RBI Governor: అన్ని వర్గాల అవసరాలు తీర్చాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:14 AM
ఫిన్‌టెక్ కంపెనీలు ఉత్పత్తుల రూపకల్పనలో సమాజంలోని దిగువ వర్గాలు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులకు సేవలందించేందుకు...
ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్‌బీఐ గవర్నర్ సూచన
ముంబై: ఫిన్‌టెక్ కంపెనీలు ఉత్పత్తుల రూపకల్పనలో సమాజంలోని దిగువ వర్గాలు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులకు సేవలందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. సంపన్నులకు సేవలందించడం లాభదాయకమే కాని...అదే సమయంలో అన్ని వర్గాలకు అవి ఉపయోగకరంగా ఉండడం కూడా ప్రధానమేనన్నారు. ఆర్థిక అక్షరాస్యత లేని వారు, వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న వ్యాపారు ల అవసరాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రధానంగా చిన్న వ్యాపార సంస్థలు, అల్పాదాయ వర్గాలకు అవసరమైనంతగా రుణం అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉన్నదన్న విషయం ఆయన గుర్తు చేశారు. ఫిన్‌టెక్ కంపెనీల ఉత్పత్తులు పారదర్శకంగా, ఖాతాదారుల డేటాను పరిరక్షించేలా ఉండాలని కోరారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ మోసాలపైనా ఆర్‌బీఐ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరం ఫైనాన్షి యల్ మార్కెట్ సాధనంగా ఆర్‌బీఐ ‘‘యునిఫైడ్ మార్కెట్స్ ఇంటర్‌ఫేస్’’ను రూపొందించినట్టు మల్హోత్రా చెప్పారు. ఇది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) ఉపయోగించుకుని ఆస్తులు, సెటిల్మెంట్లు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన తొలి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు చెప్పారు.
నిధులకు ఢోకా లేదు: ఎస్‌బీఐ చైర్మన్
లిస్టెడ్ కంపెనీల కొనుగోళ్లు, విలీనాలకు అవసరమైన రుణాలు సమకూర్చేందుకు తమ బ్యాంకుకు ఎలాంటి నిధుల కొరత లేదని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసలు శెట్టి తెలిపారు. ఇటీవల ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో, లిస్టెడ్ కంపెనీలు వేరే కంపెనీలను కొనుగోలు చేయడం లేదా విలీనాలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ఆర్‌బీఐ బ్యాంకులను అనుమతించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ విషయంలో తమ బ్యాంకుకు పూర్తి పరిజ్ఞానం ఉందన్నారు. ఇప్పటికే తమ బ్యాంకు భారతీయ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూపీఐ ద్వారా జరిగే రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు తమ సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని శెట్టి స్పష్టం చేశారు.