Share News

Kaloji Narayana Rao: పోరాటాల స్ఫూర్తి శిఖరం

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:52 AM

పోరాటాల స్ఫూర్తి శిఖరం కాలమేదైనా కాలాంతకులపై కళ్లెర్రజేశావు ..

Kaloji Narayana Rao: పోరాటాల స్ఫూర్తి శిఖరం

కాలమేదైనా

కాలాంతకులపై కళ్లెర్రజేశావు

ఎండుకుపోతున్న నేల దుర్నీతిని ఎండగట్టావు

అన్యాయాన్నెదిరించి అగ్గిబరాటై నిలిచావు


బువ్వ, తొక్కే మా భాషలు

పలుకుబడులే మా గుండెసవ్వడులు

తంగెడుపూలే మా పరిమళాలు

బతుకమ్మ బోనాలే

మా సాంస్కృతిక పతాకాలని ఎలుగెత్తి చాటావు

పుట్టమన్ను తెచ్చి రచ్చకట్టపై అలికి

బొడ్రాయి ముందు మాండలికాల చిత్రపటమేశావు


భుజాన సంచేసుకొని

సద్దకంకుల్లా అక్షరగింజల్ని పంచిపెట్టావు

నాగొడవంతా ప్రజాగొడవనేనని ప్రకటించావు

నలుగురికోసం రందిపడి

జనంకోసం జమిడీక నగారై మోగావు


స్వేచ్ఛా సంగ్రామంలో నీ కవితలే

రాబందులపై రాకెట్లలా దూసుకుపోయినవి

నీ కన్నీళ్లే నీటిగోసలై జలదీక్షలై నిలదీసినవి

నీ పట్టుదలలే ధిక్కార సాహితీ సమ్మేళన

తుఫానులై సాగినవి


మానవహక్కులను అడుగనేర్పిన చైతన్యదీప్తి

గులాంగిరిని బొందపెట్టె తాత్విక జీవనగీతం

పోరాటాలకు స్పూర్తి శిఖరం తెలంగాణ ధ్వజస్తంభం

– -వనపట్ల సుబ్బయ్య

Updated Date - Sep 09 , 2025 | 04:52 AM