Share News

Hamas Atrocities and Israels Brutality: హమాస్ దుర్మార్గం ఇజ్రాయెల్ అమానుషం

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:24 AM

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడి, నాజీ పాలన తర్వాత జరిగిన అతి పెద్ద మానవ ఊచకోత. ఈ దాడి ప్రధానంగా జరిగింది మిలిటరీ మీద కాదు. ఐక్యరాజ్యసమితి...

Hamas Atrocities and Israels Brutality: హమాస్ దుర్మార్గం ఇజ్రాయెల్ అమానుషం

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడి, నాజీ పాలన తర్వాత జరిగిన అతి పెద్ద మానవ ఊచకోత. ఈ దాడి ప్రధానంగా జరిగింది మిలిటరీ మీద కాదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో సుమారు 850మంది పౌరులు ఉండగా 350మంది మిలిటరీ పోలీసులు ఉన్నారు. ఈ దాడిలో సేఫ్ హౌస్‌లో దాక్కోడానికి ప్రయత్నించిన సాధారణ పౌరులను– వారు పిల్లలా, వృద్ధులా అన్నదానితో సంబంధం లేకుండా– మంటల్లో తగలబెట్టారని ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. లూటీలు జరిగాయని, తలలు నరికివేయడం కూడా జరిగిందని ఆ నివేదిక తేల్చిచెప్పింది. అంతేగాక సెక్సువల్ వయెలెన్స్ మీద ఐరాస సెక్రెటరీ జనరల్ జరిపిన ప్రత్యేక పరిశోధనలో కిబ్బుట్జ్ ప్రాంతంలో రేప్‌లు, గ్యాంగ్ రేప్‌లు జరిగాయని తేలింది. ఎన్నోచోట్ల స్త్రీల అర్ధనగ్న, నగ్న దేహాలు పడివున్నాయని, మర్మాంగాల ఛేదనం జరిగిందని ఆ ఐరాస బృందం కనుగొన్నది. ఈ బృందం సుమారు 5000 ఫొటోలు, 50 గంటల నిడివి ఉన్న ట్రాఫిక్ కెమెరాలతో సహా అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్లనూ పరిశీలించి, ప్రత్యక్ష సాక్షులను విచారించి ఈ నివేదికను రూపొందించింది. ‘హమాస్’ అనే పేరు ‘హరఖత్ అల్ ముఖవా అల్ ఇస్లామియా’ అన్న పూర్తిపేరుకు క్లుప్తపదం. దీనికి అర్థం ‘ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం’ అని. ఈ సంస్థ ఫండమెంటల్ స్వభావం కలిగినది. యాసర్ అరాఫత్ నాయకత్వంలో పాలస్తీనా విమోచన ఉద్యమంలో భాగంగా ఏర్పడిన పార్టీ ‘ఫతా’. ఈ ఫతా పార్టీ పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌ను పాలిస్తుంది. ఫతా పార్టీ ఆదర్శం ఒక సర్వసత్తాక, గణతంత్ర, లౌకిక పాలస్తీనాను ఏర్పరచడం.


అయితే హమాస్ భావజాలం అందుకు భిన్నమైనది. కేవలం ఇస్లాం మత సౌభ్రాతృత్వంతో కూడిన పాలస్తీనాను ఏర్పరచడమే దాని ఆదర్శం. ఆ సంస్థ 1988లో తన శాసనావళిలో స్పష్టంగా– ఇజ్రాయెల్‌ను తుడిచిపెట్టేసి జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం దాకా పాలస్తీనా ‘ఇస్లామిక్’ సామ్రాజ్యాన్ని ఏర్పరచడం తన ఆదర్శమని రాసుకున్నది. హమాస్ ఇంతటి స్పష్టమైన ఉద్దేశంతో ఏర్పడటంతో సహజంగానే ఇజ్రాయెల్‌లో దీనిపట్ల అప్రమత్తత నెలకొన్నది. 2007 ఎన్నికల్లో ఫతా పార్టీని హమాస్ గాజాలో ఓడించింది (132 సీట్లకు గాను 74 సీట్లు గెలుచుకుంది). ఆ తర్వాత ఫతా సంస్థపై దాడులు, హత్యలు, చిత్రహింసలతో విరుచుకుపడింది. చివరకు ఆ ప్రాంతంలో తానే ఏకైక పార్టీగా మిగిలి, అధికారం చెలాయిస్తూ వచ్చింది. మిలిటరీ హత్యాకాండను నమ్ముతూ, తమను రూపుమాపే లక్ష్యంతో ఉన్న హమాస్‌ అధికారంలోకి రావటంతో సహజంగానే ఇజ్రాయెల్‌ 2007 తర్వాత గాజా చుట్టూ ఒక పూర్తి నిర్బంధ స్థితిని తీసుకువచ్చింది. అంతవరకు అమెరికా, యూరోప్‌ల నుంచి మిలియన్‌ డాలర్లలో అందే ఆర్థిక సహాయం కూడా నిలిచిపోయింది. హమాస్ ఒక విముక్తి పోరాట సంస్థ అని చెప్పే వాళ్ళకు విప్లవం ఎలా ఉంటుందో తెలియకపోయి ఉండాలి, లేదా అది ‘ఫాల్స్ గ్లోరిఫికేషన్’ ద్వారా సమర్థించడం అయినా అయి ఉండాలి. మన దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ పార్లమెంట్‌లో బాంబులు వేసాడు గాని, వెళ్ళి బ్రిటిష్ కుటుంబంలో చిన్నపిల్లల మీద, ఇంట్లో స్త్రీల మీద బాంబు వేయలేదు. మన దేశంలో మిలిటరీ విముక్తి పోరాటం చేస్తోందని చెప్పుకునే అతి పెద్ద సాయుధ పోరాట మావోయిస్ట్ సంస్థ కూడా ఇందులో కనీసం ఒకటవ వంతు హత్యాకాండకు కూడా పాల్పడలేదు. కేవలం మిలిటరీ పైన, పోలీసుల పైన, అధికార యంత్రాంగం పైన మాత్రమే దాడులు చేయడం అన్నది– ఏ విముక్తి పోరాటం అయినా పాటించే ఒక అలిఖిత యుద్ధ న్యాయం. నక్సలైట్లు భూస్వాముల ఇళ్ళల్లోకి ప్రవేశించి భూస్వాములను చంపిన సందర్భాలు ఉన్నాయి కానీ, వాళ్ళ ఇంట్లో భార్యలను చెరచడం, పిల్లల్ని తగలబెట్టడం జరగలేదు. హింసను అంగీకరించడం అంగీకరించకపోవడం అది వేరే చర్చ.


ఏ దిశా లేని హింస అన్నది కేవలం టెర్రరిజం మాత్రమే! అయితే హమాస్ నాయకుడు ఘజీ హమద్ ‘‘మేము అక్టోబర్‌ 7న చేసిన హత్యాకాండ వల్లనే ఈ రోజు ప్రపంచం మా సమస్యను గుర్తిస్తున్నది’’ అని ప్రకటించాడు. అడ్డూ అదుపూ లేని ఏ హింసనైనా ఎవరైనా గుర్తిస్తారు. ఆ గుర్తించేది ఏ దృక్పథంతో గుర్తిస్తున్నారు అన్నది ముఖ్యం. ఈ కనీస ఆలోచన లేని యుద్ధ వీరులు చేసే దుర్మార్గాన్ని లిబరల్స్ ఏ మాత్రం విచక్షణ లేకుండా తలకెత్తుకోవడం ఈ ప్రపంచ మానవ సమాజం చేసుకున్న దురదృష్టం. పాలస్తీనా సమస్య వేరు, హమాస్ ప్రతిఘటన వేరు. ఈ రెంటి మధ్య అయోమయానికి గురై, రెండిటినీ ఒకే రకంగా తలకెత్తుకోవడం అవివేకం. హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందన మరింత అమానుషం! అందులో ‘proportionate response’ అన్నది లేదు. హమాస్ సభ్యులు ఇళ్ళ కింద, హాస్పిటల్స్‌ కింద టన్నెల్స్‌లోనూ దాక్కున్నారని చెప్పి ఇజ్రాయెల్‌ ఎడాపెడా హాస్పిటళ్లను, స్కూళ్లను పేల్చివేస్తుంటే మానవ సమాజం యావత్తూ సాక్షులుగా మిగిలిపోవాల్సి రావటం దారుణమైన స్థితి! ప్రపంచంలోనే అతిపెద్ద, అతిశక్తిమంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరుమోసిన ఇజ్రాయెల్‌కి చెందిన ‘మొసాద్’ కూడా అక్టోబర్ దాడిని పసిగట్టలేకపోయిందంటే ఎంత సిగ్గుమాలిన విషయం! దాడి జరిగిన తర్వాత బందీలు ఎక్కడున్నారో, హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నారో కూడా ఆ ఏజెన్సీ పసిగట్టలేకపోయింది. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ ఎయిర్ స్ట్రైక్స్‌ చేసి 67,000 మందిని ఇజ్రాయెల్ పొట్టనబెట్టుకుంది. ఇందులో 70 శాతం స్త్రీలు, పిల్లలు ఉన్నారు! అందులో హమాస్ మిలిటెంట్స్ 20 శాతం కూడా లేరు అని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెప్తున్నాయి.


ఇజ్రాయెల్ ఇది ‘కొలేటరల్ డ్యామేజ్’ అని నచ్చచెప్తోంది. తమాషా ఏమంటే– ‘ఇదంతా ఒట్టి కొలేటరల్ డ్యామేజ్ మాత్రమే! మెయిన్ డ్యామేజ్ అతి స్వల్పం! అంటే ఒక్క మిలిటెంట్‌ను చంపాలంటే నలుగురు సాధారణ పౌరులను చంపవచ్చు’ అని ఇజ్రాయెల్ ఇక్కడ తీర్మానిస్తున్నది. ఇన్ని యుద్ధాలు జరిగిన ఈ భూ ఖండంలో ఇంత అమానుషంగా, ఇంత స్థాయిలో, ఇంత disproportionateగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయింది లేదు (నాగసాకి, హిరోషిమా బాంబ్ ఘటన మినహాయిస్తే). నేడు సామ్రాజ్య వాదానికి, ఇస్లామిక్ విస్తరణ వాదానికి మధ్యలో నలిగిపోతున్నది ప్రపంచం. ఒకరు ఆస్తుల గురించి రాజకీయాలు చేస్తే, మరొకరు తమ మత విశ్వాసం వ్యాప్తి కోసం, మూఢులైన ప్రజల్లో తమ అధికార ప్రాబల్యం కోసం మానవ సమాజ వినాశనానికి పాల్పడుతున్నారు. ఒక తోడేలుకీ, ఒక పులికీ మధ్య చిక్కుకున్న గొర్రెపిల్ల పాలస్తీనా! ఫతా పార్టీ పూర్తిగా విఫలం కావడంతో దిక్కు తోచని పాలస్తీనా ప్రజలు హమాస్ వెనుక గుడ్డిగా తరలివెళ్ళారు. అందుకు మతం అనే సెంటిమెంట్ బలంగా పనిచేసింది. ఇజ్రాయెల్ బోర్డర్ కంట్రోల్ పేరుతో చెక్ పాయింట్స్ పెట్టి పాలస్తీనా ప్రజలను విపరీతమైన వ్యధకు గురిచేసింది. ప్రజల్లో ఉండే కసిని హమాస్‌ చాలా తప్పుదారిలో నడిపి మరింత క్లిష్టమైన పరిస్థితి తీసుకువచ్చింది. తమ పౌరులను హమాస్‌ బందీలుగా చేసుకుందన్న కారణంతో పాలస్తీనాలోని సాధారణ ప్రజలను ఇజ్రాయెల్‌ చంపుతున్నది. దీన్ని ఎవరన్నా యుద్ధం అని నిర్వచిస్తే మనలో మానవ ఇంగితం లోపించినట్టే! పాలస్తీనా వేరు, హమాస్ వేరు! రగిలిపోయిన యూదుల కుటుంబాలు వేరు, వారికి జరుగుతున్న న్యాయం వేరు! ఒకటి దుర్మార్గం, మరొకటి అమానుషం!

-పి. విక్టర్ విజయ్‌కుమార్

Updated Date - Oct 23 , 2025 | 04:24 AM