UN at 80: ప్రపంచ ఆశాజ్యోతి
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:00 AM
ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్ న్యూఢిల్లీలో శుక్రవారం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తూ సమితిమీద ప్రశంసలూ, విమర్శలూ సమపాళ్ళలో మేళవించి ఓ....
ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్ న్యూఢిల్లీలో శుక్రవారం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తూ సమితిమీద ప్రశంసలూ, విమర్శలూ సమపాళ్ళలో మేళవించి ఓ ప్రసంగం చేశారు. సమితికి భారత్ అండదండలు దండిగా ఉంటాయని అంటూనే, దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించడం లేదన్నారు. ప్రపంచం ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉంటే ఐరాస తదనుగుణంగా వ్యవహరించలేకపోతున్నదని ఆవేదన చెందారు. ఐరాసలో సంస్కరణలు జరగాలనీ, అవి అర్థవంతంగా, యావత్ ప్రపంచప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని జరగాలన్నారు. ప్రపంచం అనేకయుద్ధాలతో బాధపడుతున్న తరుణంలో శాంతి అన్నది మాటలకు మాత్రమే పరిమితమైపోయినప్పుడు అభద్రతల మధ్య అభివృద్ధి అసాధ్యమన్న ఆయన హెచ్చరిక సముచితమైనది. రెండో ప్రపంచయుద్ధం తరువాత, మానవాళి అప్పటివరకూ చవిచూసిన విధ్వంసాలు, వినాశనాలకు ఇక స్వస్తిచెప్పి, భవిష్యత్తులో అటువంటి సంఘర్షణలను నిరోధించే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ సంస్థ ఆవిర్భవించింది. దేశాలన్నీ పరస్పర సహకారంతో, సయోధ్యతో, సమన్వయంతో వ్యవహరించుకోవాలనీ, ఎంతటి తీవ్ర సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకొని అంతిమంగా ప్రపంచం అనునిత్యం శాంతియుతంగా నడవాలన్నది సంకల్పం. సహకారం, సంఘీభావం పునాదిగా సమస్తమానవాళీ మనుగడ సాగించాలన్నది ఆశయం. ఏ నేపథ్యంలో ఈ సంస్థ పురుడుపోసుకున్నదో తెలుసు కనుక, అది మరింత క్రియాశీలకంగా పనిచేయాలని ఆశించడం, ఆవిర్భావలక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించలేకపోతున్నదనీ, కొన్ని దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శలు చేయడం సహజమే. అగ్రదేశాల ఉగ్రరాజకీయాలను ఆపలేకపోయినా, వాటి దురాలోచలనూ దురాక్రమణలనూ అడ్డుకోలేకపోయినా, అనేక చిన్నాచితకా ఘర్షణలను సమితి నిలువరించలేకపోలేదు. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అంతర్యుద్ధాలను, సంఘర్షణలను పరిష్కరించడంలోనూ, ఉపశమింపచేయడంలోనూ దాని కృషి ప్రశంసనీయమైనది.
అయినాకూడా, సిరియానుంచి సూడాన్ వరకూ అది చేతులెత్తేసిన సందర్భాలు అనేకం. వియత్నాం ఘోరకలినుంచి, ఇరాక్ బూటకపు యుద్ధం వరకూ అసత్యాలనుంచి ఆవిర్భవించిన అనేకానేక సంఘర్షణలు సమితి వైఫల్యాల చిట్టాలో ఉన్నాయి. నియంతలను పెంచిపోషించే అగ్రరాజ్యాల స్వార్థం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘర్షణలో లక్షలాదిమంది హతులైనారు, నిరాశ్రయులైనారు. అరడజను అగ్రరాజ్యాల భద్రతకోసమే ఏర్పడినట్టుగా భద్రతామండలి వ్యవహారం సాగుతోంది. ఐదుదేశాల వీటోశక్తి ఏదీ తేలనివ్వకుండా, ఎటూ కదలనివ్వకుండా ప్రపంచాన్ని నిర్దేశిస్తోంది. వాటి అండచూసుకొనో, సమితి నిస్సహాయతను అడ్డంపెట్టుకొనో చాలా సభ్యదేశాలు అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తున్నాయి, సమితి నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అంతర్జాతీయ నేరన్యాయస్థానం ఏళ్ళతరబడి మధించి వెలువరించిన తీర్పులు కొరగాకుండా పోతున్నాయి. తన ఆదేశాలు బేఖాతరుచేసినా ఆయా దేశాల పాలకులను ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో అది ఉంది. అయితే, ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థలు తమకు నిర్దేశించిన బాధ్యతలను ఎంతోకొంతమేర నిర్వర్తించగలగడం మెచ్చుకోదగింది. కరోనాకాలంలో అన్ని దేశాల మధ్యా సహకారాన్ని సాధించి, వ్యాప్తి నిరోధంలోనూ, పేద, ధనిక తేడాలేకుండా వాక్సిన్ సకాలంలో అందరికీ అందించడంలోనూ ఆరోగ్యసంస్థ విఫలమైంది. అయితే, పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నియంత్రణలో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బాలబాలికలకు అతిముఖ్యమైన టీకాలు అందడంలోనూ అది ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తోంది. నిర్వాసితులను ఆదుకుంటూ, అన్నార్తుల ఆకలిని తీరుస్తోంది. ‘డిగ్ బేబీ డిగ్’ తరహా ఎజెండాలతో, కార్పొరేట్లకు వంతపాడే ట్రంప్ తరహా పాలకులు పుట్టుకొస్తున్నందున ‘కాప్’ సదస్సులు ఎన్ని జరిపినా, పర్యావరణానికి మాత్రం అది కాపలాదారు కాలేకపోతోంది. గత నెలలో జరిగిన 80వ సర్వసభ్యసమావేశానికి నూటయాభైకి పైగా దేశాల అధినేతలు హాజరైనారు. పాలస్తీనా గుర్తింపు నుంచి, ప్రస్తుతం భీకరంగా సాగుతున్న రెండు యుద్ధాల వరకూ చాలా అంశాలు చర్చకు వచ్చి, ఏకాభిప్రాయం సాధ్యపడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎప్పటిలాగానే వారంతా ఎదుటివారి కారణంగానే ప్రపంచం పాడైపోతుందని దూషణలు చేశారు, విమర్శలు, ప్రతివిమర్శలతో సదస్సు ముగించారు. ప్రపంచం మరింత సంక్షోభంలోకి జారుతున్న తరుణంలో అగ్రదేశాల సహాయనిరాకరణ నుంచి నిధుల కొరతవరకూ సమితి పలు సమస్యలు ఎదుర్కొంటోంది. సంస్కరణలు జరగాలన్న జైశంకర్ వ్యాఖ్యల్లో భద్రతామండలిలో మనస్థానం మాట గుర్తుచేయడం కనిపిస్తోంది. ఐదుదేశాలదే ఇష్టారాజ్యం కాకూడదనీ, బలంగా ఎదుగుతున్న భారత్, బ్రెజిల్ వంటివి కూడా శాశ్వత సభ్యత్వాన్ని పొందగలిగినప్పుడు అది ఆవిర్భావ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించగలదని ఓ ఆశ, నమ్మకం.