Share News

Federalism: ఫెడరల్‌ రాజ్యాంగ పీఠికకు మరో చేర్పు

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:13 AM

భారత జాతీయ జాగృతిలో కీలక పాత్ర వహించిన వలసపాలన వ్యతిరేక ఆలోచనారంగంలో విశాల దృక్పథమూ, ముందుచూపుతో..

Federalism: ఫెడరల్‌ రాజ్యాంగ పీఠికకు మరో చేర్పు

భారత జాతీయ జాగృతిలో కీలక పాత్ర వహించిన వలసపాలన వ్యతిరేక ఆలోచనారంగంలో విశాల దృక్పథమూ, ముందుచూపుతో ప్రశస్త భావాలు ప్రభవించాయి. అయితే 1947లో భారత స్వాతంత్ర్య విజయం అనంతరం వలసపాలనానంతర రాజ్య వ్యవస్థ అత్యున్నత స్థాయిలో అధికార పోరాటం కారణంగా ఆ సమున్నత భావాలలో కొన్ని నిలదొక్కుకోలేకపోయాయి. అధికారంలో పాలుపంచుకోవడంలో ఫెడరల్ కేంద్రం, రాష్ట్రాల మధ్య అనివార్యమైన సర్దుబాట్లు అనేది ఆ భావాలలో ప్రముఖమైనది. మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన, దాని విషమ పర్యవసానాలు ప్రాంతీయమైన రాజకీయ గతిశీలతను కనిపించకుండా చేశాయి. ఆ రాజకీయ శక్తిశీలతే స్వతంత్ర భారతదేశాన్ని ఒక సమాఖ్య రాజ్యంగా రూపొందించే విషయమై వలసపాలన వ్యతిరేక జాతీయవాదులలో వినూత్న ఆలోచనలకు ప్రేరణనిచ్చింది. ప్రజాస్వామ్య సమాజం, సమాఖ్య వ్యవస్థ విషయమై స్వాతంత్ర్య సమర నాయకుల సృజనాత్మక భావాలు స్వతంత్ర భారతదేశ ప్రస్థానంలో సాకారమవలేదు. అవకపోగా అలక్ష్యానికి గురయ్యాయి. ఇపుడు ఆ సమున్నత దార్శనికతల సృజనాత్మక పునరుద్ధరణకు మనం పూనుకోవాల్సిన అవసరమున్నది. భారత రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులర్‌’ (లౌకిక), ‘సోషలిస్ట్‌’ (సామ్యవాద) అనే పదాలను తొలగించివేసే విషయాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పెద్దలు సూచించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో ప్రధాని ఇందిర ప్రభుత్వం రాజ్యాంగానికి 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ఆ రెండు పదాలు చేర్చింది. ‘సెక్యులర్‌’ను తొలగించడం, హిందూ గణతంత్ర రాజ్య ఏర్పాటు ప్రతిపాదకులకు ఒక ప్రతీకాత్మక విజయమవుతుంది. ‘సోషలిస్ట్‌’ను చరిత్ర చెత్తబుట్టపాలు చేయడం సామాజిక–ఆర్థిక అసమానతలు అంతు పొంతు లేకుండా పెచ్చరిల్లిపోవడాన్ని నిస్సిగ్గుగా వేడుక చేసుకుంటున్న యుగానికి సముచితమైనది కావచ్చు.


సెక్యులరిజం, సోషలిజం రెండిటినీ కేంద్రీకృత రాజ్య వ్యవస్థ అధికారానికి సైద్ధాంతిక ఆధారాలుగా ఇందిరాగాంధీ పరిగణించారు. ఆ దృక్పథంతోనే ఆమె ఆ రెండు భావనలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. అయితే ఈ రెండు సైద్ధాంతిక పునాదులు బీటలు వారడంతో మతపరమైన మెజారిటేరియన్‌వాదం ఆ రెండింటిని కేంద్రీకృత నిరంకుశాధికారాన్ని పెంపొందించుకుని, పటిష్ఠం చేసుకునేందుకు చక్కగా ఉపయోగించుకున్నది. రాజ్యాంగ పీఠికలోని ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యత ఉన్నట్టయితే ఆ పీఠిక నుంచి రెండు పదాలను తొలగించడం కాకుండా మరొక పదాన్ని అదనంగా చేర్చడం విజ్ఞతాయుతంగా ఉంటుంది, సందేహం లేదు. నవంబర్‌ 15, 1948న రాజ్యాంగ సభలో కేటీ షా అధికరణ 1కి ఒక సవరణ ప్రతిపాదించారు. ‘ఇండియా షల్‌ బి ఏ సెక్యులర్‌, ఫెడరల్‌, సోషలిస్ట్‌ యూనియన్‌ స్టేట్స్‌’గా ప్రకటించాలని ఆ సవరణ పేర్కొన్నది. ఆ దశలో రాజ్యాంగ పీఠికపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదు. మొదటి అధికరణను సవరించడం ద్వారా భావి భారత్‌ స్వరూపస్వభావాలకు ఒక స్పష్టత నివ్వాలని కేటీ షా భావించారు. ‘అధికరణ 1లోని ‘యూనియన్‌’ అనే పదం ఏక కేంద్రక ప్రభుత్వం (యూనిటరీ గవర్నమెంట్‌ ) అని భావించడానికి దారితీయకూడదు. ఎవరూ అలా పొరపడకుండా ఉండాలంటే మొదటి అధికరణలోని మొదటి నిబంధనలోనే ‘ఫెడరల్‌ యూనియన్‌’ అని స్పష్టం చేయాలని నేను భావిస్తున్నానని’ షా అన్నారు.


కేటీ షా ప్రతిపాదనకు డాక్టర్‌ అంబేడ్కర్‌ రెండు అభ్యంతరాలు తెలిపారు. ‘రాజ్యాంగం అనేది రాజ్య వ్యవస్థలోని వివిధ విభాగాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన ఒక వ్యవస్థ’ అని ఆయన అన్నారు. ‘ప్రభుత్వ విధానం ఏమిటి? సమాజాన్ని ఎలా వ్యవస్థీకరించాలి మొదలైన విషయాలను రాజ్యాంగం నిర్దేశించదు’ అని అంబేడ్కర్‌ అన్నారు. ‘సోషలిస్ట్‌’ అనే పదానికి సంబంధించినంతవరకు షా సవరణ అనవసరం’ అనేది అంబేడ్కర్‌ రెండో ఆక్షేపణ. అయితే ‘సెక్యులర్‌’, ‘ఫెడరల్‌’ అనే పదాల గురించి ఆయనేమీ చెప్పలేదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు తమ సారంలోను, లక్ష్యంలోను సామ్యవాద స్ఫూర్తిలేనివి అయితే సామ్యవాదం మరింకేమవుతుందనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను’ అని అంబేడ్కర్‌ అన్నారు. ‘ఫెడరల్‌’ అనే పదాన్ని చేర్చాలన్న కేటీ షా వివేకవంతమైన సూచనను రాజ్యాంగ సభ తిరస్కరించిందని మరి చెప్పనవసరం లేదు. దీనిపై మహబూబ్‌ అలీ బైగ్‌ అనే సభ్యుడు ప్రతిస్పందిస్తూ ‘ముసాయిదా రాజ్యంగ నిర్మాతల మనసులో ఏక కేంద్రక ప్రభుత్వ భావన ఉండి ఉంటుందని, అయితే దాన్ని వారు సమాఖ్య అని చెప్పుతున్నారని’ విస్మయం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం యూనిటరీ ప్రభుత్వంగా కాకుండా ఫెడరల్‌ ప్రభుత్వంగానే ఉండితీరాలి. భవిష్యత్తులో అధికార లాలసులు ఏక కేంద్రక ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ లేదా సంపూర్ణ నియంతృత్వ ప్రభుత్వంగా మార్చివేసేందుకు అవకాశమున్నదని పేర్కొంటూ కనుక మనం ఇప్పుడే ఫెడరేషన్‌ అనే సరైన మాటను చేర్చితీరాలని ప్రతిపాదించారు. బైగ్‌ ప్రతిపాదించిన ఈ సవరణ కూడా తిరస్కృతమయింది.


కేటీ షా చాలా పట్టుదల మనిషి. అధికరణ 1లోని మొదటి నిబంధనకు ఆయన మరో సవరణ ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలు సమమైనవే అన్నది ఆ సవరణ సారాంశం. ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తూ తన తొలి సవరణ ప్రతిపాదనపై డాక్టర్‌ అంబేడ్కర్‌ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. ‘రాజ్యాంగం అనేది ప్రభుత్వంలోని వివిధ విభాగాలను క్రమబద్ధం చేసే వ్యవస్థ మాత్రమే’ అన్న విషయాన్ని తాను వినడం ఇదే మొదటిసారి అని షా అన్నారు. ‘ఇండియన్‌ యూనియన్‌ నిజమైన సమాఖ్య రాజ్యంగా ఉండి తీరాలంటే అందులో అంతర్భాగంగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఎటువంటి మినహాయింపులు లేకుండా సమమైనవే అన్న విషయాన్ని రాజ్యాంగంలో చేర్చడం చాలా చాలా ముఖ్యమని కేటీ షా నొక్కి చెప్పారు. షా సవరణతో పాటు దాన్ని సమర్థిస్తూ హరివిష్ణు కామత్‌ ప్రతిపాదించిన సవరణను కూడా రాజ్యాంగ సభ తిరస్కరించింది. సుభాస్‌ చంద్రబోస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా 1938లో ఏర్పాటు చేసిన జాతీయ ప్రణాళికా సంఘంలో చేరాలని రాధాకమల్‌ ముఖర్జీ, మేఘనాథ్‌ సాహాతో పాటు కేటీ షాను కూడా ఆహ్వానించారు. తమ తమ రంగాలలో మేరునగ శిఖరాలు అయిన ఈ ముగ్గురు విద్యావేత్తలు పరిపూర్ణ సమాఖ్యవాదులు. స్వాతంత్ర్య సమరంలో సుభాస్‌ బోస్‌, పండింట్‌ నెహ్రూ ఇరువురితోను షా సన్నిహితంగా కలిసి పనిచేశారు. 1952లో ప్రథమ సార్వత్రక ఎన్నికలలో కేటీ షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి చెప్పుకోదగిన ప్రముఖుడు కానప్పటికీ షా పరాజితుడు అయ్యారు. డాక్టర్ అంబేడ్కర్‌ సైతం ఆ ఎన్నికలలో అనామక కాంగ్రెస్‌ అభ్యర్థి చేతుల్లో ఓడిపోయారు. 1952లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో కేటీ షా స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేంద్రప్రసాద్‌పై పోటీచేసి ఓడిపోయారు. జాతీయ ప్రణాళికా సంఘంలో షాకు సహచరుడు, బెంగాల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మేఘనాథ్‌ సాహా రాష్ట్రపతి పదవి ఎన్నికలలో పోటీ చేయమని కేటీ షాను ప్రోత్సహించారు. వలసపాలన వ్యతిరేక పోరాట ఆశయాలు, లక్ష్యాలకు విజేత కంటే ఎక్కువగా నిబద్ధుడు అయినప్పటికీ కేటీ షా ఓడిపోయారు.


రాజ్యాంగ పీఠికలోని మాటలు మనోరంజితమైనవీ, స్ఫూర్తిదాయకమైనవీ. ‘ఫెడరల్‌’ అనే మాటను అదనంగా చేర్చడం వల్ల ఆ భావనలు మరెంతో అర్థవంతమవుతాయి. సమాఖ్య విధానాన్ని చిత్తశుద్ధితో అమలుపరచాల్సిన అవసరమున్నది. త్వరలోనే దేశ వ్యాప్తంగా జనాభా గణన జరగనున్నది. ఆ తరువాత నియోజకవర్గాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారు. దీని వల్ల హిందీ రాష్ట్రాల ప్రాధాన్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ పలుకుబడిని కోల్పోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా సమాఖ్య పాలనా పద్ధతిని చిత్తశుద్ధితో అమలుపరిచేందుకు మరింత శ్రద్ధ చూపవలసిన అవసరమున్నది. శక్తిమంతమైన భారతదేశం సమాఖ్య తరహా రాజ్యం మాత్రమే అవుతుంది. కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాద ధోరణులు పెచ్చరిల్లిపోయాయి. తమిళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ స్వాభిమానాలు మళ్లీ ప్రకోపిస్తున్నాయి. భారత రాజకీయాల భావి తీరుతెన్నులకు అవి సూచకాలు కాదా? మహాద్రష్టలైన మన స్వాతంత్ర్యోద్యమ నాయకులు, వినూత్న, ఉదార భారత సమాఖ్య రాజ్యాన్నే ప్రగాఢంగా ఆకాంక్షించారు. వలసపాలన కాలం నాటి కేంద్రీకృత రాజ్యవ్యవస్థను కొనసాగించాలని వారు ఎంతమాత్రం భావించలేదు. ప్రాంతీయ తత్వాలు వారి స్వభావానికి విరుద్ధం. మన గణతంత్ర రాజ్య సంస్థాపన సందర్భంలోనే వారి మానవీయ దార్శనికతను కోల్పోయాం. ఫలితంగా సంభవించిన నష్టాన్ని నిజాయితీగా అర్థం చేసుకోవాలి. కేంద్రీకృత నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పురోగతికి అది ఒక ఆవశ్యక షరతు.

-సుగత బోస్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం

Updated Date - Aug 19 , 2025 | 06:13 AM