్మించారు...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున, సచివాలయం సమీపంలో అమరజ్యోతి స్మారకాన్ని నిర్మించారు. అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న అమరుల స్మారకాలు కలిగించినంత ప్రేరణను ఈ కొత్త స్మారకం కలిగిస్తున్నదా? కోట్లాది రూపాయలు వెచ్చించి భారీతనంతో కూడిన ప్రదర్శన వసతులతో ఒక లివింగ్ మెమోరియల్‌గా దీన్ని నిర్మించారు అందులోకి అడుగుపెట్టగానే ఒక స్మారక భవనంలోకి గాక, ఒక పెద్ద షాపింగ్ మాల్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, ఎస్కలేటర్లు, కన్నులు చెదిరే రంగులు, వీడియో స్క్రీనింగ్ హాల్... ఇలా అన్ని హంగులూ ఉన్నాయి కానీ, ఆత్మ లేదు. స్టెయిన్‌లెస్ స్టీల్ చట్రంలోని బంగారు రంగు దివ్వె అత్యంత సాహసోపేతమైన, త్యాగభరితమైన, విషాదకరమైన బలిదానాలనో, అవి సాధించిన విలువైన విజయాన్నో ఆవిష్కరించలేకపోతున్నది. మట్టి ప్రమిదని పెట్టమని కోరడం లేదు కానీ, ఆ ప్రాకారానికో బయటకు కనిపించే గోడలకో తెలంగాణ సాంస్కృతికతను ప్రతిబింబించే కళారచన చేసి ఉండవచ్చును. అక్కడి గోడల మీద ఒక్కొక్క అమరుని పేరు ఉండాల్సింది. కానీ కనీసం అమరవీరులెవరో ఇంకా లెక్క తేల్చలేదు. అందుకు కావలసిన పరిశోధనే జరగలేదు. వారి కథనాలు సంకలితం కాలేదు. రాష్ట్రం అవతరణ తరువాత, ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ప్రత్యేక చరిత్రను నిర్మించే పని జరగలేదు. చిన్నస్థలంలోనే ఉన్నప్పటికీ, గన్‌పార్క్ అమరవీరుల స్థూపం మలిదశ ఉద్యమానికి అంతటికీ యాత్రాస్థలంగా మారింది. ప్రతి చిన్న కార్యాచరణ గన్‌పార్క్ నుంచే ఆరంభమైంది. అన్ని పాయల ఉద్యమకారులకూ అది ఉమ్మడి పవిత్ర స్థలం. మరి ఈ కొత్త అమరజ్యోతి అందరికీ అందుబాటులో ఉంటున్నదా? అమరజ్యోతిలో భాగమైన ఆడిటోరియంలో అన్ని రకాల సభలకూ అనుమతి ఉన్నదా? ఉద్యమ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అని మేధావులు చర్చలు చేయడానికి ఇక్కడ వీలు ఉంటుందా? కవులకు, కళాకారులకు, చిత్రకారులకు, సృజనకారులకు కార్యక్షేత్రంగా ఇది ఎప్పుడు మారుతుంది? అమరజ్యోతి సముదాయం అంతటా సన్నగా తెలంగాణ ఉద్యమ సంగీతం ఎప్పుడు వినిపిస్తుంది? తెలంగాణ స్మారక చిహ్నాన్ని ప్రజా ఉద్యమాలకు వేదికగా చేయటమే మిగిలింది. ఆ దీపంలోకి కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా ఒంపగలిగితే సరే, లేకపోతే, బంగారు, రత్నాల తెలంగాణ వాదులు మినహా తక్కిన వారందరికీ గన్‌పార్క్ మాత్రమే దిక్కవుతుంది.
– శ్రీచంద్ర, చిత్రకారుడు, జర్నలిస్ట్