SBI Chairman Challa Srinivasulu Shetty: కార్పొరేట్ రుణాలకు పెరిగిన గిరాకీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:33 AM
ఆర్థిక వృద్ధి జోరందుకోవడంతో కార్పొరేట్ రుణాలకూ గిరాకీ పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి నాటికల్లా తమ బ్యాంకు పంపిణీ చేసే కార్పొరేట్ రుణాలు...
మార్చిలోగా రూ.7 లక్షల కోట్లకు చేరే అవకాశం
ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి జోరందుకోవడంతో కార్పొరేట్ రుణాలకూ గిరాకీ పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి నాటికల్లా తమ బ్యాంకు పంపిణీ చేసే కార్పొరేట్ రుణాలు రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. దీంతో సెప్టెంబరు త్రైమాసికంలో 7.1 శాతం మాత్రమే ఉన్న ఎస్‌బీఐ పరపతి వృద్ధి రేటు వచ్చే రెండు త్రైమాసికాల్లో రెండంకెలకు చేరే అవకాశం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడంతో కంపెనీల నుంచి వర్కింగ్ క్యాపిటల్ రుణాలతో పాటు టర్మ్ రుణాలు, ప్రాజెక్టు రుణాలకూ గిరాకీ పెరుగుతోందని ఆయన తెలిపారు.
పెరుగుతున్న వినియోగం
జీఎ్‌సటీ రేట్ల సవరణ, పండగ సీజన్‌తో దేశంలో వినియోగం అమాంతం పుంజుకుంది. దీంతో కంపెనీలు తమకు మంజూరైన వర్కింగ్ క్యాపిటల్ రుణ పరిమితిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్టు శెట్టి తెలిపారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన టర్మ్ లోన్లనూ (కాలపరిమితి రుణాలు) వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. కొత్త ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే రుణాల కోసం కూడా కంపెనీల నుంచి డిమాండ్ పెరిగిందన్నారు.
బాండ్స్ ద్వారా రూ.12,500 కోట్లు
అయితే కాలపరిమితి తీరే డిపాజిట్లు, ఇతర చెల్లింపుల కోసం మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.12,500 కోట్ల విలువైన రుణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంద ని శెట్టి చెప్పారు. డిసెంబరు 5న వెలువడే ద్రవ్య, పరపతి విధానంలో ఆర్‌బీఐ రెపో రేటు పావు శాతం తగ్గించినా దాని ప్రభావం తమ నికర వడ్డీ లాభాల (ఎన్‌ఐఎం)పై ఏమాత్రం ఉండదని ఎస్‌బీఐ చైర్మన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తమ ఎన్‌ఐఎంలు మూడు శాతానికి చేరతాయన్నారు. ఈ ద్రవ్య, పరపతి విధానంలోనూ ఆర్‌బీఐ కీలక రెపో రేటు పావు శాతానికి మించి తగ్గించకపోవచ్చని తెలిపారు.
సీఏఆర్ భళా
ప్రస్తుతం ఎస్‌బీఐ మూలధన సమృద్ధి నిష్పత్తి (సీఏఆర్) 15 శాతం వద్ద ఉందని శ్రీనివాసులు శెట్టి చెప్పారు. వచ్చే ఐదారు సంవత్సరాల వరకు సీఏఆర్ ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందన్నారు. దీంతో పరపతి వృద్ధి కోసం కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. ఎస్‌బీఐ ఈ ఏడాది జూలైలో క్యూఐపీ ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.25,000 కోట్లు సమీకరించింది. దీంతో బ్యాంకు సీఏఆర్ మరింత బలోపేతమైంది. ప్రస్తుతం ఉన్న 15 శాతం సీఏఆర్‌తో ఏటా రూ.12 లక్షల కోట్ల రుణ వితరణ సామర్ధ్యం ఎస్‌బీఐకి ఉందన్నారు.