Share News

Revolution Must End: విప్లవం.. చాలించాలి

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:01 AM

ఇనుకొండ తిరుమలి రాసిన అరణ్యవాసంలోనే విప్లవ ప్రభాతం వ్యాసం ఆంధ్రజ్యోతిలో 25.7.25న ప్రచురితమైంది. నక్సలైట్లు తమ ఉద్యమాన్ని..

Revolution Must End: విప్లవం.. చాలించాలి

నుకొండ తిరుమలి రాసిన ‘అరణ్యవాసంలోనే విప్లవ ప్రభాతం’ వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’లో 25.7.25న ప్రచురితమైంది. నక్సలైట్లు తమ ఉద్యమాన్ని విరమించి రాజ్యానికి లొంగిపోవాలని తిరుమలి సలహా ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. గిరిజన ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ల చేతుల్లో పడనీయకుండా అడ్డుపడుతున్నామని మావోయిస్టులు పైకి చెబుతున్నారు గానీ వాళ్ల అసలు లక్ష్యం మార్క్స్‌ ప్రవచించిన వర్గపోరాటం, వర్గ శత్రు నిర్మూలన, సాయుధ విప్లవంతో ప్రభుత్వాధికారాన్ని చేపట్టడం. డ్రగ్‌ టెస్టింగ్‌లో విఫలమై, ‘రోగంకన్నా హానికరమైన మందు’గా లోకం ముందు రుజువైన వికృత సిద్ధాంతమే మార్క్సిజం. ‘మార్క్స్‌ సిద్ధాంతం ఆచరణలో పెట్టబడిన ప్రతిచోట పెద్దమ్మ (దరిద్ర దేవత) నాట్యమాడును దద్దమ్మా’ అని తురగా రామకవి చెప్పినట్లు.. ఇనుప గజ్జెలతల్లి తాండవించడంతో రష్యా, చైనా, తూర్పు యూరప్‌ సమాజాలు నెత్తీ నోరు కొట్టుకుని కమ్యూనిస్టు వ్యవస్థను వదిలించుకున్న చరిత్ర మనకు తెలిసిందే. మార్క్సిజం ఒక కుహనా రాజకీయ తార్కిక సిద్ధాంతం. భారతదేశంలో మళ్లీ ఆ విఫల ప్రయోగాన్ని చెయ్యడానికి, ఆ విషప్రాయమైన ఔషధాన్ని భారత ప్రజల గొంతుల్లో బలవంతంగా పొయ్యడానికి కంకణబద్ధులై పని చేస్తున్నారు మన మావోయిస్టు అడవి వీరులు, అర్బన్‌ నక్సలైటు మేధావులు. అసలు ఎవరో ఆయుధాలు సమకూర్చుకుని, విప్లవ సైన్యాన్ని చేర్చుకుని తాను చెప్పిన విప్లవాన్ని సాధించడానికి మన్ను, మిన్ను ఏకం చెయ్యాలని మార్క్స్‌ చెప్పలేదు. గతితార్కిక పరిణామాల ద్వారా చరిత్ర క్రమంలో ఎవ్వరూ ఆపలేని విధంగా శ్రామిక విప్లవం దానంతటదే వచ్చేస్తుందని తన మేనిఫెస్టోలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ప్రపంచంలో ఏ ఒక్కచోట కమ్యూనిస్టు విప్లవం రాలేదు, కార్మికవర్గ నియంతృత్వం ఏర్పడలేదు. మన నక్సలైట్లు, లేక మావోయిస్టులు ఇంత పోరాటం ఆ విప్లవం కోసం చేస్తున్నారంటేనే.. మార్క్స్‌ చెప్పినట్లు చరిత్ర నడవడం లేదని, ఆయన సిద్ధాంతం, భవిష్యవాణి వట్టి కల్లలని రుజువైపోయింది కదా?!


అయినా ఇప్పటికీ కొందరు ఆ మార్క్స్‌ వాదాన్ని అంటి పెట్టుకుని అడవుల్లోనూ, నగరాల్లోనూ కొనసాగుతున్నారంటే అందుకు కారణం వాళ్లకు అధ్యయనం, చరిత్ర విశ్లేషణ లేకపోవడం. వాళ్లు మరో ప్రపంచపు అనుభవాల నుంచి ముఖం తిప్పుకోవడం, మార్క్సిజం చేత కట్టించుకున్న పుస్తెను తెంపుకోలేకపోవడం. అంతేకాదు వామపక్ష తీవ్రవాద బృందాలు వేర్పాటువాదులతో, మతతత్వపు ఉగ్రవాదులతో చేతులు కలపడం దేశ ప్రజల దృష్టిలో స్పష్టంగానే పడుతోంది. ఇది వాళ్ల నైరాశ్యానికి, వాళ్ల సిద్ధాంతంపై వాళ్లకే విశ్వాసం జారిపోయి వేరే దేన్నో పట్టుకుని వేళ్లాడుతున్న పరిస్థితికి నిదర్శనం. ఈ నిజాయితీరాహిత్యం ఇంతటితో ఆగిపోవడం అన్ని విధాలా ఉత్తమం. అంతేకాదు. పత్రికల్లో వామపక్ష ప్రముఖుల ప్రస్తావనలు, చరిత్రలు ప్రచురించేటప్పుడు వాళ్లను విప్లవ వీరులంటూ కీర్తించే పద్ధతి మానెయ్యాలి. కవులు, రచయితలు ఆ విఫల విప్లవం పైన ఆకర్షణ, ఆరాధన కలిగించే పడికట్టు రచనలు చేయడానికి స్వస్తి పలకాలి. కమ్యూనిజం వచ్చిన కొత్తలో అది పేదలకు ఏదో మేలు చేస్తుందన్న విశ్వాసంతో, కొందరు సదుద్దేశంతోనే ఆ దారిలో నడిచారు. తమ మాట వినే వాళ్లను నడిపించారు. కానీ ఇప్పుడు ఆ విశ్వాసం పొరపాటు అని చరిత్ర చెబుతోంది. సమాజంలో అసమానతలు, అన్యాయాలు, పేదరికం ఉండవచ్చు. కానీ మార్క్స్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం మాత్రం అందుకు పరిష్కారం కాదు. ఆయన చూపిన దారి అధోగతికే రహదారి. పెట్టుబడిదార్లను ద్వేషించినంతగా మార్క్స్‌ ఇంకెవరినీ ద్వేషించలేదేమో. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెట్టుబడులను తీసుకువచ్చి, సంపదను సృష్టించి అభివృద్ధి సాధించాలి’ అనే విధానమే ప్రపంచాన్ని నడిపిస్తోంది. మరైతే ఇక ఏ విప్లవం వర్ధిల్లాలి? పెట్టుబడిదార్లు, కార్మికులు కూడా సమాజ ప్రగతికి అవసరమే. ఒకరి వల్ల మరొకరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం, సమాజ వ్యవస్థ జాగ్రత్త వహించాలి తప్ప, ఏదో ఒక వర్గాన్ని నిర్మూలించేయడం ఆర్థిక వివేకం కాదు.

-వివి. సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం

Updated Date - Aug 16 , 2025 | 05:01 AM