Satya Nadella Says New Hiring: కోతల తర్వాతే కొత్త నియామకాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:00 AM
కృత్రిమ మేధ ఉద్యోగాల స్వరూపమే మారిపోతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏఐతో...
ఏఐతో మారుతున్న ఉద్యోగాల స్వరూపం అయితే ఏఐతో మరింత ఉత్పాదకత
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాల స్వరూపమే మారిపోతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏఐతో ఉద్యోగుల పనితీరు మెరుగుపడి వారి ఉత్పాదకతా పెరుగుతోందన్నారు. బ్రాడ్ జెర్‌స్టనర్ అనే ఇన్వెస్టర్ నిర్వహించిన బీజీ2 అనే పాడ్‌కా్‌స్టలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఏఐ నైపుణ్యాలు లేని ఉద్యోగుల తొలగింపు పూర్తయిన తర్వాత మైక్రోసాఫ్ట్ మళ్లీ నియామకాల ప్రక్రియ ప్రారంభిస్తుందని కూడా సత్య నాదెళ్ల వెల్లడించారు. అయితే ఈ నియామకాల ప్రక్రియ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉందన్నారు. ఏఐ కారణంగా మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఇప్పటి వరకు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల మళ్లీ కొత్త నియామకాల గురించి మాట్లాడం విశేషం.
మార్పు సహజమే: ‘ఏఐ’ కారణంగా కార్పొరేట్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను సత్య నాదెళ్ల ‘సహజ’ మార్పులుగా అభివర్ణించారు. వివిధ సంస్థలు లేదా ఒకే సంస్థలో వివిధ విభాగాల మధ్య జరిగే సమాచారం మార్పిడి కోసం గతంలో పలు పద్దతులు ఉపయోగిస్తే.. ఇప్పుడు ఈ-మెయిల్స్, ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్లను ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కంపెనీల్లో పని స్థితిగతుల మెరుగుదల కోసం ఏఐ ఉపయోగించడం అలాంటిదేనన్నారు.
ఈ ఏడాది ‘లక్ష’కుపైగా కొలువులు ఔట్
ఈ ఏడాది ఇప్పటి వరకు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగులను తొలగించాయి. ఏఐతో పాటు వ్యాపారాల పునర్ వ్యవస్థీకరణ, ఖర్చులు తగ్గించుకునే ఆలోచన ఇందుకు ప్రధాన కారణం. మన దేశంలో టీసీఎస్ కూడా ఇప్పటి వరకు 12,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. వ్యాపార అవకాశాలు సన్నగిల్లడం, తీసి వేసిన ఉద్యోగుల్లో ఎక్కువ మందికి సరైన ఏఐ నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు కారణమని కంపెనీ వర్గాలంటున్నాయి.