Share News

Silver Price Hits New Peak: వెండి రూ.2 లక్షలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:48 AM

వెండి ధరలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కిలో వెండి తొలిసారిగా రూ.2 లక్షల మైలురాయిని దాటేసింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ....

Silver Price Hits New Peak: వెండి  రూ.2 లక్షలు

  • సరికొత్త రికార్డు గరిష్ఠానికి ధర

  • అంతర్జాతీయ మార్కెట్లో 65 డాలర్ల చేరువలో ఔన్స్‌ సిల్వర్‌

న్యూఢిల్లీ: వెండి ధరలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కిలో వెండి తొలిసారిగా రూ.2 లక్షల మైలురాయిని దాటేసింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ 2026 మార్చి కాంట్రాక్టు ధర శుక్రవారం మరో రూ.1,420 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠ స్థాయి రూ.2,00,362కు చేరుకుంది. ఎక్స్ఛేంజీలో వెండి రేట్లు పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. సోమవారం రూ.1,81,742గా నమోదైన వెండి రేటు.. 4 రోజుల్లో ఏకంగా రూ.18,620 లేదా 10.24 శాతం పెరిగింది. కాగా, 10 గ్రాముల గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 2026 ఫిబ్రవరి కాంట్రాక్టు ధర కూడా రూ.2,497 పెరుగుదలతో కొత్త ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి రూ.1,34,966కు ఎగబాకింది. ఫెడ్‌ రేట్లు మరింత తగ్గిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్‌ పెరుగుతూ పోతుండటంతో పాటు రూపాయి భారీ క్షీణత ఇందుకు ప్రధాన కారణమని బులియన్‌ విశ్లేషకులు తెలిపారు.

వెండి విషయంలో సరఫరా కొరతతో పాటు పారిశ్రామిక వినియోగం భారీగా పుంజుకోవడం కూడా ధరలను ఎగదోస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు ధర 57.6 డాలర్ల (1.34 శాతం) వృద్ధితో 7 వారాల గరిష్ఠ స్థాయి 4,377 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు గరిష్ఠం 64.8 డాలర్లకు చేరుకుంది.


ఈ ఏడాదిలో 122 శాతం అప్‌

ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కిలో వెండి రూ.5,100 పెరుగుదలతో రూ.1,99,500కు చేరగా.. 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర కూడా రూ.1,110 పెరిగి రూ.1,33,600కు ఎగబాకింది. 2024 డిసెంబరు 31న రూ.89,700 పలికిన కిలో వెండి ధర.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1,09,800 (122 శాతం) పెరిగింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ విషయానికొస్తే, గత ఏడాది చివరి రోజున 28.97 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ సిల్వర్‌.. 2025లో ఇప్పటివరకు 35.83 డాలర్లు (123 శాతం) పుంజుకుంది.

వచ్చే ఏడాదిలో రూ.2.40 లక్షలకు..

సిల్వర్‌ ర్యాలీ ఇప్పట్లో ఆగదని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంటోంది. దేశీయంగా ధర మరో 20 శాతం మేర పెరిగి వచ్చే ఏడాదిలో రూ.2.40 లక్షల స్థాయికి ఎగబాకే అవకాశాలున్నాయని తాజా నివేదికలో అంచనా వేసింది. వెండి ధర రూ.1.70-1.78 లక్షల స్థాయికి దిద్దుబాటు అయిన సమయంలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించింది.

ప్రపంచంలో ఐదో అతిపెద్ద అసెట్‌

మార్కెట్‌ విలువపరంగా సిల్వర్‌.. మైక్రోసా్‌ఫ్టను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద అసెట్‌గా అవతరించింది. సిల్వర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3.60 లక్షల కోట్ల డాలర్లు మించిపోగా.. మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ 3.59 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. కాగా, బంగారం 30 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో అత్యంత విలువైన అసెట్‌గా ఉంది. ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా 4.39 లక్షల కోట్ల డాలర్లు, యాపిల్‌ 4.11 లక్షల కోట్ల డాలర్లు, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 3.8 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌లో వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - Dec 13 , 2025 | 06:45 AM