Share News

Raksha Bandhan Tragedy: సోదరి వరసయ్యే బాలికపై అత్యాచారం.. రాఖీ కట్టిన కొన్ని గంటలకే దారుణం

ABN , Publish Date - Aug 13 , 2025 | 08:29 AM

యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు రాఖీ కట్టిన బాలికపైనే ఓ రాక్షసుడు దారుణానికి ఒడిగట్టాడు. అఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణం చంపేశాడు. బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించి చివరకు దొరికిపోయాడు.

Raksha Bandhan Tragedy: సోదరి వరసయ్యే బాలికపై అత్యాచారం.. రాఖీ కట్టిన కొన్ని గంటలకే దారుణం
UP Auraiya Shocking Incident

ఇంటర్నెట్ డెస్క్: అన్నగా తనకు అండగా ఉంటాడన్న భావనతో ఆ బాలిక తన బంధువు చేతికి రాఖీ కట్టింది. కానీ అతడు మాత్రం రాఖీ కట్టించుకున్న గంటల వ్యవధిలోనే దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని తాడుకు వేలాడ దీసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అరేయియా జిల్లాలో తాజాగా ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం , 33 ఏళ్ల సుర్జీత్ రాఖీ సందర్భంగా తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి చెల్లెలి వరుసయ్యే బాలిక రాఖీ కూడా కట్టింది. ఆ తరువాత తిరిగొచ్చేశాడు. ఆ రాత్రి ఫుల్లుగా తాగిన అతడు మళ్ళీ బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను చంపి తాడుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ ఘోరం జరుగుతున్న సమయంలో బాలిక తండ్రి పక్క గదిలోనే నిద్రపోతున్నాడు. కానీ తనకు ఏమీ వినపడలేదని పోలీసులకు చెప్పాడు.


మరుసటి రోజు ఉదయం సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అది ఆత్మహత్య కాదని వెంటనే అర్థమైపోయింది. ఘటనా స్థలంలో రక్తం మరకలు కనిపించడంతో వారు ఇంట్లోని వారందరినీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుర్జీత్ తీరు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. విచారణ సందర్భంగా సుర్జీత్ పోలీసుల వద్దే కూర్చున్నాడు. ఇంట్లో ఎవరిని ప్రశ్నించినా తను జోక్యం చేసుకుని సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో సుర్జీత్ ను కూడా కస్టడీలో తీసుకుని ప్రశ్నించగా దారుణానికి ఒడిగట్టిన విషయాన్ని అంగీకరించాడు.

బాలికపై అఘాయిత్యం జరిగినట్టు పోర్టు మార్టం నివేదికలో తేలిందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. రాఖీ కట్టిన బాలికపైనే నిందితుడు ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టాడో అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - Aug 13 , 2025 | 09:04 AM