Holi Festival: హోలీకి ముందు కామ దహనం ఎందుకు చేస్తారు.. దీని వెనుక అంత కథ ఉందా..!
ABN , Publish Date - Mar 14 , 2025 | 08:28 AM
హోలీ పండుగ వచ్చిందటే చాలు ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం. వయసుతో సంబంధం లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. హోలీలో రంగులు చల్లుకోవడం ఒక భాగమైతే.. కామ దహనం కూడా నిర్వహిస్తారు. అసలు కామ దహనం అంటే ఏమిటి.. ఈ పండుగ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.

హోలీ పండుగ వచ్చిందంటే ఆ ఆనందమే వేరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఒక దగ్గరకు చేరి రంగులు రాసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది పెద్దలకు ఈ పండుగ విశిష్టత గురించి తెలిసుండొచ్చు. కానీ ప్రస్తుతం యువత హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు. దీని వెనుకున్న కథ ఏమిటనేది తక్కువ మందికే తెలిసుంటుంది. హోలీ పండుగ వస్తుందంటే ముందు రోజు రాత్రి నుంచి వీధుల్లో భోగి మంటలను తలపించేలా కర్రల పోగులు కనిపిస్తుంటాయి. శివాలయాలు ఉండే చోట తప్పనిసరిగా ఇలాంటి కర్ర పోగులు కనిపిస్తాయి. అసలు ఎందుకు ఈ కర్ర పోగులు వేస్తారు. కర్ర పోగులు వేసిన తర్వాత ఏమి చేస్తారు. హోలీకి ఈ కర్ర పోగులకు ఉన్న సంబంధం ఏమిటి. హోలీ సందర్భంగా నిర్వహించే పూజల్లో ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి ఏమైనా తేడా ఉందా.. అన్ని పండుగలతో పోలిస్తే హోలీ ఎందుకు డిఫరెంట్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కామ దహనం పేరుతో..
ధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకగా కామ దహనం నిర్వహిస్తారు. కామ దహనం కోసం భోగి మంటలను తలపించేలా కర్ర పోగులు, పిడకలు వేసి కాముడు (ప్రేమ దేవుడు)ని దహనం చేస్తారు. హోలీకి ముందురోజు అర్థరాత్రి ఇలా కామ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇలాంటి సంప్రదాయం కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హోలీకా దహన్ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురణాల ప్రకారం ధ్యానం నుండి కలత చెందిన శివుడు, కామ దేవుడిని తన మూడవ కన్నుతో భస్మం చేశారంట. తద్వారా కామ అణచివేతకు, ధర్మ విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓ వ్యక్తి స్వీయ నియంత్రణ సాధించేందుకు, ఆధ్యాత్మికతపై దృష్టి సారించేందుకు దోహదపడుతుంది. ఎక్కువ కామంతో దురాగతాలకు పాల్పడితే కాల్చేస్తారనే సందేశం ఇవ్వడం ద్వారా చెడు పనులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం కామ దహనం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తారు.
రంగులు చల్లుకుంటూ..
హోలికి ముందురోజు రాత్రి కామ దహనం కార్యక్రమం తర్వాత రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. హోలీని ఫాల్గుణ పూర్ణిమ, కాముని పున్నమి, కామదహనం, ఫాల్గుణోత్సవం అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగను మరింత గణంగా, వేడుకగా జరుపుకుంటారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here