Stock Market: మూడో రోజూ నష్టాలే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:46 AM
హెచ్1బీ వీసా ఫీజు పెంపు ఆందోళనల నేపథ్యంలో ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా...
సెన్సెక్స్ 58 పాయింట్లు డౌన్
ముంబై: హెచ్1బీ వీసా ఫీజు పెంపు ఆందోళనల నేపథ్యంలో ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్.. చివరికి 57.87 పాయింట్ల నష్టంతో 82,102.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 594 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. కాగా, నిఫ్టీ 32.85 పాయింట్లు కోల్పోయి 25,169.50 వద్ద స్థిరపడింది. ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు సూచీల నష్టాలకు కొంత మేర అడ్డుకట్ట వేయగలిగాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 17 నష్టపోయాయి. ట్రెంట్, టెక్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి.