Share News

భారత్‌లో ఏఐ నిపుణులకు భారీ కొరత

ABN , Publish Date - Mar 11 , 2025 | 02:03 AM

ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) నిపుణుల హబ్‌గా ఎదిగేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ తాజా నివేదిక పేర్కొంది. కానీ, దేశంలో ఏఐ నిపుణుల కొరత...

భారత్‌లో ఏఐ నిపుణులకు భారీ కొరత

2027 నాటికి 10 లక్షలకు పెరగవచ్చు.. బెయిన్‌ అండ్‌ కంపెనీ అంచనా

న్యూఢిల్లీ: ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) నిపుణుల హబ్‌గా ఎదిగేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ తాజా నివేదిక పేర్కొంది. కానీ, దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని, ఈ రంగంలో భారత పురోగతికి ఇది అవరోధంగా మారవచ్చని అభిప్రాయపడింది. 2027 నాటికి భారత ఏఐ రంగం 10 లక్షలకు పైగా నిపుణుల కొరతను ఎదుర్కొనవచ్చని అంచనా వేసింది. ఏఐ నిపుణులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ తన కార్మిక శక్తికి ఈ నైపుణ్యంలో శిక్షణ అందించాల్సిన తక్షణావసరాన్ని బెయిన్‌ అండ్‌ కంపెనీ నివేదిక నొక్కి చెప్పింది. మరో రెండేళ్లలో ఏఐ ఉద్యోగావకాశాలు నిపుణుల లభ్యతతో పోలిస్తే 1.5-2 రెట్ల స్థాయిలో ఉండవచ్చని అంటోంది. ఇది సవాలుతో పాటు అవకాశం కూడా.


ప్రస్తుత సాంకేతిక నిపుణులకు ఏఐలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చని బెయిన్‌ అండ్‌ కంపెనీ భారత పార్ట్‌నర్‌ సైకత్‌ బెనర్జీ అన్నారు. 2027 నాటికి భారత ఏఐ రంగంలో ఉద్యోగావకాశాలు 23 లక్షలు దాటవచ్చని.. అప్పటికి ఏఐ నిపుణుల లభ్యత మాత్రం 12 లక్షలకు పెరగవచ్చని, ఈ నేపథ్యంలో మరో 10 లక్షల మందికి ఈ ఆధునిక సాంకేతికతలో శిక్షణ ఇప్పించవచ్చని నివేదిక పేర్కొంది. 2019 నుంచే ఏఐ ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి. ఏటా 21 శాతం పెరుగుతూ వచ్చాయని, ఈ రంగంలో నిపుణులకు పారితోషికం ఏటా 11 శాతం పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ, ఈ రంగంలో నిపుణుల లభ్యత మాత్రం అంతగా పెరగలేదు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 02:03 AM