Central Banks: పసిడిపై కేంద్ర బ్యాంకులకు తగ్గని మోజు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:48 AM
ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులకు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల్లో పెట్టుబడులు తగ్గించి, తమ ఫారెక్స్ నిల్వల్లో పెద్దఎత్తున పసిడి...
ఏటా 1,000 టన్నుల వరకు కొనుగోలు
36,000 టన్నులకు చేరిన నిల్వలు
విలువ రూ.397 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులకు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల్లో పెట్టుబడులు తగ్గించి, తమ ఫారెక్స్ నిల్వల్లో పెద్దఎత్తున పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. ఈ కొనుగోళ్లు ఎంత లేదన్నా ఏటా 1,000 టన్నుల వరకు ఉన్నట్టు అంచనా. 2022-25 మధ్య కాలంలో ప్రపంచంలో అమ్ముడైన మొత్తం పసిడిలో 23 శాతాన్ని కేంద్ర బ్యాంకులే కొనుగోలు చేశాయి. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), చైనా పీపుల్స్ బ్యాంక్‌తో సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ప్రస్తుతం 4.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.397.35 లక్షల కోట్లు) విలువైన 36,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల్లో పెట్టుబడులతో పోలిస్తే ఇది దాదాపు లక్ష కోట్ల డాలర్లు ఎక్కువ. పసిడి కొనుగోలుకు ప్రధాన కారణాలు..
క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి
పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు
పసిడిపై అధిక రాబడులు
సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న ప్రత్యేకత
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు
అమెరికాలో కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం
మారుతున్న కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు