Vinayaka Chavithi Celebration: ఎడారి దేశాల్లో వినాయక వేడుకలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:51 AM
భారతీయ పండుగలు సంప్రదాయాల సమ్మేళనాలు. తరతరాల ఆచారాలు, జీవన రీతులను సంరక్షిస్తూ భారతావని సాంస్కృతిక వైభవాన్ని...
భారతీయ పండుగలు సంప్రదాయాల సమ్మేళనాలు. తరతరాల ఆచారాలు, జీవన రీతులను సంరక్షిస్తూ భారతావని సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని అవి ప్రతిబింబిస్తాయి. భారతదేశంలో పండుగలు మత, సాంస్కృతిక, సామాజిక అంశాల పట్టు పోగులతో అల్లిన శోభాయమానమైన వస్త్రాలు. వివిధ పండుగల సంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. పర్వదినాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. ఈ వేడుకలను నిర్వహించే వేదికలు భిన్న వర్గాల జనులను సమైక్యం చేస్తాయి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజలను సంఘటితపరిచి వలస పాలకుల వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించేందుకు వినాయక చవితి ఉత్సవాలను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తిదాయకంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాలలో ఉన్న భారతీయులు భారతీయ స్ఫూర్తిని ఆవాహన చేసుకుని తమను తాము విలక్షణంగా నిలబెట్టుకునేందుకు వినాయక చవితి, విజయ దశమి, దీపావళి వేడుకలు జరుపుకోవడం పరిపాటిగా ఉన్నది.
గల్ఫ్ దేశాలలోని ప్రవాసులలో వినాయక చతుర్థి శోభ వెల్లివిరుస్తోంది. మాతృదేశంలో వలే ఆర్భాటంగా కాకున్నా ఆద్యంతం ఆధ్యాత్మికంగా గణనాథుడిని ప్రవాస భక్తులు ఆరాధిస్తున్నారు. స్వదేశంలో మాదిరిగా తొమ్మిది రోజుల పాటు కాకుండా ఈ ఎడారి దేశాలలో సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల పాటు బొజ్జ గణపతికి పూజలు చేసి ఆ వేల్పు ప్రతిమను నిమజ్జనం చేస్తుంటారు. చాలామంది స్వగృహాలలోని స్నానపు తొట్టెల (బాత్ టబ్స్)లో నిమజ్జనం చేస్తుంటారు! చెంతనే ఉన్న అరేబియా సముద్రంలో నిమజ్జనం చేసేవారు తక్కువే. దుబాయి, మస్కట్, బహ్రెయిన్‌లలో కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రం సింధీ వ్యాపారస్తులు వినాయక పూజలు తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా చేస్తుంటారు. ఈ సారి 18 అడుగుల ఎత్తు ఉన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా గిన్నిస్ రికార్డులో తమ ఘనతను నమోదు చేయించుకోవడానికి దుబాయిలో కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒక్క దుబాయిలోనే కాదు, అన్ని ఎమిరేట్స్‌లోని ఔత్సాహికులకూ ఈ సందర్భం ఒక గుణాత్మక సందేశాన్ని ఇచ్చింది. దుబాయి, షార్జా, మస్కట్ నగరాలలో భారతీయ సంప్రదాయ వస్తువులు, పూజ సామగ్రి విక్రయించే దుకాణాలు వినాయక చవితి మందు రోజుల్లో గణపతి ప్రతిమల విక్రయాలతో సందడి సందడిగా ఉంటాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లే ఆధ్యాత్మిక గేయాలను ఆలపించే సాంకేతిక సామగ్రి మొదలు పూజాద్రవ్యాల వరకు అనేకం ‘మేడ్ ఇన్ చైనా’వి కావడం గమనార్హం. గల్ఫ్ దేశాలలోని విద్యాలయాల వేసవి సెలవులు ఇటీవలే ముగిశాయి. సెలవులకు స్వస్థలాలకు వెళ్ళిన ప్రవాస భారతీయ కుటుంబాలు తిరిగి వస్తూ తమ వెంట ఏకదంతుని విగ్రహాలనూ తీసుకువచ్చాయి. దుబాయి, బహ్రెయిన్, ఒమాన్, ఖతర్‌లలోని కొన్ని లేబర్ క్యాంపులు వినాయక మండపాలతో కోలాహలంగా మారాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు ప్రవాసుల సమూహాలు తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తాయి. ఒక్క ఆజ్మాన్‌లోని త్రిమూర్తుల ఫాంలో మాత్రమే ఎత్తైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మట్టి గణేశుని విగ్రహాన్ని ఇక్కడకు దిగుమతి చేసుకుని త్రిమూర్తులు దీన్ని ప్రతిష్ఠిస్తారు. సింధీ ప్రజల ప్రాబల్యం ఉన్న పండుగల వాతావరణంలో ఆజ్మాన్‌లోని తెలుగువారందరికి ఆ మట్టి గణేశుడే ఒక పెద్ద దిక్కు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెండు హిందూ దేవాలయాల కంటే చాలా పురాతనమైన హిందూ దేవాలయం ఉన్న దేశం బహ్రెయిన్. ఈ దేశంలోని శివ మందిరం గల్ఫ్ ప్రాంతంలో అత్యంత పురాతన హిందూ దేవాలయం. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న కోవెల ఇది. లోకమాన్య తిలక్ భారతదేశంలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టని కాలంలోనే బహ్రెయిన్‌లో వినాయక చవితి ఉత్సవాలు జరిగేవి. కృష్ణ మందిరంతో పాటు అనేక లేబర్ క్యాంపులలో వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. బహిరంగ విగ్రహారాధన, అన్యమత కార్యకలాపాలు నిషిద్ధమైన సౌదీ అరేబియాలో సైతం కొన్నేళ్లుగా తెలుగు ప్రవాసుల నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కువైత్‌లో కొనసాగుతున్న విస్తృత వీసా తనిఖీల కారణంగా వినాయక చవితి కార్యక్రమం పూర్తిగా వ్యక్తిగత ఆరాధనగా మారింది. రాయలసీమ ప్రవాసులు చేసే హడావుడి ఈ సారి పూర్తిగా తగ్గిపోయింది. ఒమాన్‌లోని మస్కట్ నగరంలో గల చరిత్రాత్మక శివమందిరంలోనే కాకుండా ఆ దేశ వ్యాప్తంగా గణనాథుని పూజలు జరుగుతున్నాయి. లేబర్ క్యాంపులలో ప్రతి వారాంతంలోనూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. మాతృదేశంలో వలే ఇక్కడ కూడా లడ్డూను వేలం వేయడం పరిపాటి అయింది. కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేలం యువతలో మత సంప్రదాయాల పట్ల ఉత్సుకతను పెంచుతోంది. గల్ఫ్‌లో ఏటా ఒక నూతన ప్రదేశంలో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు.
-మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)