Poisonous Cough Syrup Claims More Lives: విషం విషాదం
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:45 AM
మీ దేశంలో సరే, పసిపిల్లలను పొట్టనబెట్టుకున్న ఆ దగ్గుమందును ఇతర దేశాల్లోనూ అమ్ముకున్నారా? అని ప్రపంచ ఆరోగ్యసంస్థ మనల్ని నిలదీస్తోంది. అవునని మనం గనుక అంటే, భారతదేశం నుంచి వచ్చిన సదరు...
మీ దేశంలో సరే, పసిపిల్లలను పొట్టనబెట్టుకున్న ఆ దగ్గుమందును ఇతర దేశాల్లోనూ అమ్ముకున్నారా? అని ప్రపంచ ఆరోగ్యసంస్థ మనల్ని నిలదీస్తోంది. అవునని మనం గనుక అంటే, భారతదేశం నుంచి వచ్చిన సదరు విషపూరిత దగ్గుమందుతో మీ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడవేయకండి అంటూ ప్రపంచదేశాలన్నింటిలోనూ అది టమకు వేయిస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు మనమీద ప్రత్యేకమైన పగలూవగలూ ఏమీలేవు. కానీ, మన దగ్గుమందుకు విదేశాల్లో సైతం పసిప్రాణాలను పెద్దసంఖ్యలో చిదిమేసిన ఘనమైన గతం ఉన్నది కనుక, మరో కొత్త విషం విషయంలో ఆరోగ్యసంస్థ ఇలా ఉలిక్కిపడటం తప్పేమీ కాదు. ఈ కాలకూట విషానికి రోజూ ఒక్కరొక్కరుగా ప్రాణాలు వదిలేస్తూనే ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా, రాజస్థాన్‌తోనూ కలిపి ఇప్పటివరకూ 2౨మంది పిల్లలు మరణించారు. నాగపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని, ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో తెలియక ఈ దగ్గుమందువాడే ప్రమాదం కూడా లేకపోలేదని అధికారులు అంటున్నారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నందువల్ల కాబోలు, ఈ విషాదఘట్టం కూడా రాజకీయమైపోయింది. సదరు దగ్గుమందు తయారైంది కాంచీపురంలో కనుక, ఆ కంపెనీమీదా, దాని యజమానిమీద మేము చెప్పినమేరకు, ఆదేశించిన రీతిలో తమిళనాడు ఆరోగ్యశాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రం నిలదీస్తోంది. శ్రేసన్ ఫార్మామీద దాడి సహా చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నామని తమిళనాడు వాదిస్తోంది. రాజకీయానికి ఇది సమయం కాదని అంటూనే ఈ విమర్శలు, ప్రతివిమర్శల పర్వం సాగుతోంది. పరిమితికి ఐదురెట్లు అధికంగా డైఎథిలీన్ గ్లైకాల్ వినియోగించిన ఈ కోల్డ్‌రిఫ్ దగ్గుమందును చాలా రాష్ట్రాలు నిషేధించాయి, ప్రకటనలు కూడా జారీ చేశాయి. దీనిని ముందు జాగ్రత్త అనుకోవాలో, చేతులు కాలాక ఆకులుపట్టుకోవడమేనని బాధపడాలో తెలియదు. అంతమంది పిల్లలు కన్నుమూస్తే కానీ, తమిళనాడు ప్రభుత్వం మేలుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంనుంచి ఫిర్యాదు అందుకున్న తమిళనాడు అధికారులు సదరు ఫార్మా కంపెనీలో కాలూని, అక్కడి వాతావరణం చూసి నిర్ఘాంతపోయారని మీడియా అంటోంది. ఫార్మారంగంతో సంబంధం లేని కార్మికులు తుప్పుపట్టిన పరికరాలు వాడుతూ, గ్లౌజులు, మాస్కులు లేకుండా గ్యాస్‌స్టవ్‌లపైన రసాయనాలు వండుతున్నారనీ, అపరిశుభ్రమైన నీరు, దుమ్మూ ధూళి కలగలసి ఆ సిరప్పులు తయారవుతున్నాయని మీడియా తెలియచేసింది.
ఈ మందులో వినియోగించాల్సిన రసాయనాలను పెయింట్ పరిశ్రమ డీలర్లనుంచి కొనుగోలు చేస్తున్నారని, వాటిని కచ్చితంగా తూచకుండా, పరీక్షించకుండా కలిపివేస్తున్నారని అధికారులు గ్రహించారు. చట్టం ప్రకారం ఈ సంస్థ నలభై అతికీలకమైన, మూడువందలకు పైగా అతిముఖ్యమైన ఉల్లంఘనలకు పాల్పడిందని తమిళనాడు అధికారులకు అప్పుడు గానీ తెలియరాలేదట. సదరు కంపెనీ మీద తమిళనాడు ఏ చర్యలు తీసుకున్నా, డాక్టర్‌ను అరెస్టుచేసి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల వంటివారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసినా అంతా ఉపరితలవిన్యాసమే. ఒక అనుమతిపొందిన కంపెనీ తయారుచేసిన దగ్గుమందును చీటీమీద రాసినందుకు వైద్యుడిని ఎలా అరెస్టుచేస్తారని వారి సంఘం ప్రశ్నిస్తున్నదట. చవుకబారు రసాయనాలతో, తప్పుడు విధానాలతో, నాణ్యతలేని ఒక దగ్గుమందును తయారుచేసి, ఐదారురెట్ల ధరకు దానిని విక్రయిస్తున్న ఆ కంపెనీని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. దాని లాభాల్లో వాటాలు పొందుతున్న వైద్యులు, అధికారులు కూడా పాపంలో భాగస్వాములే. రసాయనాల కొనుగోలు, తయారీ, పంపిణీ ఇత్యాది ప్రతీ దశా మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. రాజకీయ నాయకుల పరోక్ష అనుమతితో, అధికారుల ప్రత్యక్ష సహకారంతో కళ్లముందు తయారవుతున్న విషం ఇది. ఐదేళ్ళక్రితం జమ్మూకశ్మీర్ సహా కొన్ని రాష్ట్రాల్లో చిన్నారులను చిదిమేసిన ఘటనలు మన మనసుకు తాకలేదు. మరో రెండేళ్ళకు గాంబియాలోనూ, ఆ తరువాత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లోనూ మన దగ్గుమందు పెద్దసంఖ్యలో పసిప్రాణాలతో పాటు అంతర్జాతీయంగా భారత్ పరువు కూడా తీసింది. ఫార్మాకంపెనీలు, ఫ్యాక్టరీల మీద నిఘా, పర్యవేక్షణ మరింత పెరగాలి. పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధిలేనంత కాలం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి.