Remembering Kadalri Sathyanarayana Murthy: విస్మృత బౌద్ధ మేధావి
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:57 AM
అరుదైన తెలుగు భావోద్యమకారుడు కడలి సత్యనారాయణమూర్తి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బౌద్ధ బహుజన సాంస్కృతిక...
అరుదైన తెలుగు భావోద్యమకారుడు కడలి సత్యనారాయణమూర్తి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బౌద్ధ బహుజన సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషి చేసిన మహావ్యక్తి. ప్రగతిశీల వామపక్ష ఉద్యమం మొదలు హేతువాద, అంబేడ్కర్, ఫూలే ఆలోచనా స్రవంతుల్ని పరిపుష్టం చేసిన మేధావి. ఒకవైపు రచనా వ్యాసంగం, మరోవైపు అలుపెరుగని కార్యాచరణతో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అసాధారణ క్రియాశీలిగా ఎదిగిన దార్శనికుడు. దశాబ్దాల క్రితమే బౌద్ధాన్ని లోతుగా అధ్యయనం చేసి పీడితుల విముక్తి మార్గంగా గుర్తించి ప్రచారం చేసిన ఆలోచనాపరుడు. దళిత బహుజన స్త్రీల బలమైన గొంతుకగా ‘గోదావరి కెరటాలు’ పత్రిక స్థాపించినవాడు. గోదావరి జిల్లాల్లో తొలి బుద్ధ విహార వ్యవస్థాపకుడు. అక్టోబర్ 12, 1938న రాజోలులో సత్యనారాయణమూర్తి జన్మించాడు. అక్కడే పీయూసీ చదివి అనేక పనులు చేశాడు. కొంతకాలం హైదరాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో వార్డెన్‌గా పనిచేశాడు. ముక్కుసూటితనం, అక్రమాలు సహించలేనితనం వల్ల ఎక్కడా ఎక్కువకాలం నిలదొక్కుకోలేదు. చివరికి కాకినాడ సబ్ ట్రెజరీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. హేతువాద సంఘం బాధ్యునిగా అనేక సభలు సమావేశాలు నిర్వహించాడు. మొట్టమొదటిసారిగా డా. అబ్రహం కోవూర్, బి.ప్రేమానంద్ వంటి ప్రపంచ ప్రఖ్యాత హేతువాదులని తీసుకొచ్చి ఎన్నో విజ్ఞానదాయక కార్యక్రమాలు చేపట్టాడు. మూఢనమ్మకాలు, మహిమల బండారాలు బయటపెట్టాడు. ఆ క్రమంలోనే వివిధ వామపక్ష సిద్ధాంతాల్ని అధ్యయనం చేశాడు. విశాఖపట్నం వెళ్ళి శ్రీశ్రీని కాకినాడ తీసుకొచ్చాడు. మార్క్సిస్టు సానుభూతిపరుడిగా మారాడు. ఆనాటి పీపుల్స్‌వార్ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కె.ఎస్ సత్యమూర్తి, గద్దర్ వంటి వారితో సంబంధాలు పెంచుకున్నాడు. వాల్ రైటింగ్స్ రాసేవాడు, కరపత్రాలు పంపిణీ చేసేవాడు. భూపతి నారాయణమూర్తి పరిచయంతో దళిత బహుజన సాంస్కృతిక శాస్త్రాలను అధ్యయనం చేశాడు. డా. బి.ఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలేల తాత్వికత మూర్తి దృక్పథాన్ని మలుపు తిప్పింది. దొమ్మేటి సత్యనారాయణ బోధి ప్రభావంతో బౌద్ధం గురించి లోతైన పరిశోధన చేశాడు. అంతిమంగా బౌద్ధ బహుజన ప్రత్యామ్నాయ సిద్ధాంతవేత్తగా రూపొందాడు. ఇదంతా ఒకెత్తయితే, 90వ దశకంలో బౌద్ధం స్వీకరించిన సత్యనారాయణమూర్తి, దళితులు (ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు), స్త్రీల సమస్యల దర్పణం అని ప్రకటించి ‘గోదావరి కెరటాలు’ పత్రిక స్థాపించడం ఒక్కటీ ఒకెత్తు. దళిత బహుజన భావజాల సాధనంగా అక్షరాలని తలకెత్తుకున్న సత్యనారాయణ సుమారు 12 ఏళ్ళ సర్వీసుని స్వచ్ఛందంగా వొదులుకుని పత్రిక పెట్టాడు. ప్రసిద్ధ అంబేడ్కరిస్ట్ వి.టి. రాజశేఖర్ బెంగళూరు నుంచి ‘దళిత్ వాయిస్’ పత్రిక స్థాపించిన సరిగ్గా పదేళ్లకు 1991లో తెలుగులో ‘గోదావరి కెరటాలు’ ఆరంభించాడు.
దానిని ప్రత్యామ్నాయ పీడితుల స్వరంగా నిలిపాడు. బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలేల విశిష్ట భావజాల వాహకంగా పత్రికని మలిచాడు. గోదావరి కెరటాలు పత్రిక నారాయణ గురు, పెరియార్ వంటి వారి ఆలోచనలకి సైతం అద్దం పట్టేది. వి.టి రాజశేఖర్ రచనల్ని తెలుగులోకి తెచ్చిన మొదటి పత్రిక కూడా ఇదే. అంతకంటే విశేషం దళిత్ వాయిస్ పత్రిక 1991 డిసెంబర్ సంచికలో ‘గోదావరి కెరటాలు’ అనే తెలుగు పత్రిక మానవ హక్కుల స్వరంగా వృద్ధి చెందుతోందని అభినందిస్తూ విజయరాజ్ రాసిన వ్యాసం ప్రచురించడం. దళిత్ వాయిస్ వంటి ఒక జాతీయ స్థాయి పత్రిక తన సైద్ధాంతిక సరళికి దగ్గరగా ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పత్రిక గురించి ప్రకటించడం చారిత్రక విశేషం. దాన్ని బట్టి గోదావరి కెరటాలు పత్రిక తెలుగు భావోద్యమ రంగంలో ఏ విధంగా కృషి చేసిందో అర్థమవుతుంది. ఊ. సాంబశివరావు, కంచ ఐలయ్య వంటి మేధావులతో ఏర్పడ్డ ‘దళిత రచయితలు, మేధావులు, కళాకారుల ఐక్య వేదిక’లో కూడా సత్యనారాయణమూర్తి కీలకపాత్ర పోషించాడు. కె.జి సత్యమూర్తి ఆధ్వర్యంలో నడిచిన ఏకలవ్య పత్రిక సంపాదకవర్గంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల్లో తొలి బుద్ధ విహారాన్ని కాకినాడ ట్రెజరీ కాలనీలో స్థాపించాడు. వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి, అనేక బృహత్తర కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించాడు. హేతువాద కార్యకర్తగా, కమ్యూనిస్టు మేధావిగా, ఫూలే– అంబేడ్కర్ అభిమానిగా, దళిత బహుజన ఉద్యమకారుడిగా, ప్రత్యామ్నాయ రచయితగా, పత్రికా సంపాదకునిగా, జీవితాంతం పీడితుల ఉన్నతి కోసమే వెచ్చించిన కడలి సత్యనారాయణమూర్తి అరవై ఏళ్ల వయసులో జనవరి 23, 1998న మరణించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, దశాబ్దాల పాటు పత్రికను నిరవధికంగా కొనసాగించాడు. ఆయన నిరాడంబరతను గురించి ఇప్పటికీ మిత్రులు కథలుగా చెప్పుకుంటారు. విస్మరించబడ్డ బహుజన మేధావి, తొలి బౌద్ధ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కడలి సత్యనారాయణమూర్తి స్ఫూర్తిని పునర్నిర్మించుకోవడమే నేటి దళిత బహుజన ప్రజాతంత్ర శ్రేణుల ముందున్న కర్తవ్యం.
- గౌరవ్