Share News

Chicken Dispute: పెళ్లి పార్టీలో దారుణం.. చికెన్ ముక్క కోసం స్నేహతుడి హత్య..

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:00 AM

Chicken Dispute: పార్టీ సందర్భంగా చికెన్ ముక్క విషయంలో వినోద్, విఠల్ హరగొప్పల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికి అది చినికి చినికి గాలి వానలా తయారైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Chicken Dispute: పెళ్లి పార్టీలో దారుణం.. చికెన్ ముక్క కోసం స్నేహతుడి హత్య..
Chicken Dispute

పెళ్లి పార్టీలో దారుణం చోటుచేసుకుంది. చికెన్ ముక్క కోసం ఓ యువకుడు స్నేహితుడ్ని చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. యారగట్టి తాలూకాలోని సోపడ్ల గ్రామానికి చెందిన 30 ఏళ్ల వినోద్ మాలశెట్టి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కుటుంబం మొత్తం అతడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. రెండు నెలల క్రితం వినోద్ స్నేహితుడు అభిషేక్ పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలోనే అభిషేక్ తన స్నేహితులందరినీ పిలిచి పెళ్లి పార్టీ ఇచ్చాడు.


ఆదివారం సోపడ్ల గ్రామ శివారులో పార్టీ జరిగింది. 30 మందికి పైగా పార్టీలో పాల్గొన్నారు. పార్టీ సందర్భంగా చికెన్ ముక్క విషయంలో వినోద్, విఠల్ హరగొప్పల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికి అది చినికి చినికి గాలి వానలా తయారైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవ సందర్భంగా విఠల్ చికెన్ కొట్టే కత్తితో వినోద్‌పై దాడి చేశాడు. ఛాతిపై నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


నిందితుడు విఠల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేవలం చికెన్ ముక్క కోసమే విఠల్ ఈ హత్య చేశాడా? లేక హత్యకు వేరే ఏదైనా కారణంగా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో అంతమంది ఉన్నా ఎందుకు వాళ్లు గొడవను ఆపలేదు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ముక్క సంగతి పక్కన పెడితే.. ఇద్దరూ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి తరచుగా గొడవపడేవారని పోలీసుల విచారణలో తేలింది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హారన్ విషయంలో గొడవ.. ఇంట్లోకి చొరబడి మరీ దారుణం..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

Updated Date - Jul 15 , 2025 | 11:45 AM