ఎస్‌ఎంఈ ఐపీఓ నిబంధనలు కఠినతరం
ABN , Publish Date - Mar 11 , 2025 | 02:06 AM
చిన్న, మధ్య తరహా సంస్థ (ఎ్‌సఎంఈ)ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ సోమవారం నోటిఫికేషన్ విడుదల...

మూడేళ్లలో రెండు సార్లు కనీసం రూ.కోటి వార్షిక లాభం ఆర్జించాలి..
ఆఫర్ ఫర్ సేల్‌పై 20ు పరిమితి
నోటిఫికేషన్ విడుదల చేసిన సెబీ
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థ (ఎ్‌సఎంఈ)ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఎంఈ ఐపీఓలకు కొత్తగా లాభాల నిబంధనను ప్రవేశపెట్టడంతో పాటు పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయించగలిగే వాటా షేర్లను ఇష్యూ సైజులో 20 శాతానికి పరిమితం చేసింది. అంతేకాదు, కంపెనీలోని వారి వాటాలో 50 శాతానికి మించి విక్రయించడానికి వీల్లేదు. గడిచిన కొంత కాలంలో ఎస్‌ఎంఈలు ఐపీఓలకు రావడం, ఆ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎగబడటం చూశాం. ఈ నేపథ్యంలో ఐపీఓ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడంతోపాటు మెరుగైన ఆర్థిక పనితీరు కలిగిన ఎస్‌ఎంఈలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించేందుకు అనుమతించడమే సెబీ తాజా సంస్కరణల ప్రధానోద్దేశం. లాభదాయకత విషయానికొస్తే, ఐపీఓకు రావాలనుకుంటున్న ఎస్‌ఎంఈలు అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండు సార్లు కనిష్ఠంగా రూ.కోటి నిర్వహణ లాభాన్ని ఆర్జించి ఉండాలి. సెబీ నోటిఫికేషన్‌లోని మరిన్ని నిబంధనలు..
కనీస ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ (ఎంపీసీ)పై ప్రమోటర్ల వాటా దశల వారీ లాకిన్ గడువుకు లోబడి ఉంటుంది. అదనపు వాటాలో సగం లాకిన్ గడువు ఏడాది తర్వాత ముగుస్తుంది. మిగతా 50 శాతం లాకిన్ గడువు రెండేళ్ల తర్వాత ముగుస్తుంది.
ఇకపై ఎస్‌ఎంఈ ఐపీఓల్లోనూ సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయుంపు కోసం ప్రధాన ఐపీఓల్లో పాటించే విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది.
భారీ రిటర్నుల ఆశలతో ఈ విభాగ పబ్లిక్ ఆఫరింగ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు చిన్న మదుపరులు సైతం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంఈ ఐపీఓకు పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్ ఇకపై 2 లాట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్‌ఎంఈలు ఐపీఓ ద్వారా సేకరించే నిధుల్లో సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కేటాయించగలిగే వాటాను ఇష్యూ సైజులో 15 శాతం లేదా రూ.10 కోట్లకు (ఏది తక్కువైతే అది) పరిమితం చేసింది.
ఎస్‌ఎంఈలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్స్ లేదా సంబంధిత వ ర్గాల నుంచి సేకరించిన రుణాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరిగి చెల్లించేందుకు అనుమతి లేదు.
ఎస్‌ఎంఈల ఐపీఓ పత్రాలు (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-డీఆర్‌హెచ్‌పీ) ప్రజాభిప్రాయాల కోసం 21 రోజుల పాటు అందుబాటులో ఉండాలి. ఐపీఓకు వచ్చే ఎస్‌ఎంఈలు వార్తా పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంతో పాటు డీఆర్‌హెచ్‌పీని యాక్సెస్ చేసేందుకు ఆ ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను సైతం చేర్చాలి.
ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో లిస్టయిన కంపెనీలు మెయిన్ ప్లాట్‌ఫామ్‌కు అప్‌గ్రేడ్ కాకుండానే మరిన్ని ఇష్యూల ద్వారా నిధులు సమీకరించవచ్చు. అయితే, మెయిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన కంపెనీలకు వర్తించే ఎల్‌ఓడీఆర్ నిబంధనలకు లోబడి ఉండాలి.
ఇకపై ఎస్‌ఎంఈ లిస్టెడ్ కంపెనీలూ మెయిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన ప్రధాన కంపెనీలకు వర్తించే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ (ఆర్‌పీటీ) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్ (ఐసీడీఆర్) నిబంధనలను సెబీ నోటిఫై చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..