Share News

Shiv Nadar: దాతృత్వంలో నాడార్‌ మేటి

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:40 AM

దానం చేసేందుకు డబ్బుతో పాటు గొప్ప మనసు కూడా ఉండాలి. ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ దేశంలో అత్యంత..

Shiv Nadar: దాతృత్వంలో నాడార్‌ మేటి

  • గత ఏడాది రూ.2,708 కోట్ల విరాళాలు ఇచ్చిన హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు

  • రోజుకు సగటున రూ.7.4 కోట్లు దానం

న్యూఢిల్లీ: దానం చేసేందుకు డబ్బుతో పాటు గొప్ప మనసు కూడా ఉండాలి. ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ దేశంలో అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా దాతలు 2025’ జాబితా ప్రకారం.. గత ఏడాది నాడార్‌ కుటుంబం శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.2,708 కోట్ల విరాళాలిచ్చింది. అంటే, రోజుకు సగటున రూ.7.4 కోట్లు దానం చేసిందీ కుటుంబం. ఎడెల్‌గివ్‌-హురున్‌ ఏటా విడుదల చేస్తున్న ఈ జాబితాలో నాడార్‌ అగ్రస్థానంలో నిలవడం ఐదేళ్లలో ఇది నాలుగోసారి. గడిచిన ఐదేళ్లలో నాడార్‌ ఫ్యామిలీ మొత్తం రూ.10,122 కోట్లు ప్రధానంగా విద్యా రంగానికి విరాళాలిచ్చింది.

  • భారత్‌లో అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబం దాతృత్వం విషయంలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ కుటుంబం రూ.626 కోట్లు దానం చేసింది.

  • దేశంలో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్‌ అదానీ, కుటుంబం రూ.386 కోట్ల విరాళాలతో ఐదో స్థానంలో ఉంది.

  • ఈసారి జాబితాలో మొత్తం 191 మందికి స్థానం లభించింది. అందులో 12 మంది కొత్తవారు. వారి మొత్తం విరాళాలు రూ.10,380 కోట్లు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఈ విలువ 85 శాతం పెరిగింది. మొత్తం విరాళాల్లో దాదాపు 40 శాతం విద్యా రంగానికి, 9 శాతం హెల్త్‌కేర్‌ రంగానికి దక్కాయి.

  • దేశంలోని టాప్‌-10 దాతలు మొత్తం రూ.5,834 కోట్ల విరాళాలిచ్చారు. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం అధికమిది. అంతేకాదు, లిస్ట్‌లోని అందరి విరాళాల్లో వీరి వాటాయే 56 శాతంగా ఉంది.

  • జాబితాలోని టాప్‌ -25 దాతలు గత మూడేళ్లలో మొత్తం రూ.50,000 కోట్లు దానం చేశారు. అంటే, రోజుకు సగటున రూ.46 కోట్లు ఇచ్చారు.

Updated Date - Nov 07 , 2025 | 01:41 AM