Bengaluru Woman Arrested: ఈ లేడీ లెక్చరర్.. వీకెండ్ దొంగ!
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:39 AM
వారమంతా కాలేజీలో పాఠా లు చెప్పడం ఆమె వృత్తి. వారంతం లో చోరీలు చేయడం ఆమె ప్రవృత్తి. పెళ్లివేడుకలే టార్గెట్.
బెంగళూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వారమంతా కాలేజీలో పాఠా లు చెప్పడం ఆమె వృత్తి. వారంతం లో చోరీలు చేయడం ఆమె ప్రవృత్తి. పెళ్లివేడుకలే టార్గెట్. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అధ్యాపకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు రేవతి. శివమొగ్గ జిల్లాకు చెందిన ఆమె బెంగళూరు కేఆర్ పురం ప్రాంతంలో నివసిస్తున్నారు. బెళ్ళందూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలు. వారమంతా పాఠాలు చెప్పే ఈమె.. వీకెండ్‌లో దొంగ అవతారం ఎత్తుతారు. ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయో తెలుసుకుని, అతిథిలా వెళ్లి ఆభరణాలను కాజేస్తుంటారు. కల్యాణ మండపంలో అందరినీ పలకరిస్తూ హడావుడి చేస్తుంటారు. ఆభరణాలు చోరీ చేసి, మాయమౌతారు. ఇదే తరహాలో నవంబరు 25న బసవనగుడిలోని ద్వారకనాథ కల్యాణ మండపంలో జరిగిన పెళ్లికి ఆహ్వానం లేకున్నా ఆమె వెళ్లారు. అక్కడ బంగారు ఆభరణాలను కాజేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ టీవీ ఫుటేజీ, పెళ్లిలో తీసిన వీడియోల ఆధారంగా అనుమానితులను గుర్తించారు. వారి వివరాలను ఆరా తీయగా, రేవతి దొరికిపోయారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ‘వారాంతపు దొంగతనాల’ గురించి తెలుసుకుని నివ్వెరపోయారు. ఆమె నుంచి రూ.32 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.