Share News

Gold Price: 4,300 డాలర్లు దాటిన ఔన్స్‌ గోల్డ్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:56 AM

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది. ఔన్స్‌ 31.10 గ్రాములు గోల్డ్‌ రేటు ఒకదశలో 100 డాలర్లకు పైగా పెరిగి తొలిసారిగా..

Gold Price: 4,300 డాలర్లు దాటిన ఔన్స్‌ గోల్డ్‌

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒకదశలో 100 డాలర్లకు పైగా పెరిగి తొలిసారిగా 4,300 డాలర్లు దాటింది. అమెరికా-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం, యూఎస్‌ షట్‌డౌన్‌ వంటి ప్రతికూలతలతో పాటు అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్‌ డిమాండ్‌ను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఔన్స్‌ గోల్డ్‌ 61 శాతానికి పైగా పెరిగింది. భారత్‌లో బంగారం ధరలు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ రేటు, డాలర్‌-రూపాయి మారకం విలువకు అనుగుణంగా మారుతుంటాయి. దీంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి మరో రూ.2,800కు పైగా పెరిగి రూ.1.35 లక్షలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎస్‌జీబీలు అదుర్స్‌: 2017-18 ఆర్థిక సంవత్సరంలో సీరిస్‌-3 కింద జారీ చేసిన సావరిన్‌ గోల్డ్‌ బాం డ్స్‌ (ఎస్‌జీబీ) కూడా మదుపరులు బంపర్‌ లాభాలు పంచాయి. 2017 అక్టోబరు 16న జారీ చేసిన ఈ ఎస్‌జీబీల ఫైనల్‌ రిడంప్షన్‌ గడువు గురువారంతో ముగిసింది. ఒక్కో గ్రాము రూ.2,860 చొప్పున ఈ బాండ్స్‌ కొనుగోలు చేసిన వారికి తుది రిడంప్షన్‌ నాటికి ఒక్కో గ్రాము ఎస్‌జీబీపై రూ.12,567 అందుకున్నారు. అంటే ఎనిమిదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి మదుపరులు 388 శాతం లాభం కళ్లజూశారు.

Updated Date - Oct 17 , 2025 | 03:56 AM