Share News

Vietnam Production: వియత్నాం నుంచి భారత్‌కు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:42 AM

సామ్‌సంగ్‌ వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంటోంది. వియత్నాంలోని స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తి కొంత భాగాన్ని భారత్‌కు తరలించాలని యోచిస్తోంది, ముఖ్యంగా ట్రంప్‌ సర్కారు విధించిన సుంకాల వల్ల. భారత్‌లో ఉత్పత్తి పెంచడం ద్వారా అమెరికా మార్కెట్‌లో వాటా పెంచుకునే యోచనలో ఉంది

Vietnam Production: వియత్నాం నుంచి భారత్‌కు

  • స్మార్ట్‌ఫోన్ల తయారీని తరలించేందుకు సామ్‌సంగ్‌ సన్నాహాలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల పోటుతో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంటోంది. వియత్నాంలో ఉన్న తన స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిలో కొంత భాగాన్ని మన దేశానికి తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌ సర్కారు వియత్నాం దిగుమతులపై 46 శాతం, భారత దిగుమతులపై 26 శాతం సుంకాలు విధించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ సుంకాల పోటు నుంచి 90 రోజుల విరామం దొరికినా.. దీర్ఘకాలంలో తన స్మార్ట్‌ఫోన్లను వియత్నాం కంటే భారత్‌ నుంచి ఎగుమతి చేయడమే మేలని సామ్‌సంగ్‌ భావిస్తోంది.

మన వాటా స్వల్పమే: సామ్‌సంగ్‌ గత ఏడాది భారత్‌ నుంచి 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,850 కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో వియత్నాం నుంచి 3,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.98 లక్షల కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసింది. ఇందులో 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.85,290 కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు ఒక్క అమెరికాకే ఎగుమతయ్యాయి. భారత్‌లో ఉత్పత్తి పెంచడం ద్వారా అమెరికా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో తన పట్టు నిలుపుకోవాలని సామ్‌సంగ్‌ యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకమూ ఈ విషయంలో కంపెనీని ఆకర్షిస్తోంది.

Updated Date - Apr 25 , 2025 | 04:43 AM