Silver Jewelry Hallmarking: వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:33 AM
వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది..
ఈ నెల 1 నుంచే అమల్లోకి.. ప్రస్తుతానికి ఐచ్ఛికమే..
వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ నెల 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని, ప్రస్తుతానికిది స్వచ్ఛందమని స్పష్టం చేసింది. వెండి నగలు లేదా వస్తువుల్లో లోహ స్వచ్ఛత నిర్ధారణకు ఈ డిజిటల్ గుర్తింపు విధానం దోహదపడనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తన హాల్‌మార్కింగ్ ప్రమాణాలను సవరించింది. గత వెర్షన్ ఐఎస్ 2112:2014ను ఐఎస్ 2112:2025తో భర్తీ చేసింది. ఈ సవరణ ద్వారా ప్రస్తుత బంగారం హాల్‌మార్కింగ్ వ్యవస్థకు అనుసంధానిస్తూ వెండి ఆభరణాలు, వస్తువులకు సైతం హాల్‌మార్కింగ్ వినూత్న గుర్తింపు (హెచ్‌యూఐడీ) ఆధారిత హాల్‌మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా 2025 సెప్టెంబరు 1 నుంచి వినియోగదారులు హాల్‌మార్కింగ్ చేసిన వెండి ఆభరణం లేదా వస్తువు టైపు, లోహం స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ తేదీ, టెస్టింగ్ సెంటర్ వివరాలతో పాటు దాన్ని హాల్‌మార్కింగ్ చేయించిన జువెలర్ రిజిస్ట్రేషన్ నంబరును తెలుసుకోగలుగుతారు. బీఐఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు. మరిన్ని వివరాలు..
సవరించిన ప్రమాణాల ద్వారా బీఐఎస్ ఏడు లోహ స్వచ్ఛత గ్రేడ్‌లను (800, 835, 925, 958, 970, 990, 999) ప్రవేశపెట్టింది. అందులో 958, 999 గ్రేడ్‌లు కొత్తగా ప్రవేశపెట్టినవి.
వెండి హాల్‌మార్కింగ్‌లో మొత్తం మూడు భాగాలుంటాయి. ఒకటి సిల్వర్ అనే పదంతో కూడిన బీఐఎస్ స్టాండర్డ్ మార్క్. రెండోది లోహ స్వచ్ఛత గ్రేడ్, మూడోది హెచ్‌యూఐడీ కోడ్.
వెండి ఆభరణాల టెస్టింగ్ కోసం దేశంలోని 87 జిల్లాల్లో బీఐఎస్ గుర్తింపు పొందిన 230 పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 32 లక్షలకు పైగా వెండి ఆభరణాల కు హాల్‌మార్కింగ్ చేసారు.
ఎనిమిది రోజుల గోల్డ్ ర్యాలీకి తెరపడింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,000 తగ్గి రూ.1,06,070కి దిగివచ్చింది. బులియన్ ట్రేడర్లు లాభాల స్వీకరించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ ఇందుకు కారణం. కిలో వెండి సైతం రూ.500 తగ్గి రూ.1,25,600కి పరిమితమైంది.