SEBI Karvy Notice: కార్వీ మదుపరులు త్వరపడండి
ABN , Publish Date - May 17 , 2025 | 03:03 AM
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి డబ్బులు రాబట్టాల్సిన మదుపరులు జూన్ 2లోగా క్లెయిమ్‌లు సమర్పించాలని సెబీ హెచ్చరించింది. ఇప్పటికే ఎన్ఎస్ఈ కార్వీని డిఫాల్టర్‌గా ప్రకటించగా, పీఓఏ ద్వారా షేర్లు తాకట్టు పెట్టిన మదుపరులకు ఇది తుది అవకాశం.
జూన్ 2లోగా క్లెయిమ్‌లు సమర్పించండి : సెబీ
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి బకాయిలు తీసుకోవాల్సిన మదుపరులు త్వరగా తమ క్లెయిమ్‌లు సమర్పించాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోరింది. ఇందుకు వచ్చే నెల రెండవ తేదీనే తుది గడువు అని గుర్తు చేసింది. కేఎ్‌సబీఎల్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) 2023 నవంబరు 23న డిఫాల్టర్‌గా ప్రకటించింది. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ద్వారా తమ ఖాతాల్లోని షేర్లను కుదువపెట్టేందుకు కేఎస్‌బీఎల్‌కు అధికారం ఇచ్చిన మదుపరులు ఈ ఏడాది జూన్ 2 లోగా క్లెయుమ్‌లు సమర్పించాలని కోరింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే ఎన్‌ఎ్‌సఈ టోల్ ఫ్రీ నంబరు 1800 266 0050 (ఐవీఆర్ ఆప్షన్ 5ను ఎంచుకోవాలి) ద్వారా లేదా defaultisc@nse.co.in ఈ-మెయిల్ ద్వారా (ఎన్‌ఎస్ఈని సంప్రదించాలని కోరింది. గడువు దగ్గర పడుతున్నందున ఇప్పటి వరకు క్లెయిమ్స్ సమర్పించని మదుపరులు త్వరపడాలని కోరింది. పీఓఏ ద్వారా మదుపరుల ఖాతాల్లోని షేర్లను తాకట్టు పెట్టి, ఆ నిధులను ఇతర సంస్థలకు మళ్లించి, చెల్లింపుల్లో విఫలమవడంతో సెబీ 2023 ఏప్రిల్‌లో కేఎస్‌బీఎల్‌పై వేటు వేసింది.కేఎస్‌బీఎల్, దాని సీఎండీ సీ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనరాదని నిషేదించింది. దాంతో పాటు నిధుల దుర్వినయోగానికి రూ.21 కోట్ల జరిమానా కూడా విదించింది.